ప్రక్షాళన మొదలైంది
బీసీసీఐ ఢిల్లీ, పుణే కార్యాలయాల మూసివేత
ఠాకూర్ నియామకాలపై కొరడా
టీమిండియా మీడియా మేనేజర్ నిషాంత్ రాజీనామా
కార్యరంగంలోకి దిగిన సీఓఏ
న్యూఢిల్లీ: బీసీసీఐ వ్యవహారాల పర్యవేక్షణ కోసం సుప్రీం కోర్టు నియమించిన నూతన పరిపాలక కమిటీ (సీఓఏ) కార్యాచరణకు దిగింది. బోర్డు ప్రక్షాళనలో భాగంగా ఢిల్లీ, పుణేలో ఉన్న అధ్యక్ష, కార్యదర్శుల కార్యాలయాలను మూసేయాల్సిందిగా ఆదేశించింది. వీటిని మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, మాజీ కార్యదర్శి అజయ్ షిర్కే ఉపయోగించేవారు. దీంతో అక్కడున్న సిబ్బందిపై కూడా వేటు వేయాలని నిర్ణయించింది. జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనల అమలులో నిర్లక్ష్యం వహించినందుకు అనురాగ్ ఠాకూర్, షిర్కేలపై సుప్రీం కోర్టు వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా వారు ఉపయోగించుకున్న ఆఫీస్‌లపై వినోద్ రాయ్ నేతృత్వంలోని కమిటీ దృష్టి సారించింది. గత నెల 30న అత్యున్నత న్యాయస్థానం నియమించిన అనంతరం ఈ కమిటీ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే. ‘ఇప్పుడు బీసీసీఐకి అధ్యక్షుడు, కార్యదర్శి లేరు. కాబట్టి వారి కార్యాలయాలతో ఉపయోగమేంటి? అలాంటప్పుడు పనిచేయని కార్యాలయాల్లో సిబ్బంది ఉండి ఏం చేస్తారు? అందుకే వెంటనే వాటిని మూసేసి వెళ్లిపోవాల్సిందిగా తెలిపాం. గత బుధవారం మేం తొలిసారిగా సమావేశమైనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కమిటీ సభ్యుల్లో ఒకరైన మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ వివరించారు.
టీమిండియా మేనేజర్ రాజీనామా...
భారత జట్టు మీడియా మేనేజర్ నిషాంత్ అరోరా ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీకి చెందిన బీసీసీఐ ఆఫీస్‌ను మూసేయాల్సిందిగా కమిటీ ఆదేశించడంతో అక్కడి సిబ్బంది అయిన నిషాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన్ని ప్రధాన కార్యాలయం ముంబై నుంచి విధులు నిర్వర్తించే అవకాశం ఇచ్చినా తిరస్కరించారు. తనకు చిన్నపిల్లలున్నారని, ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లి పనిచేయలేనని నిషాంత్ తేల్చి చెప్పారు. 18 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆయన జట్టు తరఫున ఆస్ట్రేలియా, అమెరికా, వెస్టిండీస్‌ల్లో పర్యటించారు. మరోవైపు ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లో వివరాలను నిషాంత్ రహస్యంగా అనురాగ్ ఠాకూర్‌కు చేరవేస్తున్నట్టు కూడా కమిటీ దృష్టికి వచ్చింది.
‘ఢిల్లీలోని అధ్యక్ష కార్యాలయాన్ని మూసేయాలని మాత్రమే మేం చెప్పాం. దీంతో అక్కడి సిబ్బంది కూడా వెళ్లాల్సి ఉంటుంది. అయితే మేం ప్రత్యేకంగా నిషాంత్ పేరును ప్రస్తావించలేదు. ఆయన ఢిల్లీ ఆఫీస్ సిబ్బంది అయితే తప్పుకోవాల్సిందే. కానీ ఒకవేళ మీడియా మేనేజర్ ఒప్పందం స్వతంత్రమైనదైతే బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. నిషాంత్ స్థానంలో మరొకరిని కూడా ఆయనే నియమిస్తారు’ అని డయానా ఎడుల్జీ తెలిపారు.