‘ఖేలో ఇండియా’ సభ్యులుగా గోపీచంద్, అంజూ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతక విజేత అంజూ బాబీ జార్జిలను ‘ఖేలో ఇండియా’లో సభ్యులుగా నియమించారు. దేశంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. గోపీ, అంజూ రూపంలో ఇద్దరు క్రీడాకారులకు చోటు లభించింది. హైదరాబాద్‌కు చెందిన గోపీచంద్ 2006 నుంచి జాతీయ కోచ్‌గా పని చేస్తున్నారు.
ఆయన శిక్షణలోనే సైనా, సింధు, శ్రీకాంత్‌లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. మరోవైపు లాంగ్ జంపర్‌గా అసాధారణ విజయాలు సాధించిన అంజూ... ఇటీవల కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రీడా మంత్రి ఈపీ జయరాజన్ అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా మొత్తం 13 మంది సభ్యులు తమ రాజీనామాలు సమర్పించారు.