గన్‌ఫౌండ్రీ: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఒకేరోజు రెండు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఓమహిళ కుడిచేయి కండరం తీసుకొని ముక్కుకు అతికించారు. అంతేకాక ఓ బీటెక్ విద్యార్థిని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించి నూతన రూపం ఇచ్చారు. వివరాలు..
► కరీంనగర్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన లింగమ్మ కూతురు రజిత(26)కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాదిపాటు సజావుగా సాగిన వారి కాపురంలో భర్త శ్రీనుకు అనుమానం రావడంతో ఆమెను పలుమార్లు విచక్షణారహితంగా కొట్టాడు. ఈ నేపథ్యంలో భార్యపై మరింత అనుమానం పెంచుకున్న శ్రీను ఆమె ముక్కును కోశాడు.
దీంతో మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతున్న ఆమె వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియా ఆస్పత్రికి పంపించడంతో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు శనివారం రాత్రి ఆమెకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కుడిచేయి కండరం తీసుకొని ముక్కుకు అతికించి అరుదైన చికిత్సను నిర్వహించారు.
► మహబూబ్‌నగర్ జిల్లా, అచ్చంపేటకు చెందిన చెన్నయ్య కుమార్తె కనకదుర్గ బీటెక్ పూర్తిచేసింది. చిన్నతనం నుంచి ఆమెకు కుడివైపు ముఖంపై చిన్నమచ్చలతో క్రమక్రమంగా ముఖంగాపై గుంతలు ఏర్పడి అందవికారంగా మారింది. చికిత్సల కోసం ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించింది.
ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆపరేషన్ నిర్వహించి ఆమెకు నూతన రూపం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోని బర్న్స్ వార్డ్‌లో చికిత్స పొందుతోంది. ఈ రెండు చికిత్సలలో హెచ్‌వోడీ డాక్టర్ నాగ ప్రసాద్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మధుసూదన్‌నాయక్, డాక్టర్ జైపాల్ రాథోడ్, రెహ్మాన్ ఖురేషీ, కృష్ణమూర్తి, గంగాభవానీ, జ్యోతి, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.