
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం(ఫిబ్రవరి 24)ప్రారంభమయ్యాయి. తొలి సమావేశాల్లో సీఎం రేఖాగుప్తా సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్)తరపున ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతిషి ఎన్నికైన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మహిళలకు నెలకు రూ.2500 నగదు ఇచ్చే అంశంపై సీఎం రేఖాగుప్తా కీలక ప్రకటన చేశారు.
తమ ప్రభుత్వ ప్రాధాన్యం మహిళలకు నెలకు రూ.2500 స్కీమ్ అమలు చేయడమేనని సీఎం రేఖాగుప్తా అన్నారు. అయితే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయినందున స్కీమ్ అమలు కొంత ఆలస్యం జరగొచ్చని పరోక్ష సంకేతాలిచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత అతిషి అభ్యంతరం తెలిపారు. తాము మంచి స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని అప్పగించామని కౌంటర్ ఇచ్చారు.
అయితే సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నిర్వహించిన క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ.2500 బదిలీ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఆమ్‌ఆద్మీపార్టీ విమర్శలు చేసింది. ఎన్నికల హామీలను విస్మరించారని మాజీ సీఎం అతిషి ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. తొలి రోజే తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై సీఎం రేఖాగుప్తా ఆప్‌పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలకు నగదు బదిలీపై ఢిల్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment