international athletics
-
అంతర్జాతీయ వేదికపై స్వర్ణంతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
కుర్ప్‌ఫాల్జ్ గాలా ఈవెంట్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మెరిసింది. జర్మనీలో జరిగిన ఈ మీట్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది. జ్యోతి 12.84 సెకన్లలో గమ్యానికి చేరి తన కెరీర్లో రెండో అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో జ్యోతికిదే తొలి అంతర్జాతీయ పతకం. గత ఏడాది జ్యోతి 12.82 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది. -
పాల్గొంది ఐదుగురు... అందరూ డిస్క్వాలిఫై!
బర్మింగ్‌హామ్: అదో ప్రతిష్టాత్మక ఈవెంట్... గోల్డ్ మెడల్ ఫేవరెట్ సహా స్టార్ అథ్లెట్లందరూ బరిలోకి దిగారు. అయితే హీట్స్‌లోనే వీరంతా అనర్హతకు గురయ్యారు. విశేషం ఏమిటంటే ఐదుగురు అథ్లెట్లు ఈ హీట్స్‌లో పాల్గొనగా వేర్వేరు కారణాలతో వీరందరూ డిస్క్వాలిఫై కావడం! వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ పురుషుల 400 మీటర్ల విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది ఈ విభాగంలో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన బ్రలోన్ టాప్లిన్ (గ్రెనడా) కూడా డిస్క్వాలిఫయర్స్ జాబితాలో ఉన్నాడు. లైన్ తప్పి పరుగెత్తడంతో బ్రలోన్తో పాటు స్టీవెన్ గేల్ (జమైకా), ఆస్ట్రిస్ కార్పిన్స్కిస్ (లాత్వియా), అలోంజో రసెస్ (బహమాస్)లపై అనర్హత వేటు పడింది. అంతకు ముందే అబ్దుల్లా హరూన్ (ఖతార్) ఫాల్స్ స్టార్ట్‌తో డిస్క్వాలిఫై అయ్యాడు. వీరిలో ఇద్దరు అప్పీల్ చేసినా లాభం లేకపోయింది. ఒక మేజర్ చాంపియన్‌షిప్‌లో హీట్స్‌లో పాల్గొన్న అందరూ అనర్హతకు గురి కావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని స్వయంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రకటించడం విశేషం. -
ఎన్నాళ్లీ మందగమనం!
► ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్ దయనీయ స్థితి ►ప్రాతినిధ్యమే తప్ప పతకాలు గగనం ►పురోగతికి ప్రణాళికలు అంతంత మాత్రం ఆసియా క్రీడలు... ఆసియా చాంపియన్‌షిప్... కామన్వెల్త్ గేమ్స్... గ్రాండ్‌ప్రి సిరీస్‌లు... ఇలా ఏ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ జరిగినా భారత క్రీడాకారులు పతకాలతో తిరిగొస్తారు. తమ అత్యుత్తమ సమయాలను నమోదు చేస్తారు. జాతీయ రికార్డులనూ తిరగరాస్తారు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్ క్రీడలు వచ్చేసరికి మాత్రం మనోళ్ల ప్రదర్శన తీసికట్టుగా మారిపోతోంది. ఈ వేదికలపై మన అథ్లెట్స్ గతంలో తాము సాధించిన అత్యుత్తమ ప్రదర్శనలను కూడా పునరావృతం చేయలేకపోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు సన్నాహక టోర్నీల్లో రాణిస్తూ ఆశలు రేకెత్తించి... తీరా అసలు పోటీల్లో మాత్రం చేతులెత్తేస్తారు. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చిన్నదేశాలూ పతకాలు కొల్లగొడుతుంటే మనం మాత్రం ఎక్కడో నిలిచిపోతున్నాం. సాక్షి క్రీడావిభాగం : మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌కు ఒకే ఒక్క పతకం వచ్చింది. 2003లో పారిస్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీ జార్జి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత ఆరుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లు జరిగినా భారత క్రీడాకారులు పతకం సమీపానికి కూడా వెళ్లలేకపోయారు. అర్హత టోర్నీల్లో రాణించడం... ప్రపంచ పోటీలకు బెర్త్‌లు సంపాదించడం... ఆ తర్వాత బరిలోకి దిగి, రిక్తహస్తాలతో తిరిగి రావడం పరిపాటైంది. 