ఎన్నాళ్లీ మందగమనం! | India is the world's worst in world athletics | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ మందగమనం!

Published Tue, Aug 8 2017 12:17 AM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

ఎన్నాళ్లీ మందగమనం!

ఎన్నాళ్లీ మందగమనం!

ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌ దయనీయ స్థితి
ప్రాతినిధ్యమే తప్ప పతకాలు గగనం
పురోగతికి ప్రణాళికలు అంతంత మాత్రం


ఆసియా క్రీడలు... ఆసియా చాంపియన్‌షిప్‌... కామన్వెల్త్‌ గేమ్స్‌... గ్రాండ్‌ప్రి సిరీస్‌లు... ఇలా ఏ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌ జరిగినా భారత క్రీడాకారులు పతకాలతో తిరిగొస్తారు. తమ అత్యుత్తమ సమయాలను నమోదు చేస్తారు. జాతీయ రికార్డులనూ తిరగరాస్తారు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌ క్రీడలు వచ్చేసరికి మాత్రం మనోళ్ల ప్రదర్శన తీసికట్టుగా మారిపోతోంది. ఈ వేదికలపై మన అథ్లెట్స్‌ గతంలో తాము సాధించిన అత్యుత్తమ ప్రదర్శనలను కూడా పునరావృతం చేయలేకపోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు సన్నాహక టోర్నీల్లో రాణిస్తూ ఆశలు రేకెత్తించి... తీరా అసలు పోటీల్లో మాత్రం చేతులెత్తేస్తారు. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చిన్నదేశాలూ పతకాలు కొల్లగొడుతుంటే మనం మాత్రం ఎక్కడో నిలిచిపోతున్నాం.  

సాక్షి క్రీడావిభాగం : మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌కు ఒకే ఒక్క పతకం వచ్చింది. 2003లో పారిస్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీ జార్జి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత ఆరుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లు జరిగినా భారత క్రీడాకారులు పతకం సమీపానికి కూడా వెళ్లలేకపోయారు. అర్హత టోర్నీల్లో రాణించడం... ప్రపంచ పోటీలకు బెర్త్‌లు సంపాదించడం... ఆ తర్వాత బరిలోకి దిగి, రిక్తహస్తాలతో తిరిగి రావడం పరిపాటైంది. 2015 బీజింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వికాస్‌ గౌడ (డిస్కస్‌ త్రో), ఇందర్జీత్‌ సింగ్‌ (షాట్‌పుట్‌), లలితా బబర్‌ (మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌) ఫైనల్లోకి ప్రవేశించినా పతకం మాత్రం నెగ్గలేకపోయారు.

ఈసారి భారత్‌ నుంచి అత్యధిక 25 మంది ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ జాబితాలో కేవలం నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో)పైనే కాస్త ఆశలు ఉన్నాయి. గత ఏడాది అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ జావెలిన్‌ను 86.48 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకం సాధించడమే దీనికి కారణం. అయితే అండర్‌–20 చాంపియన్‌షిప్‌ ప్రమాణాలను సీనియర్‌ స్థాయితో పోల్చలేము. కానీ గత ప్రదర్శనను పక్కనబెట్టి క్వాలిఫయింగ్, ఫైనల్‌ ఈవెంట్‌ రోజున రాణించివారినే పతకం వరిస్తుందనే విషయం గమనార్హం. దాంతో నీరజ్‌ తన అత్యుత్తమ ప్రదర్శన పునరావృతం చేస్తే ఫైనల్‌కు చేరవచ్చు.

ఆ ఇద్దరికి మొండిచేయి...
జూలై తొలి వారంలో భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించినవారు ప్రపంచ చాంపియన్‌షిప్‌కు నేరుగా అర్హత సాధిస్తారని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ప్రకటించింది. మహిళల 1500 మీటర్లలో పీయూ చిత్రా (కేరళ), 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సుధా సింగ్‌ విజేతలుగా నిలిచి ‘లండన్‌’ బెర్త్‌ ఖాయం చేసుకున్నారు. అయితే ఈ ప్రదర్శనతో లండన్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరడం కూడా కష్టమేనని ఏఎఫ్‌ఐ అధికారులు వ్యాఖ్యానిస్తూ చిత్రా, సుధా సింగ్‌లను ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు పంపించకపోవడం గమ నార్హం. ఇక మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీచంద్‌ అర్హత ప్రమాణ సమయాన్ని అందుకోకపోయినా... కనీస సంఖ్యలో ఎంట్రీలు ఉండాలనే  ఉద్దేశంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య ద్యుతీ చంద్‌ను ఈ పోటీలకు ఆహ్వానించింది. కానీ ద్యుతీచంద్‌ తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయడంలో విఫలమై హీట్స్‌లోనే వెనుదిరిగింది.

ప్రణాళిక లోపం...
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చిన్న దేశాలూ పతకాలు గెలుస్తున్న చోట భారత క్రీడాకారులు ఎందుకు విఫలం అవుతున్నారనే విషయంపై భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య, కోచ్‌లు, క్రీడాధికారులు చెప్పే కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే అథ్లెటిక్స్‌లో ఒకప్పుడు ఎంతో వెనుకంజలో ఉన్న ఆసియా దేశాలు నేడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచే స్థాయికి వచ్చాయి. స్ప్రింట్‌ ఈవెంట్స్‌లోనూ ఆసియా క్రీడాకారులు జమైకా, అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికాలాంటి మేటి దేశాలకు పోటీనిచ్చే స్థాయికి చేరుకున్నారు. ఆయా దేశాలు ఒక పక్కా వ్యవస్థను ఏర్పరచుకొని, సుదీర్ఘ ప్రణా ళికలు రూపొందించి వాటిని పకడ్బందీ అమలు చేస్తూ ఇప్పుడు వాటి ఫలితాలను అందుకుంటున్నారు. అయితే భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపిం చడంలేదు.

ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌ సమయంలో క్రీడాకారుల వైఫల్యంపై హడావిడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం సాధారణమైపోయింది. ఇకనైనా అథ్లెటిక్స్‌ సమాఖ్య పారదర్శకంగా, ప్రణాళికయుతంగా వ్యవహరించి... ప్రతిభాశీలురను గుర్తించి... వారికి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిరంతరం శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాలి. స్కూల్, కాలేజీ, యూనివర్సి టీలలో అథ్లెటిక్స్‌ ట్రాక్‌లను నిర్మించేందుకు ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలి. ఇలా చేస్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే దశాబ్దకాలంలో భారత్‌ నుంచీ ప్రపంచ, ఒలింపిక్‌ విజేతలు అవతరించే అవకాశముంది.

‘లండన్‌’ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన
మహిళల 100 మీటర్లు: ద్యుతీచంద్‌ (తన హీట్స్‌లో 12.07 సెకన్లతో
ఆరో స్థానం; ఓవరాల్‌గా 47 మందిలో 38వ ర్యాంక్‌).
పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌: సిద్ధాంత్‌ తింగలాయ (తన హీట్స్‌లో 13.64 సెకన్లతో ఏడో స్థానం; ఓవరాల్‌గా 41 మందిలో 31వ ర్యాంక్‌).


మహిళల జావెలిన్‌ త్రో: అన్ను రాణి (తన క్వాలిఫయింగ్‌ గ్రూప్‌లో 59.93 మీటర్లతో 10వ స్థానం; ఓవరాల్‌గా 31 మందిలో 20వ ర్యాంక్‌).
మహిళల హెప్టాథ్లాన్‌: స్వప్న బర్మన్‌ (5,431 పాయింట్లతో 31 మందిలో 26వ స్థానం)

పురుషుల మారథాన్‌: గోపీ థోనకల్‌ (2గం:17ని:13 సెకన్లతో 28వ స్థానం)
మహిళల మారథాన్‌: మోనిక అథారె (2గం:49ని:54 సెకన్లతో 92 మందిలో 64వ స్థానం)

పురుషుల 400 మీటర్లు: మొహమ్మద్‌ అనస్‌ (తన హీట్స్‌లో 45.98 సెకన్లతో నాలుగో స్థానం; ఓవరాల్‌గా
52 మందిలో 33వ ర్యాంక్‌).

మహిళల 400 మీటర్లు: నిర్మలా షెరోన్‌ (తన హీట్స్‌లో 52.01 సెకన్లతో నాలుగో స్థానంలో నిలిచి చివరిదైన 21వ బెర్త్‌గా సెమీఫైనల్‌కు అర్హత; సెమీఫైనల్లో టాప్‌–8లో నిలిస్తే ఫైనల్‌కు చేరుతుంది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement