జట్టు గోల్ కీపర్ రజని
అమ్మ తోడ్పాటు, నాన్న కష్టం, శిక్షకుల ప్రోత్సాహం అడవిపల్లె నుంచి నా ప్రతిభను అంతర్జాతీయక్రీడా యవనికపై సుస్థిరం చేశాయి. ఇద్దరు ఆడపిల్లలతల్లి అని మా అమ్మను గేలి చేశారు. హాకీలో శిక్షణ కోసం కురచ దుస్తులు వేసుకుని వెళుతుంటే ఎగతాళి చేశారు. వారిమాటలు నాలో పట్టుదలను పెంచాయి. ఒలింపిక్స్‌లో దేశం నుంచిప్రాతినిథ్యం వహించి, నా పల్లెకు గుర్తింపు తెచ్చాను. హేళన చేసినవారి నుంచే అభినందనలు అందుకున్నా. పట్టుదలకు ప్రోత్సాహం తోడైతే పేదరికాన్ని కూడా జయించవచ్చని హాకీ జాతీయ జట్టుగోల్‌కీపర్ రజని తన మనసులోని భావాలు పంచుకుంది.
చిత్తూరు, భాకరాపేట: మాది ఎర్రావారిపాళెం మండలం ఎనుములవారిపల్లె గ్రామం. ఇది మారుమూల అటవీ సరిహద్దుల్లో ఉంటుంది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం, ఒక తమ్ముడు. నేను రెండో అమ్మాయిని ఐదో తరగతి వరకు పచ్చారవారిపల్లె ప్రాథమిక పాఠశాలకు వెళ్లేదాన్ని. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి బడికి వెళ్లేదాన్ని. అప్పుడు మా బంధువులు కూడా మా అమ్మను ఆడపిల్లల తల్లి అంటూ ఆటపట్టించేవారు. ఎవరినీ ఏమీ అనలేకపోయేదాన్ని. హైస్కూల్‌లో ఉండగా మా పీఈటీ మాస్టర్ వెంకట రాజు ఆటల పోటీలు నిర్వహించేవారు. నేను కాస్త చురుగ్గా ఉన్నానని గ్రహించిన ఆయన హాకీలో మెళకువలు నేర్పారు. ఆయన సారథ్యంలోనే శిక్షణ తీసుకున్నా. నేను ముందే చెప్పాను కదా సార్. మాది పల్లె.
అక్కడి ప్రజల తీరు, మాటలు ఎలా ఉంటాయో మీకు తెలియనిది కాదు. బడికి వెళ్లేటప్పుడు అచ్చు ఆడపిల్ల లా దుస్తులు ధరించే దాన్ని. అయితే హాకీలో శిక్షణకు అవి పనికిరావు. ప్యాంట్, టీషర్టు ధరించి వెళుతుం టే ఆటపట్టించడం నాకు గుర్తు. మా అమ్మ తులసి ఒక మాట అడిగింది. ఈ దుస్తులు వేసుకుని ఆడగలవా? అందుకు నేను చెప్పింది ఒకటే మాట. ఎందుకంటే నా చిన్నతనంలో చూసినవి మనసులో ఉండిపోయాయి. ‘‘అమ్మ పాడి గేదెలు ఇచ్చే పాలు పితకడం, మా నాన్న రమణాచారి వడ్రంగి పనులతో’’ కష్టపడే తీరు నాలోని కసి పెంచింది. అదే పట్టుదలతో హాకీపై మనసు లగ్నం చేశాను. కఠోర సాధన చేయడానికి మా అమ్మ ఆశీర్వాదం, మా నాన్న కష్టం వృథా కానివ్వకూడదని కసిగా సాధన చేశాను.
ఆటంకం కాకూడదని..
నా పట్టుదల చూసిన మా అమ్మ,నాన్న కష్టాలు భరించారు. నాలోని క్రీడాకారిణికి ఊపిరి పోయడానికి అప్పులు చేసి, కోచింగ్ క్యాంపులకు పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పేదరికంలో ఉంటే ఎంత చిన్నతనమో అనేది కూడా మా పల్లెల్లో కళ్లారా చూశాను. ఆ సంఘటనలు నేను మరిచిపోలేను. నా బాధ చూసిన మా అమ్మా, నాన్న ఇవన్నీ నీవు ఏమి పట్టించుకోవద్దు. భవిష్యత్తు ఉంది. అనుకున్నది సాధించు. ఇక్కడే మనకు కోల్పోయిన గౌరవం, అభిమానం దక్కుతుందన్నారు. ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే వాస్తవం అనిపిస్తుంది. మొదట నేను జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైనప్పుడు చాలా మంది నోళ్లలో మా ఊరి పేరు నానింది. అనేక ఒడుదుడుకులు ఎదుర్కొ ని, మన దేశం నుంచి ఒలింపిక్ హాకీ జట్టుకు నేను గోల్‌కీపర్‌గా ప్రాతినిథ్యం కల్పించడానికి అవకాశం కల్పించింది. అంతే..! మా పల్లె ప్రపంచ క్రీడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆ సమయంలో బయటివారే కాదు. మా అమ్మనాన్నలకు ఊరి వారి నుంచి అభినందనలు, నాకు శుభాకాంక్షలు అందిన సందర్భంలో కన్నీరు ఉబికింది. బాధతో కాదు.. ఆనందంతో. ఎక్కడైతే నేను, మా అమ్మ హేళనకు గురయ్యామో అక్కడే అభినందనలు అందుకోవడం మరిచిపోలేని తీపి గురుతు. ఆడపిల్లల తల్లిదండ్రులకు మా అమ్మనాన్న ప్రేరణ కలిగించారనే సంతృప్తి మిగిలింది.
రజనీ ప్రస్థానం
♦ 2004: ఆరో తరగతిలోనే పుత్తూరులో జరిగిన జోనల్స్‌లో రన్నర్‌గా నిలిచింది
♦ 2005లో తిరుపతిలో జరిగిన ఇంటర్ జోనల్స్‌లో ప్రాతినిథ్యం
♦ 2005లో పంజాబ్ రాష్ట్రం జలంధర్
♦ 2006 ఢిల్లీ
♦ 2007లో కోయంబత్తూరు, జబల్‌పూర్
♦ 2008లో రూర్కెలాలో జాతీయ పోటీలు
♦ 2009లో మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్
♦ 2010లో చైనా, న్యూజిలాండ్, చైనా, కొరియా, అర్జెంటీనాలో ఆడింది.
♦ 2011లో ఆస్ట్రియా పోటీల్లో ఈమె పాల్గొన్న జట్టు సిల్వర్ మెడల్ సాధించింది
♦ 2012 జనవరిలో ఢిల్లీలో జరిగిన హాకీలో చాంపియన్‌గా నిలిచింది.
♦ 2013లో నెదర్‌లాండ్, జర్మనీ, మలేషియా జరిగిన మ్యాచ్‌ల్లో ప్రాతిని«థ్యం.
♦ 2014లో అంతర్జాతీయ మ్యాచ్‌లో స్వర్ణపతకం
♦ 2016ఒలింపిక్ అర్హత సాధించింది
♦ 2017 జపాన్‌లో జరిగిన ఏసియన్ హాకీ చాంపియన్ షిప్‌లో ఆసియా చాంపియన్లుగా నిలిచిన భారత మహిళల జట్టుకు రజని గోల్ కీపర్
పల్లెటూరి పిల్లనే...
పల్లెటూరి పిల్ల. ఏమిటీ డ్రస్సు అని ఆకతాయి మాటలు అన్నారు. అయినా కుంగిపోలేదు. ఇబ్బంది అనిపించడం సహజమే. కానీ అదే పల్లెటూరి పిల్లగా 18 దేశాల్లో జరిగిన హాకీ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాను. నన్ను ఎగతాళి చేసిన వారే.. రజనీనా మా ఊరి పిల్లేనబ్బా. మా ఊరికి గొప్ప పేరు తెచ్చిం దబ్బా అన్నారు.
కుటుంబ నేపథ్యం..
తల్లి : తులసి (పశువుల కాపరి)
తండ్రి : రమణాచారి (వడ్రంగి)
సంతానం : ముగ్గురు కుమార్తెలు, కుమారుడు (రజనీ రెండో సంతానం)
చదువు : 1 నుంచి 5 వరకు పచ్చార్లవాండ్లపల్లె, 6–10వరకు నెరబైలు, తిరుపతిలో డిగ్రీ
తల్లి తులసి, తండ్రి రమణాచారిలతో రజని
Comments
Please login to add a commentAdd a comment