2015 బీజింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వికాస్ గౌడ (డిస్కస్ త్రో), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), లలితా బబర్ (మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్) ఫైనల్లోకి ప్రవేశించినా పతకం మాత్రం నెగ్గలేకపోయారు. ఈసారి భారత్ నుంచి అత్యధిక 25 మంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. అయితే ఈ జాబితాలో కేవలం నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)పైనే కాస్త ఆశలు ఉన్నాయి. గత ఏడాది అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ జావెలిన్‌ను 86.48 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకం సాధించడమే దీనికి కారణం. అయితే అండర్–20 చాంపియన్‌షిప్ ప్రమాణాలను సీనియర్ స్థాయితో పోల్చలేము. కానీ గత ప్రదర్శనను పక్కనబెట్టి క్వాలిఫయింగ్, ఫైనల్ ఈవెంట్ రోజున రాణించివారినే పతకం వరిస్తుందనే విషయం గమనార్హం. దాంతో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన పునరావృతం చేస్తే ఫైనల్‌కు చేరవచ్చు. ఆ ఇద్దరికి మొండిచేయి... జూలై తొలి వారంలో భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించినవారు ప్రపంచ చాంపియన్‌షిప్‌కు నేరుగా అర్హత సాధిస్తారని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రకటించింది. మహిళల 1500 మీటర్లలో పీయూ చిత్రా (కేరళ), 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సుధా సింగ్ విజేతలుగా నిలిచి ‘లండన్’ బెర్త్ ఖాయం చేసుకున్నారు. అయితే ఈ ప్రదర్శనతో లండన్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరడం కూడా కష్టమేనని ఏఎఫ్ఐ అధికారులు వ్యాఖ్యానిస్తూ చిత్రా, సుధా సింగ్‌లను ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు పంపించకపోవడం గమ నార్హం. ఇక మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీచంద్ అర్హత ప్రమాణ సమయాన్ని అందుకోకపోయినా... కనీస సంఖ్యలో ఎంట్రీలు ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ద్యుతీ చంద్‌ను ఈ పోటీలకు ఆహ్వానించింది. కానీ ద్యుతీచంద్ తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయడంలో విఫలమై హీట్స్‌లోనే వెనుదిరిగింది. ప్రణాళిక లోపం... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చిన్న దేశాలూ పతకాలు గెలుస్తున్న చోట భారత క్రీడాకారులు ఎందుకు విఫలం అవుతున్నారనే విషయంపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య, కోచ్‌లు, క్రీడాధికారులు చెప్పే కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే అథ్లెటిక్స్‌లో ఒకప్పుడు ఎంతో వెనుకంజలో ఉన్న ఆసియా దేశాలు నేడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచే స్థాయికి వచ్చాయి. స్ప్రింట్ ఈవెంట్స్‌లోనూ ఆసియా క్రీడాకారులు జమైకా, అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికాలాంటి మేటి దేశాలకు పోటీనిచ్చే స్థాయికి చేరుకున్నారు. ఆయా దేశాలు ఒక పక్కా వ్యవస్థను ఏర్పరచుకొని, సుదీర్ఘ ప్రణా ళికలు రూపొందించి వాటిని పకడ్బందీ అమలు చేస్తూ ఇప్పుడు వాటి ఫలితాలను అందుకుంటున్నారు. అయితే భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపిం చడంలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్ సమయంలో క్రీడాకారుల వైఫల్యంపై హడావిడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం సాధారణమైపోయింది. ఇకనైనా అథ్లెటిక్స్ సమాఖ్య పారదర్శకంగా, ప్రణాళికయుతంగా వ్యవహరించి... ప్రతిభాశీలురను గుర్తించి... వారికి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిరంతరం శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాలి. స్కూల్, కాలేజీ, యూనివర్సి టీలలో అథ్లెటిక్స్ ట్రాక్‌లను నిర్మించేందుకు ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలి. ఇలా చేస్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే దశాబ్దకాలంలో భారత్ నుంచీ ప్రపంచ, ఒలింపిక్ విజేతలు అవతరించే అవకాశముంది. ‘లండన్’ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన మహిళల 100 మీటర్లు: ద్యుతీచంద్ (తన హీట్స్‌లో 12.07 సెకన్లతో ఆరో స్థానం; ఓవరాల్‌గా 47 మందిలో 38వ ర్యాంక్). పురుషుల 110 మీటర్ల హర్డిల్స్: సిద్ధాంత్ తింగలాయ (తన హీట్స్‌లో 13.64 సెకన్లతో ఏడో స్థానం; ఓవరాల్‌గా 41 మందిలో 31వ ర్యాంక్). మహిళల జావెలిన్ త్రో: అన్ను రాణి (తన క్వాలిఫయింగ్ గ్రూప్‌లో 59.93 మీటర్లతో 10వ స్థానం; ఓవరాల్‌గా 31 మందిలో 20వ ర్యాంక్). మహిళల హెప్టాథ్లాన్: స్వప్న బర్మన్ (5,431 పాయింట్లతో 31 మందిలో 26వ స్థానం) పురుషుల మారథాన్: గోపీ థోనకల్ (2గం:17ని:13 సెకన్లతో 28వ స్థానం) మహిళల మారథాన్: మోనిక అథారె (2గం:49ని:54 సెకన్లతో 92 మందిలో 64వ స్థానం) పురుషుల 400 మీటర్లు: మొహమ్మద్ అనస్ (తన హీట్స్‌లో 45.98 సెకన్లతో నాలుగో స్థానం; ఓవరాల్‌గా 52 మందిలో 33వ ర్యాంక్). మహిళల 400 మీటర్లు: నిర్మలా షెరోన్ (తన హీట్స్‌లో 52.01 సెకన్లతో నాలుగో స్థానంలో నిలిచి చివరిదైన 21వ బెర్త్‌గా సెమీఫైనల్‌కు అర్హత; సెమీఫైనల్లో టాప్–8లో నిలిస్తే ఫైనల్‌కు చేరుతుంది) -
అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు నెమ్మిపాటి
అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు మహిళా హెడ్ కానిస్టేబుల్ ఎంపిక కర్నూలు: అంతర్జాతీయ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌కు జిల్లా పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నెమ్మిపాటి లక్ష్మిదేవి ఎంపికయ్యారు. ఈ ఏడాది జూలై 22వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మలేషియాలో ఈ పోటీలు జరగనున్నాయి. విజయలక్ష్మి ప్రస్తుతం ఏఆర్ హెడ్‌క్వాటర్స్‌లోని బాంబ్ డిస్పోజబుల్ టీమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 24 నుంచి 27వ తేదీ వరకు జరగిన మదన్మోహన్ మాలవ్య స్టేడియంలో 35వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. షాట్‌పుట్, హామర్‌త్రోలో వెండి పతకాలు సాధించారు. ఈ సందర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమెను ఎస్పీ ఆకె రవికృష్ణ ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దుతీ జాతీయ పోటీల్లో పాల్గొనొచ్చు!
‘కాస్’ మధ్యంతర ఉత్తర్వులు న్యూఢిల్లీ: పురుష హార్మోన్లు ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న కారణంతో అనర్హత వేటుకు గురైన భారత మహిళా స్ప్రింటర్ దుతీ చంద్‌కు ఊరట లభించింది. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (కాస్) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పురుష హార్మోన్ల కారణంగా కామన్వెల్త్, ఆసియా క్రీడలకు దూరమైన దుతీ... అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘానికి (ఐఏఏఎఫ్) సంబంధించిన హైపరాండ్రోగ్నిజమ్ (మహిళల అథ్లెట్లలో ఎక్కువ స్థాయిలో పురుషుల హార్మోన్లు ఉండటం) విధానంపై ‘కాస్’లో పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తుది తీర్పు వెల్లడించే వరకు అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉండాలని కోర్టు సూచించింది. వచ్చే జనవరి చివరి వరకు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ‘కాస్’ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల దుతీకి పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. ప్రస్తుతం అథ్లెటిక్స్‌కు ఆఫ్ సీజన్ కావడంతో ఆమె పోటీల్లో పాల్గొనే అవకాశాల్లేవు. దుతీ చంద్‌కు జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వడం పట్ల భారత కోచ్, హైదరాబాద్‌కు చెందిన నాగపురి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. -
మీ జీవితం ఓ పాఠం...
పూర్తి పేరు: జేమ్స్ క్లీవ్‌లాండ్ ఓవెన్స్ జననం: సెప్టెంబర్ 12, 1913 విభాగం: ట్రాక్ మరియు ఫీల్డ్ ఒలింపిక్స్ స్వర్ణాలు: 4 (1936) మరణం: మార్చి 31, 1980 జెస్సీ ఓవెన్స్... అథ్లెటిక్స్ దిగ్గజం... అంతేనా..! అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన అమెరికా క్రీడాకారుడిగానే గుర్తుంచుకోవాలా..! కాదు... జాత్యహంకారానికి క్రీడల ద్వారా సమాధానం చెప్పిన ఘనుడు... హిట్లర్‌కే ఎదురు నిలిచి నల్లజాతి తెగువను ప్రపంచానికి చాటిన యోధుడు... అది 1936వ సంవత్సరం. బెర్లిన్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. తమ దేశ ఆటగాళ్లకు కాకుండా ఇతరులకు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా హిట్లర్ ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితుల్లో 100మీ. రేసును ఓవెన్స్ 10.3 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దీంతో ఓవెన్స్‌ను ఎక్కడ అభినందించాల్సి వస్తుందో అని ఆ నియంత అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత లాంగ్‌జంప్‌లో 8 మీటర్లు దుమికి మరో స్వర్ణం, 200మీ. పరుగును 20.7 సెకన్లలో పూర్తి చేసి మూడో స్వర్ణం, 4ఁ100మీ. రిలేలోనూ ఇదే ప్రతిభ చూపి నాలుగు స్వర్ణాలతో చరిత్ర సృష్టించి హిట్లర్ అవాక్కయ్యేలా చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తన ప్రతిభను నమ్ముకుని ముందుకు సాగిన ఓవెన్స్ సాధించిన ఈ చరిత్రాత్మక విజయానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నల్లజాతీయులంతా ఓవెన్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ స్వర్ణాలను ఒలింపిక్స్ వారసత్వ సంపదగా పరిగణిస్తారు. అందుకే గత నెలలో జరిగిన వేలంలో ఓవెన్స్ సాధించిన ఓ స్వర్ణానికి రూ. 9 కోట్ల ధర పలికింది. -
ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణకాంతి!
న్యూఢిల్లీ: భారత అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌ను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రజత పతకం నెగ్గిన ఈ క్రీడాకారిణికి... ప్రత్యర్థి డోపింగ్‌లో పట్టుబడటం వరంగా మారింది. ఫలితంగా అప్పుడు గెలిచిన రజతమే ఇప్పుడు స్వర్ణమైంది. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) దీనిని అధికారికంగా ధ్రువీకరించింది. రజతం నుంచి స్వర్ణానికి... సెప్టెంబర్ 9, 2005...మొనాకోలో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్స్...ప్రపంచలోని టాప్-8 అథ్లెట్లు పోటీ పడ్డారు. మహిళల లాంగ్‌జంప్‌లో 6.75 మీటర్లు దూకిన భారత అథ్లెట్ అంజూ జార్జ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఆ ఈవెంట్లో తాత్యానా కొటోవా (రష్యా)కు స్వర్ణం దక్కింది. అయితే తాజాగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో కొటోవా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ అంజూకు ప్రమోషన్ కల్పించారు. ఫలితంగా ప్రపంచ అథ్లెటిక్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా అంజు రికార్డులకెక్కింది. డోపింగ్‌కు సంబంధించి పాత శాంపిల్స్‌ను కూడా మళ్లీ పరీక్షించాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) నిర్ణయం తీసుకుం ది. ఇందులో భాగంగా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్నాటి నుంచి ఆటగాళ్ల నమూనాలను పరిశీలిస్తున్నారు. ఇదే క్రమంలో 2005 వరల్డ్ అథ్లెటిక్స్ శాంపిల్స్‌ను కూడా పరిశీలించడంతో కొటోవా ఉదంతం బయట పడింది. అప్పుడే అనుమానించాను... తన రజత పతకం స్వర్ణానికి మారడం పట్ల అంజూ జార్జ్ సంతోషం వ్యక్తం చేసింది. తన ఇన్నేళ్ల ఎదురు చూపులకు ఫలితం దక్కిందని ఆమె చెప్పింది. ‘నాతో పోటీ పడిన రష్యన్ అథ్లెట్లలో కొందరు డోపింగ్ చేసి ఉండవచ్చని అప్పట్లోనే నాకు అనుమానాలుండేవి. ఇప్పుడు అది నిజమైంది. ఇన్నాళ్లు వేచి ఉన్న తర్వాత స్వర్ణం దక్కడం ఆనందంగా ఉంది’ అని అంజు చెప్పింది.