సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో అత్యధికంగా మత్స్యకార కుటుంబాలే నివశిస్తుంటాయి. ఆ గ్రామంలో దాదాపు 19 వేల జనాభా ఉంది. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామంలో ఉండే 18 వార్డు సభ్యులతో పాటు సర్పంచి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఎవరెన్ని చెప్పి చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా, ఈ ఊళ్లో వారి పప్పులు ఉడకలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వివిధ రూపాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదని మొన్నటి స్థానికసంస్థల ఎన్నికల్లో తేటతెల్లమైంది.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పట్టింది. పదివేలకుపైగా జనాభా ఉండే 11 పెద్ద గ్రామాల్లో సైతం ప్రజలు ఒకే పక్షా న ఉంటూ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మొ త్తం వార్డు సభ్యులతోపాటు సర్పంచిని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 13,095 పంచాయతీల్లో సర్పంచుల పదవులతోపాటు దాదాపు 1.31 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే.. అందులో 2,199 సర్పంచి పదవులకు, 48,022 వార్డు సభ్యులకు ఏకగ్రీవం గా ఎన్నికలు జరిగాయి. అయితే 2001 గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీ వంగా ఎన్నికలు ముగిశాయి. బీసీల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే ఎక్కువశాతం పదవులు ఏకగ్రీవమయ్యాయి.
రెండు వేల లోపు జనాభా ఉండే గ్రామాల్లో అత్యధికం
రెండు వేలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో అత్యధికంగా సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా జిల్లాల వారీగా వివరాలను సేకరించి ఒక నివేదికను సిద్ధం చేసింది. రెండు వేలు, అంతకు తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో 1,401 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment