long jump
-
పారిస్ ఒలింపిక్స్‌కు శ్రీశంకర్ దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ మోకాలి గాయంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్ సమయంలో శ్రీశంకర్ మోకాలికి గాయమైంది. ఈ గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించడంతో ఈ ఏడాది మొత్తం శ్రీశంకర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. కేరళకు చెందిన 25 ఏళ్ల శ్రీశంకర్ గత ఏడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 8.37 మీటర్ల దూరం దూకి రజత పతకం సాధించాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను కూడా సంపాదించాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2023 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన శ్రీశంకర్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడినా ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. -
లాంగ్‌జంప్ ఫైనల్లో జెస్విన్
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి నాలుగు రోజులు భారత్‌కు నిరాశ ఎదురవగా... ఐదోరోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల లాంగ్‌జంప్‌లో జెస్విన్ ఆ్రల్డిన్ ఫైనల్‌కు అర్హత సాధించగా... మరో లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ అనూహ్యంగా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో అన్ను రాణి కూడా ఆకట్టుకోలేకపోయింది. క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’లో పోటీపడ్డ తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల జెస్విన్ 8 మీటర్ల దూరం దూకి చివరిదైన 12వ క్వాలిఫయర్‌గా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడంతోపాటు ఏడో స్థానంలో నిలిచిన శ్రీశంకర్ ఈసారి నిరాశపరిచాడు. శ్రీశంకర్ 7.74 మీటర్ల దూరం దూకి ఓవరాల్‌గా 22వ ర్యాంక్‌లో నిలిచాడు. ఫైనల్ నేడు జరుగుతుంది. మహిళల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో అన్ను రాణి ఈటెను 57.05 మీటర్ల దూరం విసిరి 19వ ర్యాంక్‌లో నిలిచింది. -
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి భగవతి భవానికి కాంస్యం
చెంగ్డూ (చైనా): ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో బుధవారం భారత్‌కు రెండు పతకాలు లభించాయి. షూటింగ్లో ఇలవేనిల్ వలారివరన్–దివ్యాంశ్ సింగ్ పన్వర్ జోడీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రజతం సాధించారు. అథ్లెటిక్స్‌లో మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భగవతి భవాని యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఫైనల్లో ఇలవేనిల్–దివ్యాంశ్ ద్వయం 13–17తో యు జాంగ్–బుహాన్ సాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఇక లాంగ్‌జంప్ ఫైనల్లో విజయవాడకు చెందిన భవాని యాదవ్ 6.32 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
పారిస్ ఒలంపిక్స్‌కు శ్రీశంకర్ అర్హత
బ్యాంకాక్: భారత స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ (2024)కు అర్హత సాధించాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఈ ఘనత సాధింన తొలి భారత ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్లో అతను రజత పతకం సాధించాడు. 24 ఏళ్ల భారత అథ్లెట్ 8.37 మీటర్ల దూరం దుమికి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన అతని కెరీర్లోనే రెండో ఉత్తమ ప్రదర్శన కాగా... పారిస్ ఈవెంట్ క్వాలిఫికేషన్ మార్క్ (8.27 మీటర్లు)ను అధిగమించాడు. శ్రీశంకర్‌కు ఇది రెండో ఒలింపిక్స్ కాగా... గత టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధింన అతను క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగాడు. ఈ లాంగ్‌జంప్‌లో యు తంగ్ లిన్ (8.40 మీ.; చైనీస్ తైపీ) స్వరం గెలుపొందాడు. 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో రాజేశ్ రమేశ్, అమోజ్ జాకబ్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత బృందం పసిడి పతకంతో మెరిసింది. ఈ రిలే జట్టు పోటీని 3 నిమిషాల 14.70 సెకన్లలో పూర్తిచేసి కొత్త జాతీయ రికార్డును నిలకొల్పింది. గతంలో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నమోదు చేసిన 3ని.15.77 సె. రికార్డును తిరగరాసింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన సంతోష్ కుమార్ (49.09 సె.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే 2.26 మీ. ఎత్తు వరకు జంప్ చేసి రజతం గెలిచాడు. మహిళల హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ 5840 పాయింట్లతో రజతం గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ 200 మీటర్ల స్ప్రింట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆమె 23.29 సె. టైమింగ్‌తో ఫైనల్స్‌కు అర్హత పొందింది. శనివారం నాటి పోటీల్లో భారత్ ఒక పసిడి, మూడు రజతాలు, ఒక కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో 14 (6 స్వరాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు) పతకాలున్నాయి. చదవండి Wimbledon: మహిళల సింగిల్స్‌లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర -
శైలీ సింగ్‌కు కాంస్య పతకం
సేకో గోల్డెన్ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత యువ లాంగ్‌జంపర్ శైలీ సింగ్ కాంస్య పతకం సాధించింది. జపాన్‌లోని యోకోహామాలో ఆదివారం జరిగిన ఈ మీట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల శైలీ 6.65 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ సీనియర్ స్థాయిలో శైలికిదే తొలి టోర్నీ. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) హై పర్ఫార్మెన్స్ కోచ్ రాబర్ట్ బాబీ జార్జి వద్ద శిక్షణ తీసుకుంటున్న శైలీ 2021లో ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం దక్కించుకొని వెలుగులోకి వచ్చింది. హారిక గేమ్ ‘డ్రా’ నికోసియా (సైప్రస్): మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. కాటరీనా లాగ్నో (రష్యా)తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హారిక 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం హారిక నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది -
World Boxing Championship: హుసాముద్దీన్ శుభారంభం
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) శుభారంభం చేయగా... వరిందర్ సింగ్ (60 కేజీలు) మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అలెన్ రుస్తెమోవ్స్కీ (మెసెడోనియా)పై గెలుపొందగా... వరిందర్ 0–5తో తుర్సునోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి 13 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు. మురళీ శ్రీశంకర్‌కు స్వర్ణం Murali Shankar Won Gold At MVA High Performance: ఎంవీఏ హై పెర్ఫార్మన్స్ అథ్లెటిక్స్ మీట్లో భారత ప్లేయర్ మురళీ శ్రీశంకర్ లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ మీట్లో 24 ఏళ్ల శ్రీశంకర్ 8.29 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ మీట్లో శ్రీశంకర్ వచ్చే ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అర్హత ప్రమాణాన్ని (8.25 మీటర్లు) అధిగమించాడు. అయితే మైదానంలో గాలివేగం నిర్ణీత ప్రమాణంకంటే ఎక్కువ ఉండటంతో శ్రీశంకర్ ప్రదర్శనకు ప్రపంచ చాంపియన్‌షిప్ బెర్త్ లభించలేదు. -
డైమండ్ లీగ్ అథ్లెటిక్స్.. శ్రీశంకర్‌కు ఆరో స్థానం
మొనాకో: భారత లాంగ్‌జంపర్, కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత మురళీ శ్రీశంకర్‌కు ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ కలిసి రాలేదు. బర్మింగ్‌హామ్ మెగా ఈవెంట్ ముగియగానే తన తొలి డైమండ్ లీగ్‌లో పోటీ పడేందుకు మొనాకో వెళ్లిన అతనికి నిరాశే ఎదురైంది. అక్కడి వాతావరణం, గాలి వేగం అతని ప్రదర్శనకు ప్రతికూలంగా మారింది. 23 ఏళ్ల మురళీ తన ఐదు ప్రయత్నాల్లో మెరుగైన ప్రదర్శనగా 7.94 మీటర్ల దూరం దూకాడు. ఈ సీజన్లో 8.36 మీ. ప్రదర్శనతో పోలిస్తే ఇది పేలవమైన జంప్. కామన్వెల్త్ గేమ్స్‌లో అతను 8.08 మీ. జంప్ చేసి రజతం నెగ్గాడు. కానీ డైమండ్ లీగ్‌లో మాత్రం 8 మీటర్ల దూరమైన దూకలేకపోవడంతో ఆరో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్ నిబంధనల ప్రకారం ఇక్కడ పోటీలో ఉన్నవారందరికీ ఆరు ప్రయత్నాలు ఉండవు. కేవలం టాప్–3 అథ్లెట్లకు మాత్రమే ఆరో జంప్‌కు అవకాశమిస్తారు. మిగతావారంతా ఐదు జంప్లకే పరిమితం అవుతారు. 23 ఏళ్ల శ్రీశంకర్ ఇప్పుడు రాబోయే మరో ఈవెంట్‌పై ఆశలు పెట్టుకున్నాడు. ఈ నెల 30 నుంచి స్విట్జర్లాండ్‌లోని లూసానేలో వరల్డ్ అథ్లెటిక్స్ టూర్ పోటీల్లో అతను పోటీ పడతాడు. చదవండి: Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా అవుట్ -
మేజర్ సర్జరీ.. లాంగ్ జంప్ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్?
ఒక ఇంట్లో తండ్రి మంచి క్రీడాకారుడైనంత మాత్రాన అతడి వారసులు(కొడుకు లేదా కూతురు) అలాగే అవ్వాలని ఎక్కడా రాసిపెట్టి ఉండదు. అయితే, కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ వారసులు కూడా క్రీడాకారులు అవ్వాలని.. రాణించాలని ఆశపడుతుంటారు. మరికొంత మంది మాత్రం తాము ఏం కావాలనుకుంటున్నామో అన్న నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తారు. ఆ ప్రయత్నంలో కొంతమంది పిల్లలు విఫలమైతే.. మరికొందరు మాత్రం వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతారు. ఆ కోవకు చెందినవాడే భారత్ హై జంప్ స్టార్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్. తన అపూర్వ విజయంతో తల్లిదండ్రులతో పాటు యావత్ భారతావనిని గర్వపడేలా చేశాడు. బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో హై జంప్ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకి రజతం ఒడిసిపట్టాడు. ఇక శ్రీశంకర్ ఆర్థికంగా ఏనాడు ఇబ్బంది పడనప్పటికి.. ఈరోజు పతకం సాధించాడంటే అందులో తన పాత్ర ఎంత ఎందో.. కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే కావడం శ్రీశంకర్‌కు కలిసి వచ్చింది. తల్లి కెఎస్ బిజ్మోల్ 800 మీటర్ల క్రీడాకారిణి.. తండ్రి ఎకోస్ బిజ్మోల్ అథ్లెటిక్స్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఇంకేముంది తల్లిదండ్రులిద్దరు క్రీడా విభాగంతో పరిచయం ఉంటే శ్రీశంకర్ క్రీడాకారుడు కాకుండా ఇంకేం అవుతాడు. కుటుంబంతో మురళీ శ్రీశంకర్ 2018 కామన్వెల్త్ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు మురళీ శ్రీశంకర్. అపెండిస్ రూపంలో అతనికి సమస్య వచ్చి పడింది. నొప్పిని భరించలేక కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. లాంగ్ జంప్ చేస్తే సమస్యలు చుట్టుముడుతాయన్నారు వైద్యులు. కానీ అపెండిస్ ఆపరేషన్ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా శ్రీశంకర్ లాంగ్‌జంప్‌లో ఈ నాలుగేళ్లలో తనను తాను చాలా మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్ ఔరా అనిపించాడు. మురళీ శ్రీశంకర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. ►శ్రీశంకర్ తాను సాధన చేసే సమయంలో ఎలాంటి డిస్టర్బన్స్ లేకుండా చూసుకోవడం అలవాటు. తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనూ అంతేనంట. ఒక సందర్బంలో శ్రీశంకర్ తండ్రి మొబైల్‌కు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడు. ఆ పాట సౌండ్ శంకర్‌కు వినిపించింది. వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి నా ప్రాక్టీస్ సమయంలో నాకు ఎలాంటి సౌండ్ వినిపించొద్దు.. అలా అయితే నేను డిస్ట్రబ్ అవుతా అని చెప్పాడట. అంతే ఆప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీశంకర్ ప్రాక్టీస్ సమయంలో తండ్రి మ్యూజిక్‌ను బ్యాన్ చేస్తూనే వచ్చాడు. శ్రీశంకర్ తెచ్చిన ఈ రూల్ ఇప్పటికి ఆ కుటుంబసభ్యులు పాటిస్తూనే ఉన్నారు. 11 గంటల తర్వాత టీవీ కట్.. ►ఇక రాత్రి 11 గంటల తర్వాత శ్రీశంకర్ ఇంట్లో ఎవరు టీవీ చూడరు. అది ఎంత పెద్ద మ్యాచ్ గాని.. ఇంట్లో మాత్రం టీవీ ఆన్ చేయరు. తాజాగా శ్రీశంకర్ ఒక మెగాటోర్నమెంట్‌లో పాల్గొంటూ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసి కూడా టీవీ పెట్టలేదంటే వాళ్లు తమ నిర్ణయానికి ఎంత కట్టుబడి ఉన్నారో తెలుస్తోంది. తమ కొడుకు కామన్వెల్త్లో రజతం సాధించాడన్న వార్తను ఆ తల్లిదండ్రులు ఉదయమే తెలుసుకోవడం విశేషం. ►శ్రీశంకర్ తనకు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి దూరంగా ఉన్నాడు. తల్లిదండ్రులు తనపై ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని ఏనాడు నెగిటివ్‌గా తీసుకోలేదు. వాళ్లు పెట్టే కండీషన్స్ వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీశంకర్ బలంగా నమ్ముతాడు. చదువులో మెరిట్.. ►సాధారణంగా క్రీడాకారులుగా మారేవాళ్లకు సరిగ్గా చదువు అబ్బదంటారు. కానీ ఈ విషయంలో శ్రీశంకర్ పూర్తిగా వేరు. ఆటలో ఎంత చురుకుగా ఉండేవాడో.. చదువులోనూ అంతే చురుకుదనాన్ని చూపించేవాడు. మ్యాచ్‌లు లేని సమయంలో చదువుకునే శ్రీశంకర్.. ఒకవేళ తాను పాల్గొనబోయే గేమ్స్‌లో సమయం దొరికితే కూడా చదువుకునేవాడు. అలా 10వ తరగతి, ఇంటర్మీడియెట్లు 95 శాతం మార్కులతో పాసయ్యాడు. ►ఆ తర్వాత నీట్ పరీక్షలో స్పోర్ట్స్ కోటాలో సెకండ్ ర్యాంక్ సాధించిన మురళీ శ్రీశంకర్ మెరిట్లో బీఎస్సీ మాథ్స్‌ను పూర్తి చేశాడు. నీట్లో తనకొచ్చిన మార్కులతో మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికి వేరే కారణాల వల్ల మెడిసిన్ చేయలేదు. ఇక్కడ విచిత్రమేంటంటే.. మెరిట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికి శ్రీశంకర్ ఇప్పటికి నిరుద్యోగే.'' చదువు మనకు బ్రతికే తెలివిని నేర్పిస్తుంది.. నాతో సహా నా మిత్రులందరూ ఇప్పటికీ ఏ ఉద్యోగాలు చేయడం లేదంటే నమ్ముతారా.. భారత్ కదా ఈ పరిస్థితి మాములే'' అని ఒక సందర్బంలో చెప్పుకొచ్చాడు. మద్యం, సిగరెట్లకు ఆమడ దూరం ►శ్రీశంకర్ ఇచ్చే పార్టీల్లో ఫ్రూట్ జ్యూస్‌లు తప్ప ఇంకేం కనిపించవు. ఎందుకంటే శ్రీశంకర్ ఆల్కహాల్‌ను ఎంకరేజ్ చెయ్యడు. తన మిత్రుల్లో చాలా మంది మందు, సిగరెట్లు అలవాట్లు ఉన్నవారే. కానీ శ్రీశంకర్ పార్టీలిచ్చినా.. ఏ పార్టీలకు వెళ్లినా అక్కడ నో ఆల్కాహాల్.. నో సిగరెట్. ఎందుకంటే శ్రీశంకర్‌కు మేమిచ్చే గౌరవమని అతని స్నేహితులు పేర్కొంటారు. ''శంకు(మురళీ శ్రీశంకర్ ముద్దుపేరు) నా కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా వాడు చూపించే ప్రేమ, గౌరవం ఎప్పుడు తగ్గిపోలేదు. స్కూల్ వయసు నుంచి వాడిని ఒక మంచి అథ్లెట్‌గా చూడాలని కఠిన నిబంధనల మధ్య పెంచినా.. ఒక్కసారి కూడా మాకు ఎదురుచెప్పడం చూడలేదు. అందుకే ఈరోజు దేశం గర్వించే స్థాయికి చేరుకున్నాడు'' - తల్లి కెస్ బిజ్మోల్ ''వాడు(శ్రీశంకర్) కష్టపడే తత్వాన్ని ఎప్పుడు వదల్లేదు. ఏనాడు షార్ట్‌కట్స్, అడ్డదారులు తొక్కలేదు. చిన్నప్పటి నుంచి కష్టపడిన తత్వమే ఈరోజు ఈస్థాయిలో నిలబెట్టింది. ఒక తండ్రిగా నాకు ఇంతకమించి ఏముంటుంది. నా మాటకు ఎదురుచెప్పకుండా ఎన్నో చేశాడు.. అలాంటి వాడి కోసం నేను చేసిన త్యాగాలు చాలా చిన్నవి. వాడు నా కొడుకుగా పుట్టడం నాకు గర్వకారణం' - తండ్రి ఎకోస్ బిజ్మోల్ Keep watching that 8.08m jump on a loop...it's a Silver Medal for #India from Murli Sreeshankar 🇮🇳#CommonwealthGames2022 Congratulations India, Congratulations Sree!@birminghamcg22 pic.twitter.com/Rzec3zHWyO — Athletics Federation of India (@afiindia) August 5, 2022 The First Medal of the Day 💪 Murali Sreeshankar wins the first medal of the day with his 🥈 win and takes India to a medal count of 19 in #CWG2022 🔥#BirminghamMeinJitegaHindustanHamara 🫶#B2022 #SirfSonyPeDikhega #SonySportsNetwork pic.twitter.com/dcbAFO0Wgu — Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2022 చదవండి: Commonwealth Games 2022: మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్ ప్రాక్టీస్; కట్‌చేస్తే -
మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది. బుధవారం హై జంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించిన ఆ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో భారత్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల లాంగ్ జంప్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్‌లో లాంగ్‌జంప్ విభాగంలో ఇది మూడో పతకం. ఇంతకముందు 2002 ,2010లో మహిళల లాంగ్ జంప్ విభాగంలో అంజూ బాబీ జార్జీ(కాంస్యం), ప్రజూషా మాలిక్కల్(రజతం) పతకాలు సాధించారు. భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన లాంగ్ జంప్ ఫైనల్లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. కాగా బహమాస్‌కు చెందిన లకాన్ నైర్న్ కూడా 8.08 మీటర్లే దూకి స్వర్ణం గెలిచాడు. ఎందుకంటే లకాన్ రెండో ఉత్తమ ప్రదర్శన(7.98 మీటర్లు).. శ్రీశంకర్(7.84 మీటర్లు) కన్నా ఎక్కువగా ఉండడమే కారణం. జమైకాకు చెందిన థాంప్సన్(8.05 మీటర్లు) దూకి కాంస్యం గెలిచాడు. కాగా కేరళకు చెందిన 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ 2018 కామన్వెల్త్ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు. అపెండిస్ సమస్యతో కామన్వెల్త్కు దూరమైన మురళీ శ్రీ శంకర్ ఇకపై లాంగ్ జంప్ చేయకపోవచ్చు అని అంతా భావించారు. కానీ అపెండిస్ ఆపరేషన్ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా లాంగ్‌జంప్‌లో తనను తాను మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్ ఔరా అనిపించాడు. SOARING HIGH 🤩🤩 🥈 #SreeshankarMurali after the historic feat at #CommonwealthGames in Men's Long Jump 😍😍#Cheer4India #India4CWG2022 pic.twitter.com/BdPt80MQwo — SAI Media (@Media_SAI) August 4, 2022 -
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోభారత లాంగ్ జంపర్‌కు నిరాశ
Sreeshankar: అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో అందరి మన్ననలు అందుకున్న భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో అతను కేవలం 7.96 మీటర్లు మాత్రమే జంప్ చేసి ఉసూరుమనిపించాడు. ఫలితంగా ఏడో స్థానంతో సరిపెట్టుకుని పతకం లేకుండానే టోర్నీ నుంచి వైదొలిగాడు. శ్రీశంకర్ ప్రస్తుత ప్రదర్శన ఈ ఏడాది ఫెడరేషన్ కప్ ప్రదర్శనతో (8.36 మీటర్లు) పోలిస్తే చాలా తక్కువ. మరోవైపు పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో భారత ఆటగాడు ఎం.పి. జబిర్ 50.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఏడో స్థానంలో నిలిచాడు. ఫలితంగా అతను ఫైనల్‌కు కూడా చేరుకుండానే నిష్క్రమించాడు. చదవండి: World Athletics Championships: ఫైనల్‌కు చేరిన శ్రీశంకర్.. తొలి భారతీయుడిగా రికార్డు! -
World Athletics Championships: ఫైనల్‌కు చేరిన శ్రీశంకర్.. తొలి భారతీయుడిగా రికార్డు!
అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారతీయ లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన క్వాలిఫికేషన్స్ రౌండ్లో 8 మీటర్ల జంప్ చేసిన శ్రీశంకర్ పురుషుల లాంగ్‌జంప్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లాంగ్‌జంప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి పురుష అథ్లెట్‌గా శ్రీశంకర్ రికార్డులకెక్కాడు. కాగా 2003 పారిస్ వేదికగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మహిళల లాంగ్ జంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయరాలుగా అంజు బాబీ జార్జ్ నిలిచింది. ఇక ఇదే ఈవెంట్లో పోటీ పడ్డ మరో ఇద్దరు భారత అథ్లెట్లు జస్విన్ ఆల్డ్రిన్ (7.79 మీ), మొహమ్మద్ అనీస్ యాహియా (7.73 మీ) లు ఫైనల్‌కు ఆర్హత సాధించ లేకపోయారు. అదే విధంగా ఈ టోర్నీలో అవినాష్ సాబ్లే 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ క్రీడలో 8:18.75 టైమింగ్‌తో మూడవ స్థానంలో నిలిచి.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత ఆర్మీ ఉద్యోగి అయినా అవినాష్ 8:8:75 నిమిషాల్లో పూర్తిచేసి నేరుగా ఫైనల్లో అడుగు పెట్టాడు. చదవండి: World Athletics Championships: 90 మీటర్లే టార్గెట్‌గా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా -
సంకల్పిస్తే... రాదన్నది లేదు
కష్టాలేమీ లేనప్పుడు మనలో బలమెంత ఉందో మనకు కూడా తెలియదు. ఆ కష్టం దాటాక మనలోని బలమెంతో మనతోబాటు పదిమందికీ తెలుస్తుంది. ఈ మాటలకు అర్థం ఆరుపదుల వయసులో ఉన్న రాధతో మాట్లాడితే తెలుస్తుంది. పెద్ద వయసులో ఇంకేం చేస్తారులే అనుకోకుండా క్రీడల్లో తనని తాను నిరూపించుకుంటూ నేటి యువతకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేటలో ఉంటున్న రాధ ఆరు పదుల వయసులో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హ్యామర్ త్రో వంటివి చేస్తూ క్రీడలకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. ఈ వయసులో మెడల్స్ సాధిస్తూ అథ్లెట్‌గా రాణిస్తున్నారు. క్రీడలంటే ఉన్న ఆసక్తి గురించి మాట్లాడినప్పుడు రాధ తన జీవిత విశేషాలను ఎంతో ఆనందంగా ఇలా పంచుకున్నారు. అవన్నీ నేటి మహిళలకు స్ఫూర్తినిచ్చే వాక్కులు. జీరో నుంచి మొదలు ‘ముప్పై ఐదేళ్లుగా టీచర్‌గా చేస్తున్నాను. పాతికేళ్లుగా స్కూల్స్ నడుపుతున్నాను. నిజానికి నేను సెవంత్ క్లాస్ డ్రాపౌట్ స్టూడెంట్‌ని. పెళ్లి చెయ్యాలి అనుకోగానే ఇంట్లో చదువు మానిపించారు. మెట్రిక్యులేషన్‌కు ఇంటి నుంచే ఫీజు కట్టించారు. ఆ తర్వాత పెళ్లి అయింది. మా వారిది బిజినెస్. ఇద్దరు పిల్లలకు ఐదేళ్లు వచ్చేసరికి బిజినెస్‌లో పూర్తి లాస్. జీవితం జీరో అయిపోయింది. అప్పుడు ఎలా ఈ జీవితాన్ని కొనసాగించాలో అర్థం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు. ఎటూ దిక్కుతోచని పరిస్థితి. ఈ లైఫ్ ఎందుకు అనే డిప్రెషన్ వచ్చేసింది. దాని నుంచి ఎలాగో బయటపడి పెళ్లి తర్వాత చదువును కొనసాగించా. కష్టపడి బీఈడీ చేయడంతో టీచర్‌గా మళ్లీ నా లైఫ్‌ని కొనసాగించాను. డబ్బులు సరిపోవని సాయంత్రాలు ట్యూషన్లు చెప్పడంతో నా పిల్లలకు చదువులు చెప్పించగలిగాను. పిల్లలు పెద్దవడంతో వాళ్లూ నాకు సాయంగా ఉండటం మొదలుపెట్టారు. పదిహేనేళ్లు ఉద్యోగం చేశాక బొల్లారంలో గీతాంజలి స్కూల్ ప్రారంభించాను. ఆ తర్వాత మరో ఐదేళ్లలో నిజాంపేటలో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశాను. డిజైనర్ డ్రెస్సులతో విదేశాలకు.. నాకు డ్రెస్ డిజైన్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఎందుకు వదులుకోవడం అని స్కూల్ నడుపుతూనే బొటిక్ కూడా స్టార్ట్ చేశా. అది కూడా చాలా సక్సెస్ అయ్యింది. వీటిని తర్వాత్తర్వాత విదేశాలకు ఆర్డర్లమీద పంపించేదాన్ని. అమెరికాలో జరిగిన ఈవెంట్స్‌లో కూడా నా బొటిక్ డిజైన్స్ డిస్ప్లే చేసి, సేల్ చేసేదాన్ని. మెడల్స్‌ను తీసుకొచ్చిన ఇష్టం బిహెచ్ఇఎల్ లో ఉన్నప్పుడు అక్కడి స్టేడియమ్ పిల్లలను స్కేటింగ్‌కి తీసుకెళ్లేదాన్ని. వారిని స్కేటింగ్‌లో వదిలేసి, నేనూ స్పోర్ట్స్‌లో పాల్గొనేదాన్ని. హ్యామర్ త్రోలో పాల్గొన్నప్పుడు సెకండ్ మెడల్ వచ్చింది. దాంతో మరింత పట్టుదల పెరిగింది. స్పోర్ట్స్ మీట్ ఉన్నప్పుడు వారం మొత్తం ప్రాక్టీస్ తప్పనిసరి. హ్యామర్ త్రో కి చాలా ఫిట్నెస్ అవసరం. మహిళల విభాగంలో నాలుగు కేజీల బరువైన ఐరన్ బాల్ని విసరాలి. సాధారణంగా నలభైఐదు దాటాక ఆక్సిజన్ లెవల్స్, శారీరక ఫిట్నెస్ తగ్గుతుంటాయి దీనిని పెంచుకోవాలంటే రోజూ వాకింగ్, వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అలా, 35 ఏళ్లుగా నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటూ వచ్చాను. దీంతో ఇటీవల బెంగళూరులో జరిగిన టోర్నమెంట్లో నాలుగు మెడల్స్, హన్మకొండలో జరిగిన స్పోర్ట్స్ మీట్లో 3 మెడల్స్ వచ్చాయి. ప్రతి ఏడాది జరిగే స్పోర్ట్స్ మీట్లో తప్పనిసరిగా పాల్గొంటాను. ఫిట్నెస్ లేకుండా డైరెక్ట్‌గా లాంగ్ జంప్ లేదా ట్రిపుల్ జంప్ చేసినా, రన్నింగ్ చేసినా సమస్యలు వస్తాయి. అందుకే రోజూ ఒక గంటైనా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఎవరైనా అడిగితే ఉచితంగా కోచింగ్ ఇస్తుంటాను. ఏ జిల్లాలోనైనా పది మంది మహిళలు ‘జట్టుగా ఉన్నాం, మాకు గ్రౌండ్ ఉంది, టోర్నమెంట్లో పాల్గొంటాం’ అని మాకు తెలియజేసినా... అలాంటి వారికి ఉచితంగా కోచ్‌ని ఏర్పాటు చేస్తాం. ఏమీ చేయలేని పరిస్థితులు వచ్చాయి కదా! అనుకున్నప్పుడు మళ్లీ స్టాండ్ అవ్వాలని బలంగా అనుకున్నాను. అలాగే జరిగింది. ఆ రోజుల్లో నేనేమీ చేయలేను అనుకుంటే నా పిల్లల భవిష్యత్తు ఏమయ్యేదో. ఎవరికైనా ఇష్టాయిష్టాలు ఉంటాయి. కానీ, కుటుంబం నిలబడాలంటే త్యాగాలు తప్పవు. కష్టం వస్తేనే సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. కుటుంబం నిలబడాలంటే మనం బలంగా ఉండాలి. అందుకు మనలో ఏ శక్తి ఉందో తెలుసుకొని, ఆచరణలో పెట్టాలి. అప్పుడు తప్పక విజయం సొంతం అవుతుంది’’ అంటూ తన జీవితాన్ని నేటి మహిళలకు ఓ ఉదాహరణగా వివరించారు రాధ. – నిర్మలారెడ్డి -
Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్..
న్యూఢిల్లీ: అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరఫున లాంగ్ జంప్ ఈవెంట్లో 17 ఏళ్ల షైలీ సింగ్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఆమె మైమరిచి చిందేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో షైలీ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన షైలీ.. నైరోబి ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 6.59 మీటర్లు దూకి రజతం సాధించింది. #WorldAthleticsU20 Silver Medalist #ShailiSingh celebrates her glorious return by dancing on the tune of a Punjabi song at SAI, Bangalore Take a look 😀@ianuragthakur @NisithPramanik @YASMinistry @IndiaSports @DGSAI @afiindia @Adille1 @NsscSai @ddsportschannel @AkashvaniAIR pic.twitter.com/hWzuezycEL — SAI Media (@Media_SAI) August 27, 2021 అనంతరం ఆమె భారత్‌కు తిరిగొచ్చాక బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) సెంటర్లో పతకం గెలిచిన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ.. పాపులర్ పంజాబీ పాటకు బాంగ్రా నృత్యం చేసింది. ఈ డ్యాన్స్ వీడియోను సాయ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కాగా, షెల్లీ సింగ్ కేవలం 1 సెంటీమీటర్ దూరంతో స్వర్ణాన్ని కోల్పోయింది. స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల మజా అస్కాగ్ 6.60 మీటర్లు దూకి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. చదవండి: వినోద్ కూమార్‌కు కాంస్యం.. భారత్ ఖాతాలో మూడో పతకం -
Shaili Singh: సెంటి మీటర్ తేడాతో స్వర్ణం చేజారె!
నైరోబి: ఒకే ఒక సెంటిమీటర్ దూరం భారత అథ్లెట్ శైలీ సింగ్‌ను స్వర్ణానికి దూరం చేసింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ (అండర్–20) చాంపియన్‌షిప్‌లో ఆమె రజతం గెలిచినా... వెంట్రుకవాసిలో పసిడి దక్కకపోవడమనేది అథ్లెట్‌ను బాగా నిరాశపరిచే అంశం. కెన్యా రాజధానిలో ఆదివారం ముగిసిన ఈ జూనియర్ మెగా ఈవెంట్లో లాంగ్‌జంపర్ శైలీ ఆదివారం ఫైనల్స్‌లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 12 మంది పోటీపడిన మహిళల లాంగ్‌జంప్ ఫైనల్లో స్వీడన్‌కు చెందిన మజ అస్కగ్ 6.60 మీటర్ల దూరం దూకి బంగారు పతకం సాధించింది. (మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా) భారత లాంగ్‌జంపర్ శైలీ కూడా తానేం తక్కువ కాదని 6.59 మీటర్ల దూరం దూకింది. అర అంగుళం కంటే తక్కువ తేడాతో బంగారాన్ని కోల్పోయింది. తొలి, రెండో ప్రయత్నంలో ఆమె 6.34 మీ. దూరాన్ని నమోదు చేసింది. రెండో ప్రయత్నం ముగిసే సరికి హొరియెలొవా (6.50 మీ.; ఉక్రెయిన్) ఆధిక్యంలో నిలువగా, ఎబొసెలె (6.46మీ.; స్పెయిన్), శైలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మూడో ప్రయత్నం (6.59 మీ.) శైలీని స్వర్ణావకాశానికి దగ్గర చేసింది. అప్పటికి అస్కగ్ (6.44 మీ.) పతకం బరిలోకి రానేలేదు. కానీ నాలుగో ప్రయత్నం అస్కగ్ (6.60 మీ.)ను చాంపియన్‌గా చేస్తే, భారత అథ్లెట్ 4, 5 ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. ఆఖరి ఆరో ప్రయత్నం సఫలమైనా... 6.37 మీటర్ల దూరమే దూకింది. దీంతో చివరకు రజతమే ఖాయమైంది. ఉక్రెయిన్ అథ్లెట్ మరియా హొరియెలొవా (6.50 మీ.) కాంస్యం గెలిచింది. చదవండి: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత మహిళల రిలేలో నాలుగో స్థానం తెలుగమ్మాయి కుంజా రజిత భాగంగా ఉన్న 4 X 400 మీటర్ల రిలేలో భారత జట్టుకు నాలుగో స్థానం దక్కింది. మహిళల ఫైనల్లో రజిత, ప్రియా మోహన్, పాయల్ వోహ్రా, సమ్మీలతో కూడిన జట్టు పోటీని 3 నిమిషాల 40.45 సెకన్లలో పూర్తి చేసింది. ఇందులో నైజీరియా అమ్మాయిలు 3 ని.31.46 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలిస్తే, జమైకా జట్టు (3ని.36.57 సె.) రజతం, ఇటలీ బృందం (3ని.37.18 సె.) కాంస్యం గెలుపొందింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో స్వల్పతేడాతో భారత అథ్లెట్ డొనాల్డ్ మకిమయిరాజ్ (15.82 మీ.) కాంస్య పతకం కోల్పోయాడు. ఇతని కంటే మూడు సె.మీ.దూరం దూకిన సైమన్ గోర్ (15.85 మీ.; ఫ్రాన్స్)కు కాంస్యం లభించగా, మకిమయిరాజ్‌కు నాలుగో స్థానం దక్కింది. ఇందులో గాబ్రియెల్ (16.43 మీ.; స్వీడెన్), హిబెర్ట్ (16.05 మీ.; జమైకా) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మహిళల 5000 మీ. ఫైనల్లో అంకిత నిరాశపరిచింది. పది మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆమె (17 ని.17.68 సెకన్లు) ఎనిమిదో స్థానంలో నిలిచింది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 1 రజతం, 2 కాంస్యాలతో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలను ముగించింది. నేను 6.59 మీటర్ల తర్వాత ఇంకాస్త దూరాన్ని నమోదు చేయాల్సింది. స్వర్ణం గెలిచే అవకాశాలు ఇంకా మూడు ప్రయత్నాల రూపంలో ఉన్నా... అనుకున్నది సాధించలేకపోయాను. నా తల్లి పసిడిపైనే కన్నేయాలి. జాతీయ గీతాన్ని వినిపించాలని చెప్పింది. అలా కుదరకపోవడం నన్ను బాధించింది. నాకు ఇంకా 17 ఏళ్లే. మరో జూనియర్ ఈవెంట్లో తలపడే అవకాశం ఉంది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ కూడా జరగనుండటంతో మరింత మెరుగైన ప్రదర్శనతో స్వర్ణాన్ని సాకారం చేసుకుంటా’ – శైలీ సింగ్ -
శైలీ 6.40 మీటర్ల జంప్
నైరోబీ: వరల్డ్ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ శైలీ సింగ్ సత్తా చాటింది. మహిళల లాంగ్ జంప్‌లో ఆమె ఫైనల్‌కు అర్హత సాధించింది. శైలీ తన మూడో ప్రయత్నంలో 6.40 మీటర్లు దూకింది. అధికారిక ఆటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్ 6.35 మీటర్లు కావడంతో ఆమె నేరుగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన శైలీ ప్రతిభను గుర్తించి భారత దిగ్గజం అంజూ బాబీ జార్జ్ ఆమెను తన అకాడమీలో సానబెట్టింది. ప్రస్తుతం శైలి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రంలో శిక్షణ పొందుతోంది. ఆదివారం ఈ భారత అథ్లెట్ ఫైనల్ బరిలోకి దిగనుంది. పురుషుల జావెలిన్ త్రోలో మన జట్టుకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఫైనల్‌కు చేరిన ఆశలు రేపిన భారత త్రోయర్లు అజయ్ రాజ్ సింగ్, జై కుమార్ వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచారు. అజయ్ 73.68 మీటర్లు త్రో విసరగా, జై కుమార్ జావెలిన్ 70.74 మీటర్ల వరకు వెళ్లింది. పురుషుల 300 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సునీల్ జోలియా (9 నిమిషాల 49.23 సెకన్లు) ఓవరాల్‌గా 22వ స్థానంలో, పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్సే ఓవరాల్‌గా 17వ స్థానంలో నిలిచి నిష్క్రమించారు. మహిళల 1500 మీటర్ల పరుగులో పూజ హీట్ 1లో 11వ స్థానానికే పరిమితమై ముందంజ వేయలేకపోయింది. నందిని, శ్రీనివాస్‌లకు నిరాశ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు దురదృష్టవశాత్తూ ముందంజ వేయలేకపోయారు. అగసార నందిని (తెలంగాణ) మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సెమీ ఫైనల్లో నిష్క్రమించింది. 14.16 సెకన్లలో పరుగు పూర్తి చేసిన నందిన సెమీస్ (హీట్ 2)లో ఆరో స్థానంతో ముగించింది. అంతకుముందు హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి నందిని సెమీస్‌కు అర్హత సాధించింది. పురుషుల 200 మీటర్ల పరుగులో నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. 21.33 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన అతను హీట్స్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. -
నందిని ‘పసిడి’ జంప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు తెలంగాణకు రెండు పతకాలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక పతకం లభించాయి. గువాహటిలో శనివారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసారా నందిని అండర్–18 బాలికల లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... అండర్–20 బాలుర షాట్‌పుట్ ఈవెంట్లో మొహమ్మద్ మోసిన్ ఖురేషీ కాంస్య పతకం సాధించాడు. అండర్–18 బాలికల లాంగ్‌జంప్‌లోనే ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జెమ్మెల లక్ష్మీ రజత పతకం దక్కించుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మీ 5.38 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని అయిన నందిని లాంగ్‌జంప్ ఫైనల్లో 5.80 మీటర్ల దూరం దూకి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ‘ద్రోణాచార్య అవార్డు గ్రహీత’ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న నందిని గత ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. ‘జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొనే ప్రతీ టోర్నీలో విజయం సాధించేందుకు, పతకాలు గెలిచేందుకు వందశాతం కృషి చేస్తాను. రాష్ట్రంతోపాటు దేశానికి పేరు తెచ్చేలా శ్రమిస్తాను. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి పతకం సాధించడమే నా సుదీర్ఘ లక్ష్యం’ అని నందిని వ్యాఖ్యానించింది. షాట్‌పుట్ ఫైనల్లో మోసిన్ ఖురేషీ ఇనుప గుండును 16.36 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. -
ఒక్క కిడ్నీ.. వేయి విజయాలు
అంజూ జార్జ్ ఇవాళ ట్విటర్ ద్వారా క్రీడా ప్రపంచాన్ని, అభిమానుల్ని ఉలిక్కిపడేలా చేశారు. ‘2003లో భారత్‌కు ప్రపంచ పతకం సాధించే సమయానికి నేను ఒక్క కిడ్నీతోనే ఉన్నాను. పెయిన్ కిల్లర్లు పడేవి కావు. ఎన్నో పరిమితులు. అయినా నా కోచ్ (భర్త రాబర్ట్ జార్జ్) ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. ఈ సమయంలో ఇది ఎందుకు బయటకు వెల్లడి చేస్తున్నానంటే కరోనా మహమ్మారి సమయంలో నా తోటి క్రీడాకారులకు స్ఫూర్తినివ్వడానికే’ అన్నారామె. ఆమె ఎదురీత, పోరాట స్ఫూర్తి, ఏ స్త్రీకి అయినా భర్త ఇవ్వాల్సిన సపోర్ట్‌ను తెలుపుతుంది. చంద్రుడి మీద మనిషి కాలు పెట్టడాన్ని ‘మానవాళి వేసిన ముందంజ’ అన్నారెవరో. కాని భారతీయ మహిళ క్రీడల్లో ముందంజ వేయడానికి 2003 వస్తే తప్ప సాధ్యం కాలేదు. ఆ సంవత్సరం పారిస్‌లో జరిగిన ‘వరల్డ్ ఛాంపియన్ షిప్స్ ఇన్ అథ్లెటిక్స్’లో కేరళకు చెందిన అంజూ బాబీ జార్జ్ 6.70 మీటర్ల పొడవుకు లాంగ్ జంప్ దూకి రజత పతకం సాధించింది. అప్పటి వరకూ ఏ భారతీయ అథ్లెట్ కూడా వరల్డ్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించలేదు. అందునా స్త్రీ అసలు సాధించలేదు. ఇది అంజూ జార్జ్ సాధించిన ఘనత. Believe it or not, I'm one of the fortunate, among very few who reached the world top with a single KIDNEY, allergic with even a painkiller, with a dead takeoff leg.. Many limitations. still made it. Can we call, magic of a coach or his talent @KirenRijiju @afiindia @Media_SAI pic.twitter.com/2kbXoH61BX — Anju Bobby George (@anjubobbygeorg1) December 7, 2020 ఇప్పటికీ ఈ ఘనత ఆమె పేరునే ఉంది. అయితే ఆ పోటీలో బంగారు పతకానికి, రజత పతకానికి మధ్య 10 అంగుళాల దూరం కూడా లేదు. ఆ పది అంగుళాలను అంజూ అలవోకగా గెంతి ఉండేది... ఆమెకు రెండు కిడ్నీలు ఉండి ఉంటే. ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ఉంటే. అవును. అంజూకు మాత్రమే తెలిసిన ఈ సత్యాన్ని సోమవారం (డిసెంబర్ 7) ట్విటర్ ద్వారా ఆమె బయటపెట్టింది. ‘ఒక్క కిడ్నీతోనే ఈ విజయాన్ని ఆ తర్వాతి విజయాలని సాధించాను’ అని ఆమె చెప్పింది. ఒక్క కిడ్నీతో పోరాడి ఆమె ఎగుర వేసిన విజయ పతాక ఎంత ఘనమైనదో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎగిరే కెరటం అంజూ పొడవు ఆమె ఆటల్లో రాణించడానికి పనికొస్తుందని అంజూ తండ్రి ఆమె చిన్నప్పుడే గ్రహించాడు. మూడు నాలుగు తరగతుల్లో ఉండగానే కఠినమైన పరిశ్రమలోకి ఆమెని ప్రవేశపెట్టాడు. దంగల్ సినిమాలో ఆమిర్‌ఖాన్ చేసినట్టే ఉదయం నాలుగు గంటలకే అంజూను మైదానానికి తీసుకెళ్లేవాడు. అంత చిన్నవయసులో శిక్షణ, స్కూల్ చదువు చాలా కష్టమయ్యేది’ అని గుర్తు చేసుకుంది. అంజూ చేసిన పరిశ్రమ వృథా కాలేదు. స్కూల్ లెవల్లో ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆమె ప్రతిభ త్వరలోనే బయటపడింది. 1996 ఢిల్లీలో జరిగిన జూనియర్ ఆసియన్ ఛాంపియన్ షిప్ లో మెడల్ సాధించింది. 1999లో బెంగళూరులో జరిగిన ఫెడరేషన్ కప్‌లో ట్రిపుల్ జంప్‌లో జాతీయ రికార్డ్ సాధించింది. దేశంలో ఆమె ప్రతిభ తెలుస్తూ ఉంది. దేశం ప్రతిభ ఆమె ద్వారా తెలియాల్సి ఉంది. అంతరాయాల పర్వం పెళ్లయ్యాక బాబీ ఒకవైపు ఆమెను అంతర్జాతీయ వేదిక వైపు తీసుకెళ్లాలనుకుంటుంటే మరోవైపు అంజూకు కాలి సమస్య మొదలైంది. అలోపతి స్పెషలిస్టులు ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. ‘లాభం లేదు. నేనిక అథ్లెటిక్స్ మానుకుంటాను’ అని అంజూ భర్తతో చెప్పింది. భర్త పడనివ్వలేదు. ఇద్దరూ కలిసి కేరళలో ఒక ఆయుర్వేద వైద్యుడిని కనిపెట్టి అతడి ద్వారా ఆ సమస్య నుంచి బయటపడ్డారు. కాని అంతకంటే పెద్ద సమస్య ఆ తర్వాత రానున్నదని వారికి తెలియదు. ‘2001లో బాడీ చెకప్ చేయించుకున్నాను. డాక్టర్లు నన్ను పరీక్ష చేసి నువ్వు పుట్టడమే ఒక కిడ్నీతో పుట్టావు. ఒక్క కిడ్నీ ఉంటే క్రీడలు ప్రమాదం అన్నారు. ఇది పెద్ద దెబ్బ నాకు. కాని నా భర్త బాబీ నన్ను ఉత్సాహపరిచాడు. అంతగా అవసరమైతే తన కిడ్నీ ఇస్తానన్నాడు’ అంది అంజూ. కాని సవాళ్లు ఎదురు పడుతూనే ఉండేవి. ‘2002లో జర్మనీలో జరిగిన పోటీలకు వెళ్లాను. కాని అక్కడకు వెళ్లినప్పటి నుంచి అలసటగా అనిపించేది. మరోవైపు నేను పాల్గొనాలనుకుంటున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు 2003లో పారిస్‌లో జరుగనున్నాయి. అప్పుడు డాక్టర్లు నన్ను పరీక్ష చేసి క్రీడల సంగతి తర్వాత... అసలు మామూలు పనులు కూడా చేయొద్దు. బెడ్ రెస్ట్ తీస్కోమన్నారు. నేను షాక్ అయ్యాను.’ అంది అంజూ. విజేత ఒక్క కిడ్నీ ఉన్నా, మందులకు ఎలర్జీ వస్తున్నా, టేకాఫ్‌కు తాను ఆధారపడే కాలు అంతగా సహకరించని పరిస్థితి ఉన్నా అంజూ 2003లో భారత్ తరఫున ప్రపంచ ఛాంపియన్ గా రజతం సాధించింది. దేశం మొత్తం లేచి నిలబడి హర్షధ్వానాలు చేసిన రోజు అది. కాని అదే దేశం నేడు ఆమె ఆ విజయాన్ని ఒక్క కిడ్నీతో సాధించిందని తెలిసి నివ్వెరపోతోంది. ‘ఈ సమయంలో ఈ వాస్తవాన్ని ఎందుకు బయటపెట్టానంటే నాతోటి క్రీడాకారులు స్ఫూర్తిపొందాలనే. కరోనా మహమ్మారి వల్ల క్రీడాకారులు డీలా పడ్డారు. ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. జాతీయస్థాయి క్రీడలు జరగట్లేదు. అయినా ఈ చేదుకాలం పోయి మంచి కాలం వస్తుంది. మనకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి ముందుకు పోతూ ఉండటమే మనం చేయవలసిన పని అని చెప్పడానికే’ అంది అంజూ. క్రీడల్లోనే కాదు కుటుంబ జీవితంలో కూడా ఆమె అన్నివిధాలుగా విజయవంతమైంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి వారి ఆలనా పాలనా చూస్తోంది. అంతేకాదు, స్పోర్ట్స్ అకాడెమీ స్థాపించి కొత్తతరాన్ని సిద్ధం చేస్తోంది. ఇవన్నీ అడ్డంకులను ధైర్యంగా దాటడం వల్లే అంజూ చేయగలిగింది. అంజూ 2004 ఒలంపిక్స్ మెడల్‌ను మిస్ అయ్యింది. ఆమె ఆ పోటీలలో 6.83 మీటర్లు జంప్ చేసి ఐదోస్థానంలో నిలిచింది. కాని ఇప్పటికీ అదే భారతదేశ రికార్డ్. ముందే చెప్పినట్టు ఆరోగ్య ప్రతిబంధకాలు లేకపోతే ఒలంపిక్స్ మెడల్ అంజూకు సాధ్యం కాకుండా ఉండేదా? స్ఫూర్తిగాథలు చుట్టూ ఉంటాయి. అవి బయటకు తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తాయి. ధైర్యాన్ని నూరిపోస్తాయి. అంజూను చూసి ఈ కాలంలో మనమూ పెద్ద ముందంజకు సిద్ధం అవ్వాలి. సామాన్యుల విజయాలూ సామాన్యమైనవి కావు కదా. భర్త రాబర్ట్ జార్జ్, పిల్లలతో అంజూ జార్జ్ కోచ్, స్నేహితుడు, భర్త సరైన జీవన భాగస్వామి దొరికితే స్త్రీకైనా పురుషుడికైనా విజయం సగం సాఫల్యమైనట్టే. 1996లో అంజూ మొదటిసారి బాబీ జార్జ్‌ను ఒక ట్రైనింగ్ క్యాంప్‌లో కలిసింది. అతడు కూడా అథ్లెట్. ట్రిపుల్ జంప్‌లో జాతీయ ఛాంపియన్‌గా ఉన్నాడు. మోడల్‌గా చేసేవాడు. అంజూ, బాబీ కలిసిన వెంటనే ఫ్రెండ్స్ అయిపోయారు. అంజూ తన కంటే ప్రతిభావంతురాలని బాబీ కనిపెట్టాడు. 1998లో ఒక యాక్సిడెంట్ జరిగాక క్రీడల నుంచి విరమించుకుని అంజూకు కోచ్‌గా ఉండాలని నిశ్చయించుకున్నాడు. అది ఒక మలుపైతే 2000లో వారు పెళ్లి చేసుకోవడం మరో మలుపు. ఆ క్షణం నుంచి బాబీ ఆమెకు అన్నివిధాలుగా సపోర్ట్‌గా ఉంటూ మైదానం వెలుపల ఉండే పనులు చేసి పెడుతూ మైదానాన్ని అంజూకు వదిలిపెట్టాడు. ‘అతను నా భర్త మాత్రమే కాదు న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్, కోచ్, ఫ్రెండ్ కూడా’ అంటుంది అంజూ. – సాక్షి ఫ్యామిలీ -
ఒక కిడ్నీతోనే పతకాలు సాధించా
కొచ్చి: స్టార్ ఒలింపియన్ అంజూ బాబీ జార్జి భారత అథ్లెటిక్స్కే వన్నె తెచ్చింది. లాంగ్‌జంప్‌లో తన పతకాలతో చరిత్ర సృష్టించింది. ఇంత చేసిన ఆమె పయనం నల్లేరుపై నడకలా సాగలేదని ఇన్నేళ్ల తర్వాత తాజాగా వెల్లడించింది. తాను సుదీర్ఘ కాలం కిడ్నీ సమస్యలతో సతమతమయ్యానని 43 ఏళ్ల అంజూ చెప్పింది. పోటీల్లో తలపడే సమయానికే ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో కేవలం ఒకే కిడ్నీతో ఆమె ఒంట్లో ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే బయట ఈవెంట్లలో ప్రత్యర్థులతో పోటీ పడినట్లు పేర్కొంది. ‘మీరు నమ్మినా నమ్మకపోయినా... ఒకే కిడ్నీతో ప్రపంచ క్రీడల్లో పోటీపడిన అతికొద్ది మందిలో నేనుంటాను. అలర్జీ, కాలి నొప్పి చాలా ఆరోగ్య సమస్యలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా భర్త, కోచ్ బాబీ జార్జి ప్రోద్బలంతోనే వీటన్నింటిని అధిగమించి పతకాలు నెగ్గాను’ అని ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) చైర్‌పర్సన్‌గా ఉన్న అంజూ ట్వీట్ చేసింది. కేరళకు చెందిన అంజూ 2003 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్ (2005)లో స్వర్ణం గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అయితే మరియన్ జోన్స్ (అమెరికా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. అంతకుముందు 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఆమె బంగారు పతకం సాధించింది. అంజూ ట్వీట్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘నీ కఠోర శ్రమ, నిబద్దతతో భారత్ ప్రతిష్ట పెంచావు’ అని కొనియాడారు. -
ఆ జంప్... ఆహా!
స్కూల్‌గేమ్స్‌లో అంజూ తొలి గెలుపు హర్డిల్స్‌లో! హర్డిల్స్ అంటే తెలుసుగా... అన్నీ దాటుకుంటూ సాగే పరుగు పందెం. ఈ పందెం అమె కెరీర్‌కు చక్కగా నప్పుతుంది. పాఠశాల స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల దాకా ఎదురొచ్చిన అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ చివరకు ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. అంజూ బాబీ జార్జి ఎన్నో హర్డిల్స్నైతే అధిగమించింది కానీ... చరిత్రలో నిలిచింది మాత్రం హర్డిల్స్ క్రీడాంశంలో కాదు... లాంగ్‌జంప్‌తో! స్కూల్లో హర్డిల్స్‌తో మొదలైన తన ఆటల బాటలో రిలే, లాంగ్‌జంప్, హైజంప్, హెప్టాథ్లాన్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లి చివరకు లాంగ్‌జంప్ వద్ద ఆగింది. ఈ జంప్‌తోనే ‘ప్రపంచ’ పతకాన్ని గెలిచింది. ఆ వెంటే ‘ఖేల్‌రత్న’ం వరించింది. కన్నోడు... కట్టుకున్నోడు... చిన్నారి అంజూ చురుకైంది. చదువులో తెలివైంది. ఆటల పోటీల్లో గెలుపు గుర్రంలాంటిది. అందుకే ఆమె కన్నతండ్రి తనకు పుట్టింది అమ్మాయేగా చదువొక్కటి అబ్బితే చాల్లే అని అనుకోలేదు. 40 ఏళ్ల క్రితం ఆయన అలా అనుకొని వుంటే 2003లో పారిస్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించేది కాదు. 1980లో ఆమెను చదువుకోవాలన్నాడు. పోటీపడతానంటే ‘సై’ అన్నాడు. దీంతో 1992లో స్కూల్ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ చాంపియనైంది. తదనంతరం క్రీడాకారుడే భర్తగా రావడం ఆమె కెరీర్‌ను ఉన్నతస్థితికి తీసుకెళ్లింది. ఇలా ఆమె జీవితంలో కన్నతండ్రి కె.టి.మార్కోజ్, కట్టుకున్న భర్త బాబీ జార్జిలది అమూల్యమైన ప్రోత్సాహం. వరల్డ్ ఫైనల్స్ చాంపియన్.... రెండేళ్ల తర్వాత (2005) మొనాకోలోని మోంటెకార్లోలో ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్ టోర్నీ జరిగింది. ఇందులో ఆమె 6.75 మీటర్ల దూరం గెంతి రజతం గెలిచింది. కానీ ఆమె రిటైరయ్యాక... తొమ్మిదేళ్లయ్యాక ఆ పతకం రంగు మారింది. ఆ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తాతియానా కొటోవా (రష్యా–6.83 మీటర్లు) 2014లో డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు ఆమె స్వర్ణాన్ని రద్దు చేసి అంజూను చాంపియన్‌గా ప్రకటించి పసడి పతకాన్ని ఖాయం చేశారు. ఇలా భారత క్రీడాకీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అంజూ ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’... ‘అర్జున’... ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకుంది. ఆమె ఘనతలివీ.... ప్రపంచ అథ్లెటిక్స్ కంటే ముందే అంజూ మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ (2002)లో కాంస్యంతో మెరిసింది. బుసాన్ (2002లో), దోహా (2006లో) ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకుంది. అలాగే వరుసగా ఇంచియోన్ (2005లో), అమ్మాన్ (2007లో) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణ, రజతాలను రిపీట్ చేసింది. ప్రస్తుతం 43 ఏళ్ల అంజూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. ఐదో ప్రయత్నం... ప్రపంచ పతకం అంజూ 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం తుది సన్నాహాల్లో ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె తీవ్రమైన అలసటతో అస్వస్థతకు గురైంది. ఓ దశలో పారిస్ ఈవెంట్ నుంచి తప్పుకుందామని భావించింది. కానీ భర్త బాబీ ముందుండి ధైర్యం చెప్పాడు. బరిలో దిగేందుకు తోవ చూపాడు. అలా చివరకు ఓ మేజర్ ఈవెంట్‌కు అయిష్టంగానే వచ్చినా మొక్కుబడిగా తలపడలేదు. దేశం కోసం, పతకం కోసం వందశాతం అంకిత భావం కనబరిచింది. ప్రపంచ మేటి అథ్లెట్లు, డిఫెండింగ్ చాంపియన్లు బరిలో ఉన్న లాంగ్‌జంప్‌లో ఒక్కొక్కరి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంజూ ఐదో ప్రయత్నంలో 6.70 మీటర్ల దూరం మేర దూకింది. నిజానికి ఇది ఆమె గొప్ప ప్రయత్నమేమీ కాదు. ఎందుకంటే షూస్ స్పైక్ ఒక కాలితో మరొకటి తచ్చాడటంతో ఇబ్బంది పడింది. క్షణాల్లోనే ఇదంతా జరిగినా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని అంత దూరం గెంతడం అంత ఆషామాషీ కాదు. కాసేపయ్యాక ఆరో ప్రయత్నం చేసినా అదేమంతా సక్సెస్ కాలేదు. చివరకు అందరివీ అన్నీ ప్రయత్నాలు పూర్తయ్యాక చూస్తే అంజూ మూడో స్థానం ఖాయమైంది. పోడియంలో కాంస్యం అందుకొని చరిత్ర పుటలకెక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఉత్సాహంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అంజూ ఐదో స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ ఆమె బరిలోకి దిగినా ఫైనల్ చేరలేకపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
డెకాథ్లాన్‌లో ప్రపంచ రికార్డు
పారిస్: అథ్లెటిక్స్‌లో క్లిష్టమైన ఈవెంట్స్‌లో ఒకటైన పురుషుల డెకాథ్లాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 10 క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్‌లో ఫ్రాన్స్ అథ్లెట్ కెవిన్ మాయెర్ ఈ కొత్త రికార్డు సృష్టించాడు. డెకాస్టర్ ఈవెంట్లో మాయెర్ 9,126 పాయింట్లు సాధించి స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డునూ తన పేరిట లిఖించుకున్నాడు. 2015లో అమెరికా ప్లేయర్ యాష్టన్ ఈటన్ (9,045 పాయింట్లు) నెలకొల్పిన రికార్డును మాయెర్ సవరించాడు. -
లాంగ్‌జంప్ విజేత యోగిత
సాక్షి, హైదరాబాద్: జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బి. యోగిత రాజ్ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో లాంగ్‌జంప్ ఈవెంట్లో స్వర్ణంతో పాటు, 60మీ. పరుగులో కాంస్యాన్ని సాధించింది. బుధవారం జరిగిన అండర్–10 బాలికల లాంగ్‌జంప్‌లో యోగిత 3.07మీ దూరం జంప్ చేసి విజేతగా నిలిచింది. ఇన్సియా ధరివాలా (2.78మీ., ఎంఎస్బీ), ఆర్. మునీర (2.71మీ., ఎంఎస్బీ) వరుసగా రజత కాంస్యాలను సాధించారు. 60మీ. పరుగు ఈవెంట్లో చిరెక్ స్కూల్‌కు చెందిన విభా రావు తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఆమె 9.6సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకాన్ని గెలుచుకుంది. హెచ్‌పీఎస్‌కు చెందిన దియా జైన్ 9.8 సెకన్లలో పరుగును పూర్తి చేసి రజతాన్ని గెలుచుకోగా, యోగిత 10సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యాన్ని దక్కించుకుంది. 200మీ. పరుగు ఈవెంట్లోనూ విభారావు విజేతగా నిలవగా, దియా, మహేశ్వరి తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–10 బాలుర 60మీ. పరుగు: 1. హర్నూర్ సింగ్ (హెచ్‌పీఎస్), 2. టి. వెంకట శ్రేయస్ (ఎన్ఏఎస్ఏఆర్), 3. బద్రీనాథ్ (సాల్వేషన్ హైస్కూల్). 200మీ. పరుగు: 1. హర్నూర్ సింగ్ (హెచ్‌పీఎస్), 2. మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ (సెయింట్ జోసెఫ్), 3. విహాన్ (హెచ్‌పీఎస్). లాంగ్‌జంప్: 1. టి. వెంకట శ్రేయస్ (ఎన్ఏఎస్ఆర్), 2. కె. అమోఘ్, 3. ముర్తజా. అండర్–12 బాలుర 80మీ. పరుగు: 1. అనిరుధ్ బోస్ (సెయింట్ ఆండ్రూస్), 2. సాహిత్ సోమసుందర్ (భారతీయ స్కూల్), 3. బి. ఇషాన్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. ఎ. కృతి (సెయింట్ జోసెఫ్), 2. శ్రేయసి బిశ్వాస్ (ఇంటర్నేషనల్ స్కూల్), 3. ఎం. సుష్మా (డీపీఎస్). 300మీ. పరుగు: 1. అనిరుధ్ (సెయింట్ ఆండ్రూస్), 2. మహేశ్ (పుడమి హైస్కూల్), 3. అయాన్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. కృతి (సెయింట్ జోసెఫ్), 2. భావన (చిరెక్), 3. ఇషిక (చిరెక్). లాంగ్‌జంప్: 1. ఎన్. గణేవ్ (ప్రగతి విద్యామందిర్), 2. బి. శ్రేయస్ రాజు (హెచ్‌పీఎస్), 3. ఎస్. గణేశ్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. శ్రేయసి బిశ్వాస్ (ఇంటర్నేషనల్ స్కూల్), 2. అమూల్య రెడ్డి (హెచ్‌పీఎస్), 3. పి. ప్రహర్షిత (హెచ్‌పీఎస్). అండర్–14 బాలుర 100మీ. పరుగు: 1. ఎ. రేవంత్ (మెరిడియన్ స్కూల్), 2. జె. ప్రణీత్ (సెయింట్ ఆండ్రూస్), 3. నితిన్ (శాంతినికేతన్); బాలికలు: 1. ఆర్. రితిక (సెయింట్ ఆండ్రూస్), 2. కె. నిత్యారెడ్డి (సెయింట్ ఆండ్రూస్), 3. బి. మధులత (బ్రిలియంట్ హైస్కూల్). 200మీ. పరుగు: 1. టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), 2. ఎ. రేవంత్ (మెరిడియన్ స్కూల్), 3. ఇ. నితిన్ (శాంతినికేతన్); బాలికలు: 1. ఆర్. రితిక (సెయింట్ ఆండ్రూస్), 2. దియా (చిరెక్), 3. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ). 400మీ. పరుగు: 1. టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), 2. ఎం. అరవింద్ (శాంతినికేతన్), 3. సుహాస్ (కేవీ గచ్చిబౌలి). లాంగ్‌జంప్: 1. బి. కృష్ణ, 2. జె. ప్రణీత్ (సెయింట్ ఆండ్రూస్), 3. బి. ప్రణయ్ (హెచ్‌పీఎస్); బాలికలు: 1. ప్రియాంక దాస్ (సెయింట్ ఆండ్రూస్), 2. దీక్షిత (హెచ్‌పీఎస్), 3. జి. అలేక్య (జీహెచ్ఎస్). -
లాంగ్‌జంప్ విజేత మనోహర్ రావు
400 మీటర్ల హర్డిల్స్‌లో శిల్పవల్లికి రజతం జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నాలుగోరోజు పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు మనోహర్ రావు, శిల్పవల్లి సత్తా చాటారు. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో లాంగ్‌జంప్ ఈవెంట్లో మనోహర్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా... 400 మీటర్ల హర్డిల్స్‌లో శిల్పవల్లికి రజత పతకం దక్కింది. శుక్రవారం జరిగిన లాంగ్‌జంప్ ఫైనల్లో మనోహర్ 4.62మీ. జంప్ చేసి విజేతగా నిలిచాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తపన్ సేన్ గుప్తా (4.53 మీ.), అస్సాంకు చెందిన ప్రోబిన్ (4.49 మీ.) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. 35 ప్లస్ మహిళల విభాగంలో జరిగిన 400 మీటర్ల హర్డిల్స్‌లో బబిత (అస్సాం) స్వర్ణాన్ని గెలుచుకోగా... కె. శిల్పవల్లి (తెలంగాణ), వీణ (మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు 35+ పురుషులు: 110 మీ. హర్డిల్స్: 1. యువరాజ్ (తమిళనాడు), 2. వర్గీస్ (ఢిల్లీ), 3. చిదంబరం (తమిళనాడు). 40+ పురుషులు: 5000 మీ. రేస్ వాక్: 1. సురేశ్ (కేరళ), 2. అరుణ్ (ఒడిశా), 3. రామ్నివాస్ (హరియాణా). మహిళలు: 400 మీ. హార్డిల్స్: 1. అర్చన (ఢిల్లీ), 2. కీర్తన (కేరళ), 3. స్నేహ (మహారాష్ట్ర). 45+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్: 1. మాథ్యూ (కేరళ), 2. ధారాసింగ్ (మణిపూర్), 3. సరోజిని (కేరళ). మహిళలు: 400 మీ. హర్డిల్స్: 1. టెర్రీ మారియా (కేరళ), 2. స్నేహల్ రాజ్‌పుత్ (మహారాష్ట్ర), 3. ప్రిత్పాల్ కౌర్ (ఢిల్లీ). 50+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్: 1. అనూప్ కుమార్ (ఢిల్లీ), 2. బల్వన్ సింగ్ (హరియాణా), 3. సూర్యనారాయణ రాజు (ఏపీ). మహిళలు: 5000 మీ. రేస్ వాక్: 1. బిదేశ్ (మణిపూర్), 2. శార్ద (కేరళ), 3. రంజన (అస్సాం). 55+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్: 1. కుల్దీప్ సింగ్ (హరియాణా), 2. గుర్దాస్సింగ్ (పంజాబ్), 3. బాలకృష్ణన్ (కేరళ). మహిళలు: 5000 మీ. రేస్ వాక్: 1. ఇలా దత్తా (పశ్చిమ బెంగాల్), 2. కల్పన (పశ్చిమ బెంగాల్), 3. రమావతి దేవి (అస్సాం). డిస్కస్ త్రో: 1. ఊర్మిళ (అస్సాం), 2. సుశీల (హరియాణా), 3. గ్లోరియా (ఛత్తీస్‌గఢ్). 60+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్: 1. అశ్విని కుమార్ (పశ్చిమ బెంగాల్), 2. కనకసబతి (తమిళనాడు), 3.నారాయణన్ (కేరళ). మహిళలు: హైజంప్: 1. అనూదేవి (అస్సాం), 2. లక్ష్మీ (తమిళనాడు), 3. లిపిక (అస్సాం). 65+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్: 1. జైసింగ్ (హరియాణా), 2. మంజునాథ (కేరళ), 3. నారాయణ్ మిశ్రా (ఒడిశా). 70+ పురుషులు: జావెలిన్ త్రో: 1 మాన్సింగ్ (రాజస్థాన్), 2. గణేశ్ సర్కార్ (పశ్చిమ బెంగాల్), 3. పి. మాలిక్ మహిళలు: డిస్కస్ త్రో: 1. సునీత (మణిపూర్), 2. మణ (తమిళనాడు), 3. శాంతి (అస్సాం). 80+ పురుషులు: జావెలిన్ త్రో: 1. జీవన్ భాయ్ (గుజరాత్), 2. సిద్ధు (పంజాబ్), 3. మోహన్ భాయ్ (గుజరాత్). మహిళలు: హైజంప్: 1. వసంత శామ్యూల్ (తమిళనాడు), 2. రాశి (మణిపూర్). 85+ పురుషులు: జావెలిన్ త్రో: 1. దర్శన్ సింగ్ (ఉత్తరాఖండ్), 2. శివరామ కృష్ణన్ (ఏపీ), 3. హమీర్ సింగ్ (పంజాబ్). -
ప్రేమ్ కుమార్‌కు రజతం
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్లో కుమారవెల్ ప్రేమ్ కుమార్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రేమ్ కుమార్ 7.92 మీటర్ల దూరం దూకి తన ఖాతాలో రజత పతకాన్ని వేసుకున్నాడు. జాంగ్ యావోగువాంగ్ (చైనా-7.99 మీటర్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల షాట్‌పుట్‌లో ఓంప్రకాశ్ కర్హానా ఇనుప గుండును 18.77 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలు లభించాయి. -
మయూఖా జానీకి స్వర్ణం
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల లాంగ్‌జంప్‌లో మయూఖా జానీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మయూఖా 6.35 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తద్వారా ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. మహిళల 60 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్, 1500 మీటర్ల రేసులో సుగంధ కుమారి కాంస్యాలు నెగ్గారు. -
20 నుంచి క్రీడాపోటీలు
భివండీ, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భివండీ-నిజాంపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) విద్యావిభాగం విద్యార్థులకు సోమవారం నుంచి వివిధ ఆటల పోటీలను నిర్వహించనుంది. స్థానిక ఛాలెంజ్ మైదానంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే తెలుగు విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ నిత్యానంద్ నాడార్ దుస్తులను ఉచితంగా అందజేశారు. కాగా బీఎన్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక్కొక్క పాఠశాల నుంచి సుమారు 30 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 3.000 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కబడ్డీ, ఒంటికాలితో పరుగెత్తే ఆట (లంగ్డీ), ఖో ఖో, లాంగ్ జంప్, పరుగు పందెం, షాట్ ఫుట్లతోపాటు, చిత్ర కళ, హస్త కళ తదితర పోటీలను నిర్వహించనున్నామని విద్యామండలి సభాపతి రాజు. గాజెంగి తెలిపారు. మూడురోజులపాటు కొనసాగే ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థులకు అల్పాహారం, మంచి నీటివసతితో పాటు వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. విజేతలకు గణతంత్రి దినోత్సవంరోజున బహుమతులను అందజేస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొననున్న తెలుగు పాఠశాల నం 23కు చెందిన విద్యార్థులకు సమాజ సేవకుడు కనకవేలు ఉచితంగా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనకవేలు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం తెలుగు పాఠశాలల విద్యార్థులందరికీ క్రీడా దుస్తులను అందజేస్తామన్నారు.