
సాక్షి, విజయవాడ: ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, లోధా కమిటీ సూచనలకు అనుగుణంగా ఏసీఏ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కాగా... ప్రత్యర్థులు లేకపోవడంతో ఆరు పదవులకు కూడా ఏకగ్రీవ ఎంపిక జరిగింది. ఈ వివరాలను సోమవారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిగా పి.శరత్ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వీవీఎస్‌ఎస్‌కేకే యాచేంద్ర, కార్యదర్శిగా వి.దుర్గాప్రసాద్‌లకు అవకాశం దక్కింది.
సంయుక్త కార్యదర్శిగా కేఎస్ రామచంద్ర రావు, కోశాధికారిగా ఎస్.గోపీనాథ్ రెడ్డి బాధ్యతలు చేపడతారు. కౌన్సిలర్‌గా ఆర్.ధనంజయ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ ఆరుగురితో పాటు బీసీసీఐ నామినేట్ చేసే ఇద్దరు మాజీ ఆంధ్ర ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు (ఒక పురుషుడు, ఒక మహిళ), ఏపీ ఆడిటర్ జనరల్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి కూడా అపెక్స్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. కొత్త సభ్యుల పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది.