సుప్రీం తీర్పు కాపీ చూసిన తరువాతే..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఫైనాన్స్ అకౌంట్లను పరిశీలించేందుకు లోధా కమిటీ ఒక ఆడిటరన్ ను నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సుప్రీం తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని ఆయన తెలిపారు.
'ఒకసారి సుప్రీం తీర్పు కాపీని చూసిన తరువాత ఏమైనా మాట్లాడటానికి అవకాశం ఉంది. మాకున్న కష్టసాధ్యమైన అంశాలను కోర్టుకు సూచించాం. మా ఆర్థిక వ్యవహారాలను అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా లోధా కమిటీ ఒక ఆడిటర్ ను నియమించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అది క్రికెట్ పై ఎంత ప్రభావం చూపుతుంది అనేది పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అయితే కాపీ తీర్పును పూర్తిగా చదివిన తరువాత మాట్లాడతా' అని అనురాగ్ తెలిపారు.
లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లోధా కమిటీ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపేవరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నిధులు జారీ చేయకూడదని బీసీసీఐకి సూచించింది. ఆ క్రమంలోనే లోధా ప్యానల్ ప్రతిపాదనలను అమలు చేస్తామంటూ రాష్ట్ర సంఘాలు అఫిడవిట్ను దాఖలు చేయాలంటూ ఆదేశించింది. దానిలో భాగంగా బీసీసీఐ అకౌంట్లను పరిశీలించేందుకు లోధా కమిటీ స్వతంత్ర ఆడిటర్ను నియమించుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.