ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణకాంతి!
న్యూఢిల్లీ: భారత అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌ను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రజత పతకం నెగ్గిన ఈ క్రీడాకారిణికి... ప్రత్యర్థి డోపింగ్‌లో పట్టుబడటం వరంగా మారింది. ఫలితంగా అప్పుడు గెలిచిన రజతమే ఇప్పుడు స్వర్ణమైంది. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) దీనిని అధికారికంగా ధ్రువీకరించింది.
రజతం నుంచి స్వర్ణానికి...
సెప్టెంబర్ 9, 2005...మొనాకోలో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్స్...ప్రపంచలోని టాప్-8 అథ్లెట్లు పోటీ పడ్డారు. మహిళల లాంగ్‌జంప్‌లో 6.75 మీటర్లు దూకిన భారత అథ్లెట్ అంజూ జార్జ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఆ ఈవెంట్లో తాత్యానా కొటోవా (రష్యా)కు స్వర్ణం దక్కింది. అయితే తాజాగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో కొటోవా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ అంజూకు ప్రమోషన్ కల్పించారు. ఫలితంగా ప్రపంచ అథ్లెటిక్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా అంజు రికార్డులకెక్కింది. డోపింగ్‌కు సంబంధించి పాత శాంపిల్స్‌ను కూడా మళ్లీ పరీక్షించాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) నిర్ణయం తీసుకుం ది. ఇందులో భాగంగా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌నాటి నుంచి ఆటగాళ్ల నమూనాలను పరిశీలిస్తున్నారు. ఇదే క్రమంలో 2005 వరల్డ్ అథ్లెటిక్స్ శాంపిల్స్‌ను కూడా పరిశీలించడంతో కొటోవా ఉదంతం బయట పడింది.
అప్పుడే అనుమానించాను...
తన రజత పతకం స్వర్ణానికి మారడం పట్ల అంజూ జార్జ్ సంతోషం వ్యక్తం చేసింది. తన ఇన్నేళ్ల ఎదురు చూపులకు ఫలితం దక్కిందని ఆమె చెప్పింది. ‘నాతో పోటీ పడిన రష్యన్ అథ్లెట్లలో కొందరు డోపింగ్ చేసి ఉండవచ్చని అప్పట్లోనే నాకు అనుమానాలుండేవి. ఇప్పుడు అది నిజమైంది. ఇన్నాళ్లు వేచి ఉన్న తర్వాత స్వర్ణం దక్కడం ఆనందంగా ఉంది’ అని అంజు చెప్పింది.