'ఐపీఎల్'పై ఏమి చేయమంటారు?
న్యూఢిల్లీ:లోధా కమిటీ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆలోచనలో పడింది. దానిలో భాగంగా ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులపై తర్జన భర్జనలు పడుతోంది. ఐపీఎల్ ప్రసార హక్కుల్లో భాగంగా ఇటీవల బహిరంగ టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ.. దానిపై ఏమి చేయాలో చెప్పాలంటూ లోధా కమిటీకి లేఖ రాసింది. ఈ మేరకు స్ఫష్టత ఇవ్వమంటూ లోధా కమిటీ బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే లేఖను రాశారు.
' ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులపై తుది నిర్ణయం తీసుకోవాలి. గత మంగళవారం ఐపీఎల్ ప్రసార హక్కులపై వేలానికి ఆహ్వానించి వున్నాం. ఈ లోగా బీసీసీఐ ఫైనాన్స్ వ్యవహారాలను పరిశీలించేందుకు స్వతంత్ర ఆడిటర్ను నియమించుకోవడానికి మీకు సుప్రీం అనుమతి ఇచ్చింది. దీనిపై కొంతవరకూ గందరగోళంలో ఉన్నాం.ఈ అంశంపై స్పష్టత ఇవ్వండి. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ టెండర్లపై ముందుకు వెళ్లమంటారా? లేక నిలిపివేయమంటారా? చెప్పండి' అని షిర్కే లేఖలో కోరారు.
కొన్ని రోజుల క్రితం 2018 ఐపీఎల్ నుంచి వర్తించే విధంగా కొత్త ఒప్పందం కోసంబీసీసీఐ బహిరంగ టెండర్ ప్రక్రియ ద్వారా ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు కోరిన సంగతి తెలిసిందే.2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి 2017 వరకు పదేళ్ల కాలానికి టీవీ హక్కులు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ) వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ ఒప్పందం ముగియనుండటంతో బీసీసీఐ కొత్త ఆఫర్‌కు సిద్ధమైంది.