సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ
అసత్య ప్రమాణం కేసులో భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. బీసీసీఐ సంస్కరణలకు ఉద్దేశించి జస్టిస్ లోధా కమిటీ సమర్పించిన సిఫారసులు అమలు విషయంలో సుప్రీంకోర్టుకు అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పడంతో బీసీసీఐ అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి అజయ్ శిర్కేలపై జనవరి 2న అత్యున్నత న్యాయస్థానం వేటువేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అయితే, విచారణకు వ్యక్తిగత హాజరు విషయంలో ఆయనకు మినహాయింపునిచ్చింది.
బీసీసీఐ ప్రక్షాళనకు ఉద్దేశించి లోధా కమిటీ ఇచ్చిన సిఫారసుల అమలును అడ్డుకుంటున్నారనే ఆరోపణలపై ఠాకూర్‌పై సుప్రీంకోర్టు కోర్టుధిక్కరణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఠాకూర్‌ను, శిర్కేను పదవినుంచి తొలగించడమే కాదు.. వారిపై అబద్ధపు సాక్ష్యం, కోర్టు ధిక్కార కేసులు ఎందుకు మోపకూడదు తెలుపాలంటూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే ఠాకూర్ బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు.