లోధా సంస్కరణలతో గందరగోళమే
లోధా సంస్కరణలతో గందరగోళమే
Published Wed, Dec 7 2016 2:09 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
దేశంలో క్రికెట్ బలహీనపడుతుంది
అంతర్జాతీయ వేదికల్లో పట్టు కోల్పోతాం
సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ప్రక్షాళనకు జస్టిస్ లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ వ్యతిరేక వైఖరిని ఎంతమాత్రం వీడటం లేదు. తమకు వీలు చిక్కినప్పుడల్లా విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉంది. తాజాగా ప్యానెల్ అమలు చేయాలంటున్న సంస్కరణలు భారత క్రికెట్‌కు ఎంతమాత్రం మేలు చేయవని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. ఇది మొత్తం గందరగోళానికి దారితీస్తుందని సుప్రీం కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల అనంతరం లోధా కమిటీ నుంచి తమకు ఎలాంటి సూచనలు అందడం లేదని ఆయన ఆరోపించారు. ‘కోర్టు సూచనలకు మేం కట్టుబడి ఉంటాం.
అరుుతే ప్యానెల్ నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు, సూచనలు అందడం లేదు. దీంతో మేం ఏ విషయంలోనూ ముందుకెళ్లడం లేదు. ఇది అంతిమంగా భారత క్రికెట్‌కు హాని చేస్తుంది. బీసీసీఐ ప్రతిష్టను కూడా మసకబారుస్తుంది. అంతేకాకుండా బీసీసీఐ పాలనావ్యవహారాల అధికారాన్ని మూడో పార్టీకి ప్యానెల్ బదలాయించలేదు. అసలు హోం శాఖ మాజీ కార్యదర్శికి క్రికెట్‌ను నడపడం ఎలా సాధ్యమవుతుంది? దీన్ని మేం ఎంతమాత్రం అంగీకరించం. నిజానికి లోధా కమిటీ ప్రతిపాదనలు క్రికెట్‌కు మేలు చేసేలా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా క్రికెట్ పరిపాలనను బలహీనపరిచేలా ఉన్నాయి. దీంతో బీసీసీఐ ఓ విఫల సంస్థగా మారి అంతర్జాతీయ వేదికపై తన గళాన్ని వినిపించే శక్తిని కోల్పోతుంది’ అని ఠాకూర్ అందులో పేర్కొన్నారు. ఈ అఫిడవిట్‌ను చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన బెంచ్ గత సోమవారమే విచారించాల్సి ఉండగా శుక్రవారానికి వాయిదా పడింది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాం...
తమ ప్రతిపాదనల అమలులో విఫలమవుతున్నందుకు బోర్డులోని ఆఫీస్ బేరర్లందరినీ తొలగించాలని సుప్రీం కోర్టుకు నవంబర్ 21న తాము సమర్పించిన మూడో నివేదికలో లోధా ప్యానెల్ కోరిన విషయం తెలిసిందే. అరుుతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ తమను తొలగిస్తే కలిగే లాభమేమిటని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ‘ఆయా క్రికెట్ సంఘాల నియమావళికి లోబడి చట్టబద్ధంగా ఎన్నికై న ఆఫీస్ బేరర్లను తొలగించాలనడం శోచనీయం. ఇది ఎంతమాత్రం క్రికెట్‌కు లాభం చేకూర్చదు సరికదా వెంటనే పరిపాలన కుప్పకూలుతుంది. మొత్తం భారత క్రికెట్ గందరగోళంలో పడుతుంది. వివిధ అంతర్జాతీయ వేదికల్లో భారత క్రికెట్‌కు గళమనేదే ఉండదు’ అని చెప్పారు.
రాష్ట్ర సంఘాలు అంగీకరించడం లేదు...
నూతన సంస్కరణలను బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలు చేసేందుకు నిరాకరిస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వీటి కోసం తాము మూడుసార్లు సమావేశమయ్యామని, అన్నిసార్లూ వారు తిరస్కరించారని గుర్తుచేశారు. ‘అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించేందుకు వారితో సమావేశమయ్యాను. ఓటింగ్ ద్వారా వారు కొత్త ప్రతిపాదనలను తిరస్కరించారు’ అని ఆయన అన్నారు.
Advertisement