ఆరుగురు మహిళా అథ్లెట్లకు అవకాశం
పురుషుల విభాగంలో నీరజ్ చోప్రాకు చోటు
చండీగఢ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నూతన కార్యవర్గం తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 9 మంది అథ్లెట్లతో కూడిన ఏఎఫ్‌ఐ అథ్లెట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు మహిళా అథ్లెట్లు, ముగ్గురు పురుష అథ్లెట్లకు చోటు దక్కింది. తాజా ఎన్నికల్లో మరోసారి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ‘డబుల్ ఒలింపియన్’ మాజీ లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జి... ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుంది. ఈ కమిషన్‌లో అంజూతో పాటు జ్యోతిర్మయి సిక్దర్ (రన్నింగ్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), ఎండీ వల్సమ్మ (హర్డిల్స్), సుధా సింగ్ (స్టీపుల్‌ఛేజ్), సునీతా రాణి (రన్నింగ్) చోటు దక్కించుకున్నారు.
పురుషుల విభాగం నుంచి ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ సాగూతో పాటు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, అవినాశ్ సాబ్లే (స్టీపుల్ ఛేజ్) ఉన్నారు. గత కమిషన్‌లో నలుగురు మహిళలు ఉండగా... ఇప్పుడు వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతూ ఆ సంఖ్యను 6 చేశారు. బహదూర్ సింగ్ గతంలో సుదీర్ఘ కాలం ఈ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. బిజీ షెడ్యూల్ కారణంగా కమిషన్‌కు ఎక్కువ సమయం కేటాయించలేనని చెప్పినప్పటికీ... ఏఎఫ్‌ఐ ఎక్స్‌క్యూటివ్ కౌన్సిల్ నీరజ్ చోప్రాతో చర్చించి అతడిని కమిషన్‌లో భాగం చేసింది.
2012 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన అదిలె సుమరివాలా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న సుమరివాలాకు.. ఏఎఫ్‌ఐ ఎక్స్‌క్యూటివ్ కౌన్సిల్ సమావేశాలకు హజరయ్యే అధికారాలు ఉన్నాయి. డోపింగ్ ఉదంతాల వల్ల దేశ అథ్లెటిక్స్ ప్రభ మసకబారకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏఎఫ్‌ఐ నిర్ణయించింది. దీని కోసం అథ్లెట్ల శిక్షణకు సంబంధించిన వివరాలను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పర్యవేక్షించనుంది.
Comments
Please login to add a commentAdd a comment