బీసీసీఐ, లోధా ప్యానెల్ కేసు విచారణ 9కి వాయిదా
ఆ రోజే తుది తీర్పు
న్యూఢిల్లీ: లోధా కమిటీ ప్రతిపాదనలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అమలు చేసే వ్యవహారంపై సుప్రీం కోర్టు తమ తుది తీర్పును ఈనెల 9కి వాయిదా వేసింది. విచారణ బెంచ్‌లో ఉన్న ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అస్వస్థత కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరిసారిగా ఈ కేసును అక్టోబర్ 21న విచారించిన కోర్టు సోమవారం తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. ప్రతిపాదనల అమలు విషయంలో బీసీసీఐకి, లోధా ప్యానెల్‌కు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. 70 ఏళ్ల గరిష్ట వయస్సు, రెండు పదవుల మధ్య మూడేళ్ల విరామం, ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి అంశాలను బోర్డు గట్టిగా వ్యతిరేకిస్తోంది.
మరోవైపు ప్యానెల్ సూచించిన అంశాలను కచ్చితంగా అమలు పరచాల్సిందేనని కోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. అయితే తాత్సారం చేస్తున్న బోర్డు వ్యవహారంపై ప్యానెల్ ఇటీవల మరో నివేదికను కోర్టుకు అందించారు. దీంట్లో ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్లను తొలగించి, బోర్డు వ్యవహారాల పరిశీలకుడిగా హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలని కోరింది. అయితే నూతన సంస్కరణలను అమలు చేయాలని తమ రాష్ట్ర సంఘాలపై ఒత్తిడి చేయలేమని, మెజారిటీ ఓటింగ్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెబుతున్నారు.