సురవరం సుధాకర్ రెడ్డి
కొల్లాం: సీపీఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి(76) ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం ఇది వరసగా మూడోసారి. కేరళలోని కొల్లాంలో ఆదివారం ముగిసిన పార్టీ 23వ ప్లీనరీ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శితో పాటు 126 మంది సభ్యుల జాతీయ మండలి, 11 మందితో కూడిన సెక్రటేరియట్, 11 మంది సభ్యులుగా గల కంట్రోల్ మిషన్‌ను కూడా ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌కు జాతీయ మండలిలో చోటు దక్కింది.
ఆ తరువాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరెస్సెస్–బీజేపీని ఎదుర్కోవాలంటే లౌకిక, ప్రజాస్వామ్య, లెఫ్ట్ పార్టీల మధ్య ఐక్యత అవసరమని నొక్కి చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరులో కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తామని చెప్పారు. కేరళలో మాత్రం తాము భాగస్వామిగా ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రత్యర్థే అని పేర్కొన్నారు. జాతీయ మండలికి ఎన్నిక కాలేకపోయిన సీనియర్ నాయకుడు, కేరళ మాజీ మంత్రి సి.దివాకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
2012లో తొలిసారి..
తెలంగాణలోని నల్గొండ నియోజక వర్గం నుంచి రెండు సార్లు(1998–99, 2004–09) లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సుధాకర్ రెడ్డి 2012లో తొలిసారి సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ కార్మిక స్థాయీ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరించారు. 1942లో మహబూబ్‌నగర్‌లో జన్మించిన సుధాకర్ రెడ్డి 1967లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment