బీసీసీఐ క్లీన్‌బౌల్డ్... | Lodha panel moves SC seeking removal of BCCI top brass including Anurag Thakur | Sakshi
Sakshi News home page

బీసీసీఐ క్లీన్‌బౌల్డ్...

Published Thu, Sep 29 2016 12:17 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

బీసీసీఐ క్లీన్‌బౌల్డ్... - Sakshi

బీసీసీఐ క్లీన్‌బౌల్డ్...

లోధా కమిటీ సిఫారసులు అమలు చేయనందుకు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
బోర్డు తమ గురించి గొప్పగా ఊహించుకుంటోంది
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలనూ పట్టించుకోరా?
మా మాట వింటే సరి... లేదంటే వినేలా చేస్తాం
చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్య

 
 భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లెక్కలేనితనం దేశ అత్యున్నత న్యాయ స్థానానికే ఆగ్రహం తెప్పించింది. బోర్డును సంస్కరించే దిశగా కొత్తగా చేసిన సూచనలను పట్టించుకోకపోవడంతో పాటు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లో అసహనాన్ని పెంచింది. అసలు మీ గురించి మీరేం అనుకుంటున్నారు అంటూ తీవ్రంగా ప్రశ్నించిన కోర్టు... ఇలాంటి వాటిని ఎలా సరిదిద్దాలో తమకు బాగా తెలుసంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు పరిపాలనలో ప్రక్షాళన గురించి సిఫారసు చేసిన లోధా కమిటీ కూడా బోర్డు అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గాన్ని కూడా వెంటనే తప్పించాలంటూ కోరడం మరో కోణం. మొత్తంగా బీసీసీఐ, సుప్రీంకోర్టు మధ్య వివాదం ముదరడం అనూహ్య పరిణామం.
 
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఇలా అయితే తాము మరో రకంగా తీర్పును అమలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. బోర్డులో పలు సంస్కరణలకు సూచనలు చేస్తూ లోధా కమిటీ సమర్పించిన నివేదికను జులై 18న సుప్రీం ఆమోదించింది. అయితే ఇప్పటి వరకు బోర్డు వీటిని అమలు చేసేందుకు ప్రయత్నించడం లేదని, పైగా ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తుంటే జస్టిస్ ఆర్‌ఎం లోధా మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై స్పందిస్తూ ‘తాము చట్టానికి అతీతులమని బీసీసీఐ భావిస్తోంది.
 
  మా ఆదేశాలు అమలు చేయించేందుకు ఏం చేయాలో మాకు బాగా తెలుసు. తమను తాము గొప్పగా బోర్డు ఊహించుకుంటోంది. మీరు ఇప్పుడైనా మాట వింటే సరి. లేదంటే వినేలా చేయగలం. బోర్డు వ్యవహారశైలి ఘోరంగా ఉంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. బోర్డు ఇలా చేస్తుందని మేం ఊహిస్తూనే ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించమంటూ మరో ఉత్తర్వు ఇవ్వడం కోర్టుకు పెద్ద సమస్య కాదు’ అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
  ఈ అంశంపై సమాధానం ఇచ్చేందుకు బోర్డుకు సుప్రీం మరో వారం రోజులు గడువు ఇస్తూ అక్టోబర్ 6కు కేసును వారుుదా వేసింది. వాస్తవానికి లోధా కమిటీ సిఫారసుల అమల్లో ఉన్న సమస్యల గురించి బీసీసీఐ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసింది. అయితే పలు సాంకేతిక లోపాలను చూపించి సుప్రీం దీనిని పరిశీలనలోకి తీసుకోలేదు. మరోవైపు ఈ నెల 30 (శుక్రవారం)న ప్రత్యేక సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. పరిస్థితి చేరుు దాటిపోతున్న నేపథ్యంలో లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో ఇక్కడే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిని ఆఖరి అవకాశంగా బోర్డు సభ్యులు భావిస్తున్నారు.
 
 అనురాగ్ ఠాకూర్‌ను తప్పించండి...
 ఈ నెల 21న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగింది. సాధారణ అకౌంట్ల ఆమోదం, బడ్జెట్‌లాంటి అంశాలకే ఈ సమావేశాన్ని పరిమితం చేయాలని బోర్డు సీఈ రాహుల్ జోహ్రికి లోధా కమిటీ సూచించింది. అరుుతే దీనిని పట్టించుకోని బోర్డు ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఎంపికతో పాటు కార్యదర్శిగా అజయ్ షిర్కే నియామకాన్ని కూడా ఖరారు చేసింది. ఈ సమావేశం అజెండాలో చేర్చిన దాదాపు అన్ని అంశాలు తమ సిఫారసులకు వ్యతిరేకంగా ఉన్నాయని కమిటీ భావించింది.  దాంతో తాజా పరిస్థితిపై ఒక నివేదికను కమిటీ సుప్రీం కోర్టు ముందుంచింది. తమ ప్రతిపాదనలను బోర్డు అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఇందులో ప్రస్తావించింది.
 
 తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ అంశాలను సుప్రీం దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పింది. ‘మాకు పూర్తిగా సహకరిస్తామని గతంలో బీసీసీఐ చాలా సార్లు చెప్పింది. కానీ ఇటీవలి పరిణామాలు చూస్తే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. సుప్రీం ఆదేశాలను బోర్డు ఆఫీస్ బేరర్లు ఉల్లంఘిస్తున్నారు. కొన్ని అంశాలను అమల్లోకి తెచ్చేందుకు ఏడు వేర్వేరు గడువులను విధించాం. కానీ అందులో మొదటిదైన సెప్టెంబర్ 30లోగా ఏదీ అమలయ్యేలా కనిపించడం లేదు. తగిన అర్హతలు లేకుండానే షిర్కే కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జులై 18న తర్వాత బోర్డు తీసుకున్న అన్ని నిర్ణయాలు నిలిపేయాలని కోరుతున్నాం. అదే విధంగా ప్రస్తుత బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సహా ఇతర కమిటీ సభ్యులను కూడా వెంటనే తప్పించి కొత్తగా మరో ప్యానెల్‌కు బాధ్యతలు అప్పగించాలి.
 
 అప్పుడే సిఫారసుల అమలు సాధ్యమవుతుంది’ అని జస్టిస్ లోధా తమ నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా ఠాకూర్ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ‘మాతో చర్చించేందుకు ఎన్ని సార్లు సమాచారం ఇచ్చినా కనీసం ఒక్కసారి కూడా ఆయన స్పందించలేదు. పైగా కోర్టు ఉత్తర్వులను తక్కువ చేసి చూపి అనేక అభ్యంతరకర మాటలు వాడారు. ఎన్నడూ క్రికెట్ ఆడని వారు బోర్డును నడిపించాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మాకు వ్యతిరేకంగా లేఖ రాయాలంటూ ఐసీసీని కూడా కోరారు’ అని లోధా తమ అసంతృప్తిని ప్రదర్శించారు.
 
 ఖోడా, పరాంజపే అవుట్!
 తాజా పరిణామాల నేపథ్యంలో మొదటి చర్యగా సెలక్షన్ కమిటీని ఐదుగురు నుంచి ముగ్గురికి పరిమితం చేయాలని బోర్డు భావి స్తున్నట్లు సమాచారం. లోధా సిఫారసులలో ఇది కూడా ఉంది. పైగా కచ్చితంగా టెస్టు ఆడి ఉండాలనే నిబంధన కూడా ఉంది. దీని ప్రకారం ప్రస్తుత సెలక్షన్ కమిటీ సభ్యులైన గగన్ ఖోడా, జతిన్ పరాంజపే భారత్‌కు వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి వీరిద్దరిని తప్పించే అవకాశం ఉంది. ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్‌లు మాత్రం కొనసాగుతారు. అయితే ‘ప్రతిభాన్వేషణ’ పేరుతో దేశవాళీ మ్యాచ్‌లు చూసే విధంగా సెలక్టర్లకు సహా యకారిగా ఉండేందుకు మరో హోదాతో ఖోడా, పరాంజపేలను ఎంపిక చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement