దుతీ జాతీయ పోటీల్లో పాల్గొనొచ్చు!
‘కాస్’ మధ్యంతర ఉత్తర్వులు
న్యూఢిల్లీ: పురుష హార్మోన్లు ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న కారణంతో అనర్హత వేటుకు గురైన భారత మహిళా స్ప్రింటర్ దుతీ చంద్‌కు ఊరట లభించింది. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (కాస్) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పురుష హార్మోన్ల కారణంగా కామన్వెల్త్, ఆసియా క్రీడలకు దూరమైన దుతీ... అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘానికి (ఐఏఏఎఫ్) సంబంధించిన హైపరాండ్రోగ్నిజమ్ (మహిళల అథ్లెట్లలో ఎక్కువ స్థాయిలో పురుషుల హార్మోన్లు ఉండటం) విధానంపై ‘కాస్’లో పోరాడుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసులో తుది తీర్పు వెల్లడించే వరకు అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉండాలని కోర్టు సూచించింది. వచ్చే జనవరి చివరి వరకు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ‘కాస్’ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల దుతీకి పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. ప్రస్తుతం అథ్లెటిక్స్‌కు ఆఫ్ సీజన్ కావడంతో ఆమె పోటీల్లో పాల్గొనే అవకాశాల్లేవు. దుతీ చంద్‌కు జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వడం పట్ల భారత కోచ్, హైదరాబాద్‌కు చెందిన నాగపురి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు.