వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్.. విశ్వవ్యాప్తంగా అథ్లెట్లు తమ సత్తా చాటేందుకు అత్యున్నత వేదిక.. ఒలింపిక్స్ మెడల్‌కి సమానమైన ఘనత.. ఈ మెగా ఈవెంట్ మొదలై రెండు దశాబ్దాలు దాటిపోయాయి.. మరి భారత్ సాధించిన విజయాలు అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి..
ఎందుకంటే విజయం సంగతేమో కానీ, అప్పటికి ప్రపంచ వేదికపై మన అథ్లెట్లు పాల్గొనడమే గొప్పగా భావించే పరిస్థితి.. అలాంటి సమయంలో సాధించిన విజయం.. ఆ పతకాన్ని పొందిన అథ్లెట్ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అందుకే ఆమె గెలిచిన కంచు కూడా మనకు కనకమే! అందుకే ఆమె విజయానికి అంత విలువ.. అలాంటి అరుదైన క్షణాన్ని లిఖించిన లాంగ్ జంపర్‌గా, భారత అత్యుత్తమ అథ్లెట్‌లలో ఒకరిగా నిలిచిన ప్రత్యేకత అంజూ బాబీ జార్జ్ సొంతం.
కఠినమైన శిక్షణతో
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌కి రంగం సిద్ధమైంది. అప్పటికే అంజూ ఈ మెగా పోరు కోసం చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. ఆమె భర్త, బాబీ జార్జ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. యూరప్ కేంద్రంగా అప్పటికి అలవాటు లేని ప్రతికూల పరిస్థితుల్లో ఆమె సాధన కొనసాగుతోంది.
అరుదైన జన్యుపరమైన వ్యాధి
అన్నింటికి మించి వరల్డ్ చాంపియన్ షిప్స్ కోసమే లాంగ్ జంప్ దిగ్గజం మైక్ పావెల్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాడు. పోరుకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఒకరోజు కాస్త అనారోగ్యంగా కనిపించినా పెద్ద సమస్యేమీ కాదు, కఠోర శ్రమ వల్ల కాస్త అలసట కావచ్చని అంజూ అనుకుంది. అయితే ఆ తర్వాతా శరీరంలో కాస్త తేడా అనిపించడంతో పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది.
ఒక్కసారిగా షాక్.. అయినా గానీ
అనూహ్యంగా పరీక్షల్లో యూనిలేటరల్ రీనల్ ఎజనీసస్ (యూఆర్‌ఏ) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు తేలింది. ఇలా ఉన్నవారు ఒకే కిడ్నీతో పుడతారు. అప్పటికి అంజూ వయసు 26 ఏళ్లు! ఇన్నేళ్లుగా ఎలాంటి సమస్యా రాలేదు. అసలు అలాంటి వ్యాధి ఒకటి ఉందని కూడా ఏనాడూ గుర్తించలేదు. దాంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురైంది.
భర్త మాటలే స్ఫూర్తిని నింపాయి
అయితే ఆ సమయంలో బాబీ జార్జ్ తన మాటలతో ఆమెలో స్ఫూర్తి నింపాడు. ‘ఇంతకాలం అదేమీ తెలియకుండా అథ్లెట్‌గా ఈ స్థాయికి చేరావు. ఇప్పుడు దాని గురించి బయటకు చెప్పుకొని లాభం లేదు. పైగా ఆటలో సత్తా చాటాల్సిన సమయంలో మనకు సానుభూతి అవసరం లేదు. నువ్వు ఎప్పటిలాగే పోరాడు’ అంటూ పోటీ వైపు దృష్టి మళ్లించాడు. ట్రాక్ లోపల, బయటా అన్నీ తానై నడిపిస్తున్న భర్త మాటలు అంజూను లక్ష్యం దిశగా నడిపించాయి.
పతకం దక్కిన ఘనతతో..
30 ఆగస్టు, 2003.. భారత అథ్లెటిక్స్‌కు సంబంధించి ఎప్పటికీ గుర్తుంచుకోదగిన రోజు. 6.70 మీటర్ల జంప్‌తో అంజూ మూడో స్థానం సాధించి పోడియంపై గర్వంగా నిలవగా, వేదికపై భారత జెండా ఎగిరింది. మన దేశానికి వరల్డ్ చాంపియన్ షిప్‌లో దక్కిన తొలి పతకం అది. 2022లో అంటే 19 ఏళ్ల తర్వాత జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం సాధించే వరకు కూడా అంజూ గెలిచిన పతకమే మన ఏకైక ఘనత అంటే దాని విలువ ఏమిటో తెలుస్తుంది.
ఈ విజయంతో ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 52 నుంచి ఏకంగా ఆరో స్థానానికి చేరుకుంది. అన్నింటికి మించి ప్రపంచ చాంపియన్ షిప్‌లో కాంస్యం గెలిచిన తర్వాత కూడా పలు విజయాలు సాధించినా తన ‘కిడ్నీ’ సమస్య గురించి అంజూ ప్రొఫెషనల్ కెరీర్‌లో ఏనాడూ చెప్పుకోలేదు.
అప్పుడు మాత్రమే
దాదాపు 17 ఏళ్ల తర్వాత అదీ ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్‌లో యువ క్రీడాకారిణుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతూ మొదటిసారి ఆమె దీని గురించి బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఆమెకు పదిహేడేళ్లప్పుడు కాలికి గాయం కాగా, అది ఏ చికిత్సకూ పూర్తిగా తగ్గలేదు. దానివల్ల పరుగు టేకాఫ్ సమయంలో ఆమెకు ఇబ్బంది కలిగేది. అయితే ఆ గాయంతో పాటు కిడ్నీ సమస్యను కూడా అధిగమించి అంజూ అగ్రస్థానానికి చేరడం విశేషం.
ఆల్‌రౌండర్ నుంచి లాంగ్‌జంప్ వైపు..
కేరళ అంటే భారత అథ్లెట్లకు పుట్టిల్లు. పీటీ ఉష, షైనీ విల్సన్ సహా ఎందరో అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు అక్కడి నుంచే వచ్చారు. అంజూ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. కొట్టాయంలోని చెంగనశెర్రి ఆమె స్వస్థలం. తండ్రి కేఆర్ మార్కోస్‌కు ఆటలపై ఉన్న ఆసక్తితో కూతురిని ప్రోత్సహించాడు.
స్కూల్లో అన్ని అథ్లెటిక్స్ పోటీల్లోనూ ఆమెదే పైచేయి. 100 మీటర్ల పరుగు, హర్డిల్స్, రిలే, లాంగ్‌జంప్, హైజంప్.. ఇలా ఎందులోనైనా వరుసగా విజయాలు దక్కేవి. ఆపై హెప్టాథ్లాన్ లోని ఏడు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ అంజూ వాటిలోనూ పట్టు సాధించింది.
అయితే త్రిసూర్‌లో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఆమె కెరీర్ పూర్తి స్థాయిలో మారింది. అలా అన్ని ఈవెంట్లలో కాకుండా ఏదో ఒక్కదాన్ని ఎంచుకుని దాని మీదే పట్టు సాధిస్తే భవిష్యత్తు బాగుంటుందనే సూచనతో చివరకు లాంగ్‌జంప్ వైపు అంజూ మొగ్గింది. 1996లో జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్ షిప్‌లో పతకం దక్కడంతో అంజూ ఎంచుకున్న దారి సరైందేనని తేలింది.
అతని ప్రోత్సాహంతో.. నిజానికి పెళ్లి తర్వాతే
ట్రిపుల్ జంప్‌లో జాతీయ చాంపియన్ రాబర్ట్ బాబీ జార్జ్. ఆటగాడిగా కెరీర్ ముగించిన తర్వాత కోచ్‌గా మారాడు. అంజూకు శిక్షణ ఇచ్చే కోచ్‌ల బృందంలో అతను కూడా ఒకడు కావడంతో బెంగళూరు స్పోర్ట్స్ అథారిటీ సెంటర్‌లో తొలిసారి జార్జ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఒక వైపు ఆటలో కోచింగ్‌తో పాటు పరిచయం ప్రేమగా మారింది.
ఆపై అతను పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ‘నాతో పెళ్లి వల్ల నీ ఆటకు ఎలాంటి ఆటంకం రాదని మాటిస్తున్నా’ అంటూ స్పష్టం చేశాడు కూడా. జార్జ్ కుటుంబానికి మంచి క్రీడా నేపథ్యం ఉంది. ఆ ఇంట్లో పది మంది సంతానంలో అతను ఒకడు. అందరూ ఏదో ఒక దశలో ఏదో ఒక క్రీడల్లో కాంపిటీటివ్ స్పోర్ట్స్ ఆడినవారే.
తల్లిదండ్రులను ఒప్పించగలిగింది
అలాంటి కుటుంబం కాబట్టి తాను కూడా తన తల్లిదండ్రులను ఒప్పించగలిగింది. 2000 సంవత్సరంలోనే వారి పెళ్లి జరిగింది. నిజంగానే ఆ తర్వాత ఆమె కెరీర్‌కు ఎలాంటి ఆటంకం రాలేదు. ఆపై జార్జ్ పూర్తి స్థాయి కోచ్‌గా అంజూ బాధ్యతను తీసుకున్నాడు. అంజూ మాటల్లో చెప్పాలంటే భర్తగాకంటే ‘కఠినమైన కోచ్’గా వ్యవహరిస్తూ ఆమెను తీర్చిదిద్దాడు. వరల్డ్ చాంపియన్ షిప్ సహా అంజూ అత్యుత్తమ ఘనతలన్నీ పెళ్లి తర్వాతే వచ్చాయి.
అత్యుత్తమ విజయాలు.. పురస్కారాలు
వరల్డ్ చాంపియన్ షిప్‌లో కాంస్యం, వరల్డ్ అథ్లెటిక్స్ మీట్ ఫైనల్‌లో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడల్లో స్వర్ణ, రజతాలు, కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్‌లో సాధించిన స్వర్ణ, రజతాలు అంజూ జార్జ్ కెరీర్‌లో కొన్ని కీలక, అత్యుత్తమ విజయాలు.
రెండు ఒలింపిక్స్ క్రీడల (2004, 2008) ప్రయత్నాల్లో పతకం దక్కకపోయినా ఆమె ఘనతను అవి తగ్గించలేవు. ఒలింపిక్స్‌లో ఐదో స్థానం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. ఏథెన్స్‌లో ఆమె 6.83 మీటర్ల జంప్ ఇప్పటికీ భారత లాంగ్ జంప్‌లో అత్యుత్తమ రికార్డుగానే నమోదై ఉంది.
కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు కూడా అందుకుంది. ప్రస్తుతం అంజూ, బాబీ జార్జ్ కలసి బెంగళూరులో అథ్లెటిక్స్ అకాడమీని నిర్వహిస్తూ భవిష్యత్తు స్టార్లను తయారు చేస్తున్నారు.
చదవండి: ఒక్కోసారి అలా జరుగుతుంది.. బాధపడాల్సిన అవసరం లేదు.. వాళ్లిద్దరి వల్లే ఇలా: మార్కరమ్
Comments
Please login to add a commentAdd a comment