బీసీసీఐ వర్సెస్ లోధా: సుప్రీం తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో ఆఫీస్ బేరర్లందరినీ తొలగించి బోర్డు పరిశీలకుడిగా హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన లోధా ప్యానెల్ కమిటీ పిటిషన్పై తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. ఈ మేరకు సోమవారం పిటిషన్పై విచారణలో అటు బోర్డుతో పాటు, ఇటు లోధా ప్యానెల్ కూడా తమ వాదనలు వినిపించింది. అయితే దీనిపై తీర్పును సుప్రీం వెలువరించే అవకాశం ఉందని అంతా భావించారు. కాగా, ఇరు పక్షాల వాదనలు విన్న దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పును ఈ నెల 9వ తేదీ వాయిదా వేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అనారోగ్యం కారణంగానే తీర్పును మరికొన్ని రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా 70 ఏళ్ల పైబడిన వారు బోర్డులో ఉండకూడదనే నిబంధన ఒకటైతే, కూలింగ్ ఆఫ్ పిరియడ్పై కూడా బీసీసీఐ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది. దాంతోపాటు ఒక రాష్ట్రానికి ఒక ఓటు అనే సూచనను కూడా బీసీసీఐ అంగీకరించడం లేదు. దాంతో బోర్డులోని ఆఫీస్ బేరర్లు అందర్నీ తొలగించాలని లోధా ప్యానల్ మూడోసారి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. అదే క్రమంలో హోంశాఖ మాజీ కార్యదర్శి జికే పిళ్లైను బోర్డు పరిశీలకుడిగా నియమించాలంటూ లోధా ప్యానల్ కోర్టును కోరింది.