సుప్రీం కోర్టుకు ఠాకూర్ క్షమాపణ
న్యూఢిల్లీ: అసత్య ప్రమాణం కేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సుప్రీం కోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తాను కోర్టుకు ఎలాంటి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ‘కోర్టుకు నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. అలాగే మరో అఫిడవిట్‌లో వాస్తవ పరిస్థితులను వివరించడం జరిగింది. తప్పుడు సమాచారం ఇవ్వడం నా ఉద్దేశం కాదు’ అని జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన బెంచ్‌కు ఠాకూర్ తరఫున సీనియర్ లాయర్ పీఎస్ పట్వాలియా తెలిపారు. ఈకేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అయితే ఈ విచారణకు అనురాగ్ ఠాకూర్ వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిచ్చింది. బోర్డు ప్రక్షాళన కోసం జస్టిస్ ఆర్‌ఎం లోధా సూచించిన ప్రతిపాదనల అమలులో నిర్లక్ష్యం వహించినందుకు జనవరి 2న బోర్డు అధ్యక్షుడిగా ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలిగించిన విషయం తెలిసిందే.
అలాగే ఈ సంస్కరణల అమలును అడ్డుకునేందుకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఐసీసీకి ఠాకూర్ లేఖ రాశారు. అయితే అలాంటిదేమీ జరగలేదని తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందని, క్షమాపణ చెప్పని పక్షంలో జైలుకెళ్లాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు రాష్ట్ర క్రికెట్ సంఘాలతో సమావేశం జరిగేందుకు అనుమతివ్వాలని బీసీసీఐ తరఫున హాజరైన న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే లోధా సంస్కరణలు అమలు చేసేదాకా ఇలాంటివి జరిగేందుకు అంగీకరించవద్దని పరిపాలనా కమిటీ (సీఓఏ) తరఫు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టును కోరారు.