olympics sports
-
ఆదమరిస్తే... అపాయమే!
రకరకాల అనుమానాలు, ఆందోళనలు, భయాల మధ్య ఇప్పటికే దేశంలో మనం ఒకటికి రెండు కరోనా ఉద్ధృతులను చూశాం. దేశవ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు మందిని పొట్టనబెట్టుకున్న ఈ వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని సంబరపడుతున్నాం. కానీ ప్రజల్లో పెరుగుతున్న నిర్లక్ష్యం నేపథ్యంలో పరిస్థితి అంత అద్భుతంగా ఏమీ లేదని వార్తలు, కేంద్రం చేస్తున్న ప్రకటనలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఉత్తరాదిలోని మనాలీ, సిమ్లా, ముస్సోరీ తదితర పర్వతప్రాంత పర్యాటక కేంద్రాలలో, సుదీర్ఘకాలపు లాక్డౌన్ నుంచి బయటపడ్డ ఢిల్లీ మార్కెట్లలో, దక్షిణాదిన అనేక రాష్ట్రాలలో జాగ్రత్తలు గాలికి వదిలేసి మాస్కులు లేకుండా తిరుగుతున్న వేలాది జనం ఫొటోలు ఉలిక్కి పడేలా చేశాయి. భౌతిక దూరం పాటించని జన సమూహాలు, నియంత్రణ పాటించని విందు వినోదాలు, అనేకచోట్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగాల తీరు భయపెడుతోంది. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న మాట దేవుడెరుగు... అసలు సెకండ్‌వేవ్ ముప్పే ఇంకా పూర్తిగా తొలగిపోలేదని కేంద్రం చేస్తున్న హెచ్చరికను పెడచెవిన పెట్టలేం. తక్షణమే కఠినచర్యలు చేపట్టమంటూ, కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న 8 (అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సామ్, మేఘాలయ, త్రిపుర, సిక్కిమ్, కేరళ, ఒడిశా) రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బుధవారం లేఖ రాయడం గమనార్హం. నూటికి 90 మందికి పైగా వ్యాధి నుంచి కోలుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ దేశంలో 73 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు (సీపీఆర్) 10 శాతం కన్నా ఎక్కువుంది. త్వరితగతిన విస్తరించే ఈ వ్యాధి విషయంలో అదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆ 73 జిల్లాల్లో 46 జిల్లాలు ఈశాన్య రాష్ట్రాలలోవే. కరోనా కట్టడి కోసం ‘టెస్టు చేయడం–ట్రాక్ చేయడం–ట్రీట్ చేయడం–టీకా వేయడం– కోవిడ్ జాగ్రత్తలను పాటించడం అనే అయిదంచెల ప్రణాళికను పాటించాలని సర్కారు గుర్తు చేసింది. భిన్న భౌగోళిక పరిస్థితుల సువిశాల భారతదేశంలో ఏ పాలకుడికైనా ఇది ఒక సవాలే. అందుకే, ఇలాంటి సందర్భాల్లో పౌరుల చైతన్యం, భాగస్వామ్యం అవసరమవుతుంది. అక్కడే అసలు చిక్కుంది. గత ఏడాది తొలి ఉద్ధృతిలో దేశవ్యాప్త లాక్డౌన్ చూశాం. ఈ ఏడాది రెండో ఉద్ధృతిలో ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు, ఆధ్యాత్మికులను ఆకట్టుకొనే కుంభమేళాలకు ప్రాధాన్యమిస్తూ, కేంద్రం ప్రేక్షక పాత్ర పోషించడం చూశాం. పెద్దన్న చేతులెత్తేశాక, రాష్ట్రాల వారీ స్థానిక నియంత్రణల్లో గడుపుతూ వచ్చాం. దేశంలో ఆక్సిజన్, ఆసుపత్రి పడకలు, ఇంజక్షన్లు, చివరకు టీకాలు – ఇలా అన్ని కొరతలూ అనుభవించి, దాదాపు రెండు నెలల భీతావహ అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్నాం. కానీ, కొద్ది వారాల్లో మళ్ళీ మూడో వేవ్ ముప్పు తప్పదని విశ్లేషకుల మాట. అందుకే, ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమే తప్ప, ఆదమరిచిపోవాల్సిన తరుణం కాదు. నిజానికి, దేశంలో ఈ ఏడాది జనవరి 16న కరోనా టీకాలు వేసే బృహత్తర యజ్ఞం మొదలైంది. నిండా ఆరు నెలలైనా అయ్యీ అవక ముందే దాదాపు 34 కోట్ల మందికి, అంటే దాదాపు అమెరికా మొత్తం జనాభా అంతమందికి కనీసం ఒక డోసయినా టీకా వేశామన్నది కేంద్ర సర్కారు లెక్క. అలాగే, జూన్ 21 నుంచి ప్రతిరోజూ సగటున 50 లక్షల మందికి, అంటే దాదాపు నార్వే మొత్తం జనాభా అంతమందికి టీకా వేస్తున్నామని కేంద్రం ప్రకటిస్తోంది. కానీ, మునుపటితో పోలిస్తే దేశవ్యాప్తంగా సగటున టీకాల ప్రక్రియ వేగం తగ్గిందనేది వాస్తవం. గత నెల ఆఖరు వారంలో రోజుకు 46 లక్షల టీకాలు వేస్తే, ఈ నెల తొలివారంలో అది రోజుకు 35 లక్షలకు తగ్గిందని వార్తా కథనాల మాట. అంకెల ఆర్భాటం మాటెలా ఉన్నా, అసలైతే కరోనా టీకాల ప్రక్రియ ఆగకుండా సాగుతోందన్నంత వరకు అనుమానాలు ఉండక్కర లేదు. కానీ, అదొక్కటే సరిపోతుందా? టీకాలు వేసుకున్నా, ప్రాథమిక జాగ్రత్తలు సుదీర్ఘ కాలం తప్పనిసరి అన్న శాస్త్ర నిపుణుల మాట పెడచెవిన పెట్టచ్చా? ఇవన్నీ జవాబు తెలిసి కూడా మనం ఉదాసీనతతో విస్మరిస్తున్న ప్రశ్నలు! ప్రపంచ వ్యాప్తంగా చూసినా, అప్రమత్తత అవసరమనే అర్థమవుతోంది. మరో రెండు వారాల్లో ఈ నెల 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న వేళ జపాన్ అక్కడ ‘వైరస్ ఎమర్జెన్సీ’ని ప్రకటించడం గమనార్హం. పెరుగుతున్న కరోనా కేసులతో అక్కడ ఒలింపిక్స్ కాలమంతా అనేక కఠినఆంక్షలు విధించారు. 11 వేల మంది అథ్లెట్లు పాల్గొనే ఈ ప్రపంచ స్థాయి పండుగలో విందు, వినోదాలనూ నిషేధించారు. ప్రేక్షకులు లేకుండానే పోటీలు జరుగుతాయని ప్రకటించారు. పొరుగునే జరుగుతున్న ఈ పరిణామాలు మనం పడాల్సిన ముందుజాగ్రత్తను మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. పైపెచ్చు, వచ్చే ఏడాది మొదట్లో దేశంలో మరో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనుండడం అప్పుడే వేడి పుట్టిస్తోంది. పార్టీలు గనక మళ్ళీ పాత పొరపాటే చేస్తే, అది ఆత్మహత్యా సదృశమే. సభల మాటెలా ఉన్నా, భుక్తి కోసం సామాన్యులకు జీవన పోరాటం తప్పదు. కరోనాతో సహజీవనం చేయక తప్పనివేళ పాలకులు అనుసరించే విధానాలు, చేపట్టే ఆరోగ్యకార్యక్రమాలతో పాటు ప్రజలు తీసుకొనే స్వీయజాగ్రత్తలూ అంతే ముఖ్యం. మాస్కు ధరించడం, చేతులు ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవడం, సమూహాలకు దూరంగా ఉండడం ఎవరికి వారు సులభంగా ఆచరించదగినవే. ఫస్ట్‌వేవ్ తగ్గీ తగ్గగానే ఈ జనవరి నుంచి మనం చేసిన తప్పు– ఆ కనీస జాగ్రత్తలు విస్మరించడమే! అలా సెకండ్ వేవ్ కష్టాలు తెచ్చుకున్నాం. మరుపు మానవ సహజం, స్వభావం. కష్టాల్ని మర్చిపోవాల్సిందే కానీ, పడ్డ కష్టాల నుంచి నేర్చుకున్న పాఠాలను మర్చిపోతేనే పెద్ద కష్టం! -
గేలి చేసినా గోల్ చేశా..
అమ్మ తోడ్పాటు, నాన్న కష్టం, శిక్షకుల ప్రోత్సాహం అడవిపల్లె నుంచి నా ప్రతిభను అంతర్జాతీయక్రీడా యవనికపై సుస్థిరం చేశాయి. ఇద్దరు ఆడపిల్లలతల్లి అని మా అమ్మను గేలి చేశారు. హాకీలో శిక్షణ కోసం కురచ దుస్తులు వేసుకుని వెళుతుంటే ఎగతాళి చేశారు. వారిమాటలు నాలో పట్టుదలను పెంచాయి. ఒలింపిక్స్‌లో దేశం నుంచిప్రాతినిథ్యం వహించి, నా పల్లెకు గుర్తింపు తెచ్చాను. హేళన చేసినవారి నుంచే అభినందనలు అందుకున్నా. పట్టుదలకు ప్రోత్సాహం తోడైతే పేదరికాన్ని కూడా జయించవచ్చని హాకీ జాతీయ జట్టుగోల్కీపర్ రజని తన మనసులోని భావాలు పంచుకుంది. చిత్తూరు, భాకరాపేట: మాది ఎర్రావారిపాళెం మండలం ఎనుములవారిపల్లె గ్రామం. ఇది మారుమూల అటవీ సరిహద్దుల్లో ఉంటుంది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం, ఒక తమ్ముడు. నేను రెండో అమ్మాయిని ఐదో తరగతి వరకు పచ్చారవారిపల్లె ప్రాథమిక పాఠశాలకు వెళ్లేదాన్ని. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి బడికి వెళ్లేదాన్ని. అప్పుడు మా బంధువులు కూడా మా అమ్మను ఆడపిల్లల తల్లి అంటూ ఆటపట్టించేవారు. ఎవరినీ ఏమీ అనలేకపోయేదాన్ని. హైస్కూల్లో ఉండగా మా పీఈటీ మాస్టర్ వెంకట రాజు ఆటల పోటీలు నిర్వహించేవారు. నేను కాస్త చురుగ్గా ఉన్నానని గ్రహించిన ఆయన హాకీలో మెళకువలు నేర్పారు. ఆయన సారథ్యంలోనే శిక్షణ తీసుకున్నా. నేను ముందే చెప్పాను కదా సార్. మాది పల్లె. అక్కడి ప్రజల తీరు, మాటలు ఎలా ఉంటాయో మీకు తెలియనిది కాదు. బడికి వెళ్లేటప్పుడు అచ్చు ఆడపిల్ల లా దుస్తులు ధరించే దాన్ని. అయితే హాకీలో శిక్షణకు అవి పనికిరావు. ప్యాంట్, టీషర్టు ధరించి వెళుతుం టే ఆటపట్టించడం నాకు గుర్తు. మా అమ్మ తులసి ఒక మాట అడిగింది. ఈ దుస్తులు వేసుకుని ఆడగలవా? అందుకు నేను చెప్పింది ఒకటే మాట. ఎందుకంటే నా చిన్నతనంలో చూసినవి మనసులో ఉండిపోయాయి. ‘‘అమ్మ పాడి గేదెలు ఇచ్చే పాలు పితకడం, మా నాన్న రమణాచారి వడ్రంగి పనులతో’’ కష్టపడే తీరు నాలోని కసి పెంచింది. అదే పట్టుదలతో హాకీపై మనసు లగ్నం చేశాను. కఠోర సాధన చేయడానికి మా అమ్మ ఆశీర్వాదం, మా నాన్న కష్టం వృథా కానివ్వకూడదని కసిగా సాధన చేశాను. ఆటంకం కాకూడదని.. నా పట్టుదల చూసిన మా అమ్మ,నాన్న కష్టాలు భరించారు. నాలోని క్రీడాకారిణికి ఊపిరి పోయడానికి అప్పులు చేసి, కోచింగ్ క్యాంపులకు పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పేదరికంలో ఉంటే ఎంత చిన్నతనమో అనేది కూడా మా పల్లెల్లో కళ్లారా చూశాను. ఆ సంఘటనలు నేను మరిచిపోలేను. నా బాధ చూసిన మా అమ్మా, నాన్న ఇవన్నీ నీవు ఏమి పట్టించుకోవద్దు. భవిష్యత్తు ఉంది. అనుకున్నది సాధించు. ఇక్కడే మనకు కోల్పోయిన గౌరవం, అభిమానం దక్కుతుందన్నారు. ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే వాస్తవం అనిపిస్తుంది. మొదట నేను జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైనప్పుడు చాలా మంది నోళ్లలో మా ఊరి పేరు నానింది. అనేక ఒడుదుడుకులు ఎదుర్కొ ని, మన దేశం నుంచి ఒలింపిక్ హాకీ జట్టుకు నేను గోల్‌కీపర్‌గా ప్రాతినిథ్యం కల్పించడానికి అవకాశం కల్పించింది. అంతే..! మా పల్లె ప్రపంచ క్రీడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆ సమయంలో బయటివారే కాదు. మా అమ్మనాన్నలకు ఊరి వారి నుంచి అభినందనలు, నాకు శుభాకాంక్షలు అందిన సందర్భంలో కన్నీరు ఉబికింది. బాధతో కాదు.. ఆనందంతో. ఎక్కడైతే నేను, మా అమ్మ హేళనకు గురయ్యామో అక్కడే అభినందనలు అందుకోవడం మరిచిపోలేని తీపి గురుతు. ఆడపిల్లల తల్లిదండ్రులకు మా అమ్మనాన్న ప్రేరణ కలిగించారనే సంతృప్తి మిగిలింది. రజనీ ప్రస్థానం ♦ 2004: ఆరో తరగతిలోనే పుత్తూరులో జరిగిన జోనల్స్‌లో రన్నర్‌గా నిలిచింది ♦ 2005లో తిరుపతిలో జరిగిన ఇంటర్ జోనల్స్‌లో ప్రాతినిథ్యం ♦ 2005లో పంజాబ్ రాష్ట్రం జలంధర్ ♦ 2006 ఢిల్లీ ♦ 2007లో కోయంబత్తూరు, జబల్పూర్ ♦ 2008లో రూర్కెలాలో జాతీయ పోటీలు ♦ 2009లో మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ ♦ 2010లో చైనా, న్యూజిలాండ్, చైనా, కొరియా, అర్జెంటీనాలో ఆడింది. ♦ 2011లో ఆస్ట్రియా పోటీల్లో ఈమె పాల్గొన్న జట్టు సిల్వర్ మెడల్ సాధించింది ♦ 2012 జనవరిలో ఢిల్లీలో జరిగిన హాకీలో చాంపియన్‌గా నిలిచింది. ♦ 2013లో నెదర్లాండ్, జర్మనీ, మలేషియా జరిగిన మ్యాచ్‌ల్లో ప్రాతిని«థ్యం. ♦ 2014లో అంతర్జాతీయ మ్యాచ్‌లో స్వర్ణపతకం ♦ 2016ఒలింపిక్ అర్హత సాధించింది ♦ 2017 జపాన్‌లో జరిగిన ఏసియన్ హాకీ చాంపియన్ షిప్లో ఆసియా చాంపియన్లుగా నిలిచిన భారత మహిళల జట్టుకు రజని గోల్ కీపర్ పల్లెటూరి పిల్లనే... పల్లెటూరి పిల్ల. ఏమిటీ డ్రస్సు అని ఆకతాయి మాటలు అన్నారు. అయినా కుంగిపోలేదు. ఇబ్బంది అనిపించడం సహజమే. కానీ అదే పల్లెటూరి పిల్లగా 18 దేశాల్లో జరిగిన హాకీ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాను. నన్ను ఎగతాళి చేసిన వారే.. రజనీనా మా ఊరి పిల్లేనబ్బా. మా ఊరికి గొప్ప పేరు తెచ్చిం దబ్బా అన్నారు. కుటుంబ నేపథ్యం.. తల్లి : తులసి (పశువుల కాపరి) తండ్రి : రమణాచారి (వడ్రంగి) సంతానం : ముగ్గురు కుమార్తెలు, కుమారుడు (రజనీ రెండో సంతానం) చదువు : 1 నుంచి 5 వరకు పచ్చార్లవాండ్లపల్లె, 6–10వరకు నెరబైలు, తిరుపతిలో డిగ్రీ తల్లి తులసి, తండ్రి రమణాచారిలతో రజని -
ఎన్నాళ్లీ మందగమనం!
► ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్ దయనీయ స్థితి ►ప్రాతినిధ్యమే తప్ప పతకాలు గగనం ►పురోగతికి ప్రణాళికలు అంతంత మాత్రం ఆసియా క్రీడలు... ఆసియా చాంపియన్‌షిప్... కామన్వెల్త్ గేమ్స్... గ్రాండ్‌ప్రి సిరీస్‌లు... ఇలా ఏ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ జరిగినా భారత క్రీడాకారులు పతకాలతో తిరిగొస్తారు. తమ అత్యుత్తమ సమయాలను నమోదు చేస్తారు. జాతీయ రికార్డులనూ తిరగరాస్తారు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్ క్రీడలు వచ్చేసరికి మాత్రం మనోళ్ల ప్రదర్శన తీసికట్టుగా మారిపోతోంది. ఈ వేదికలపై మన అథ్లెట్స్ గతంలో తాము సాధించిన అత్యుత్తమ ప్రదర్శనలను కూడా పునరావృతం చేయలేకపోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు సన్నాహక టోర్నీల్లో రాణిస్తూ ఆశలు రేకెత్తించి... తీరా అసలు పోటీల్లో మాత్రం చేతులెత్తేస్తారు. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చిన్నదేశాలూ పతకాలు కొల్లగొడుతుంటే మనం మాత్రం ఎక్కడో నిలిచిపోతున్నాం. సాక్షి క్రీడావిభాగం : మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌కు ఒకే ఒక్క పతకం వచ్చింది. 2003లో పారిస్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీ జార్జి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత ఆరుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లు జరిగినా భారత క్రీడాకారులు పతకం సమీపానికి కూడా వెళ్లలేకపోయారు. అర్హత టోర్నీల్లో రాణించడం... ప్రపంచ పోటీలకు బెర్త్‌లు సంపాదించడం... ఆ తర్వాత బరిలోకి దిగి, రిక్తహస్తాలతో తిరిగి రావడం పరిపాటైంది. 2015 బీజింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వికాస్ గౌడ (డిస్కస్ త్రో), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), లలితా బబర్ (మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్) ఫైనల్లోకి ప్రవేశించినా పతకం మాత్రం నెగ్గలేకపోయారు. ఈసారి భారత్ నుంచి అత్యధిక 25 మంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. అయితే ఈ జాబితాలో కేవలం నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)పైనే కాస్త ఆశలు ఉన్నాయి. గత ఏడాది అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ జావెలిన్‌ను 86.48 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకం సాధించడమే దీనికి కారణం. అయితే అండర్–20 చాంపియన్‌షిప్ ప్రమాణాలను సీనియర్ స్థాయితో పోల్చలేము. కానీ గత ప్రదర్శనను పక్కనబెట్టి క్వాలిఫయింగ్, ఫైనల్ ఈవెంట్ రోజున రాణించివారినే పతకం వరిస్తుందనే విషయం గమనార్హం. దాంతో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన పునరావృతం చేస్తే ఫైనల్‌కు చేరవచ్చు. ఆ ఇద్దరికి మొండిచేయి... జూలై తొలి వారంలో భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించినవారు ప్రపంచ చాంపియన్‌షిప్‌కు నేరుగా అర్హత సాధిస్తారని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రకటించింది. మహిళల 1500 మీటర్లలో పీయూ చిత్రా (కేరళ), 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సుధా సింగ్ విజేతలుగా నిలిచి ‘లండన్’ బెర్త్ ఖాయం చేసుకున్నారు. అయితే ఈ ప్రదర్శనతో లండన్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరడం కూడా కష్టమేనని ఏఎఫ్ఐ అధికారులు వ్యాఖ్యానిస్తూ చిత్రా, సుధా సింగ్‌లను ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు పంపించకపోవడం గమ నార్హం. ఇక మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీచంద్ అర్హత ప్రమాణ సమయాన్ని అందుకోకపోయినా... కనీస సంఖ్యలో ఎంట్రీలు ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ద్యుతీ చంద్‌ను ఈ పోటీలకు ఆహ్వానించింది. కానీ ద్యుతీచంద్ తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయడంలో విఫలమై హీట్స్‌లోనే వెనుదిరిగింది. ప్రణాళిక లోపం... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చిన్న దేశాలూ పతకాలు గెలుస్తున్న చోట భారత క్రీడాకారులు ఎందుకు విఫలం అవుతున్నారనే విషయంపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య, కోచ్‌లు, క్రీడాధికారులు చెప్పే కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే అథ్లెటిక్స్‌లో ఒకప్పుడు ఎంతో వెనుకంజలో ఉన్న ఆసియా దేశాలు నేడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచే స్థాయికి వచ్చాయి. స్ప్రింట్ ఈవెంట్స్‌లోనూ ఆసియా క్రీడాకారులు జమైకా, అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికాలాంటి మేటి దేశాలకు పోటీనిచ్చే స్థాయికి చేరుకున్నారు. ఆయా దేశాలు ఒక పక్కా వ్యవస్థను ఏర్పరచుకొని, సుదీర్ఘ ప్రణా ళికలు రూపొందించి వాటిని పకడ్బందీ అమలు చేస్తూ ఇప్పుడు వాటి ఫలితాలను అందుకుంటున్నారు. అయితే భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపిం చడంలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్ సమయంలో క్రీడాకారుల వైఫల్యంపై హడావిడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం సాధారణమైపోయింది. ఇకనైనా అథ్లెటిక్స్ సమాఖ్య పారదర్శకంగా, ప్రణాళికయుతంగా వ్యవహరించి... ప్రతిభాశీలురను గుర్తించి... వారికి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిరంతరం శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాలి. స్కూల్, కాలేజీ, యూనివర్సి టీలలో అథ్లెటిక్స్ ట్రాక్‌లను నిర్మించేందుకు ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలి. ఇలా చేస్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే దశాబ్దకాలంలో భారత్ నుంచీ ప్రపంచ, ఒలింపిక్ విజేతలు అవతరించే అవకాశముంది. ‘లండన్’ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన మహిళల 100 మీటర్లు: ద్యుతీచంద్ (తన హీట్స్‌లో 12.07 సెకన్లతో ఆరో స్థానం; ఓవరాల్‌గా 47 మందిలో 38వ ర్యాంక్). పురుషుల 110 మీటర్ల హర్డిల్స్: సిద్ధాంత్ తింగలాయ (తన హీట్స్‌లో 13.64 సెకన్లతో ఏడో స్థానం; ఓవరాల్‌గా 41 మందిలో 31వ ర్యాంక్). మహిళల జావెలిన్ త్రో: అన్ను రాణి (తన క్వాలిఫయింగ్ గ్రూప్‌లో 59.93 మీటర్లతో 10వ స్థానం; ఓవరాల్‌గా 31 మందిలో 20వ ర్యాంక్). మహిళల హెప్టాథ్లాన్: స్వప్న బర్మన్ (5,431 పాయింట్లతో 31 మందిలో 26వ స్థానం) పురుషుల మారథాన్: గోపీ థోనకల్ (2గం:17ని:13 సెకన్లతో 28వ స్థానం) మహిళల మారథాన్: మోనిక అథారె (2గం:49ని:54 సెకన్లతో 92 మందిలో 64వ స్థానం) పురుషుల 400 మీటర్లు: మొహమ్మద్ అనస్ (తన హీట్స్‌లో 45.98 సెకన్లతో నాలుగో స్థానం; ఓవరాల్‌గా 52 మందిలో 33వ ర్యాంక్). మహిళల 400 మీటర్లు: నిర్మలా షెరోన్ (తన హీట్స్‌లో 52.01 సెకన్లతో నాలుగో స్థానంలో నిలిచి చివరిదైన 21వ బెర్త్‌గా సెమీఫైనల్‌కు అర్హత; సెమీఫైనల్లో టాప్–8లో నిలిస్తే ఫైనల్‌కు చేరుతుంది) -
ఒలింపిక్ క్రీడల్లో క్యారమ్స్ను చేర్చాలి
వరల్డ్ చాంపియన్ అపూర్వ ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలలో క్యారమ్స్ను చేరిస్తే బాగుంటుందని వరల్డ్ చాంపియన్ అపూర్వ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయస్థాయిలో రాణిస్తే క్యారమ్స్ క్రీడాకారులకు దేశంలో మరింత గుర్తింపు వస్తుందన్నారు. సోమవారం స్థానిక సూర్యగార్డెన్స్‌లో జరుగుతున్న ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కారమ్స్, చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ముచ్చటించిన విషయాలు ఆమె మాటల్లోనే.. – ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) ‘ఎనిమిదేళ్ల వయస్సు నుంచి హైదరాబాద్ క్యారమ్స్ అసోసియేషన్ నేతృత్వంతో నా తండ్రి సాయికుమార్ కోచ్‌గా శిక్షణ పొందాను. 2004లో శ్రీలంకలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో విజేతగా నిలిచాను. సార్క్ పోటీల్లో సిల్వర్‌మెడల్‌తో పాటు ఇటీవల మాల్దీవులలో జరిగిన టోర్నమెంట్లో ఇండియా గెలవగా, ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచా. దేశంలో జరిగిన అనేక టోర్నమెంట్లలో విజ యం సాధించాను. బర్మింగ్‌హామ్‌లో నవంబరులో జరిగే వరల్డ్æచాంపియన్‌షిప్ పోటీలకు దేశం తరఫున ఎంపికైన నలుగురిలో ఉన్నాను. స్పోర్ట్స్‌కోటాలో ఎల్ఐసీలో ఉద్యోగం లభించింది. ఇప్పుడు ఏవోగా పదోన్నతి వచ్చింది. ఇంకా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. క్యారమ్స్‌లో రాణించడానికి ఎల్ఐసీ యాజమాన్యం అన్ని విధాలా సహకరిస్తోంది. సాధన చేసేందుకు ఒక పూట మాత్రమే కార్యాలయానికి వెళ్లేలా వెసులుబాటు లభించింది. ఎల్ఐసీలో ఉద్యోగంలో చేరాకే వరల్డ్ చాంపియన్నయ్యాను. నిరంతర కఠోరసాధన, ఏకాగ్రతతో ఆడటం ద్వారా విజయం సాధించవచ్చు. ఆటగాళ్లకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.