కేరళ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న దృశ్యం
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన యూఏఈ ఆఫర్‌ను కేంద్రం తిరస్కరించడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేంద్రం రూ.700 కోట్ల యూఏఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో, తాత్కాలిక సహాయం కింద వెనువెంటనే కేరళకు రూ.2600 కోట్లను ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) డిమాండ్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విదేశీ సాయం విషయంలో కేంద్రం తప్పుడు ప్రతిష్టపై నిలబడి ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువగా, కేరళ కోరినంత రూ.2600 కోట్ల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ప్రకటించాలని కోరారు.
ఒక దేశం ప్రకృతి విపత్తు భారీన పడినప్పుడు, ఇతర దేశాలు సహాయం చేయడం సర్వసాధారణమని.. భారత్ కూడా గతంలో ఇలాంటి సమయాల్లో నేపాల్, బంగ్లాదేశ్‌లకు సహకరించిందని పేర్కొన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌కు కూడా భారత్ సాయం చేసిందని చెప్పారు. అలాంటి సమయాల్లో యూఎన్‌ఓ, యూఏఈల ఆఫర్‌లను మనం అంగీకరించవచ్చని.. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ రూ.700 కోట్లను ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని.. దీన్ని మనం అంగీకరించవచ్చని తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాల నుంచే వచ్చే సహాయం విషయంలో.. ముందటి యూపీఏ ప్రభుత్వ పాలసీనే కేంద్రం అనుసరిస్తుందని అనధికారికంగా ఎన్‌డీఏ ప్రభుత్వం చెప్పేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లాంటి చాలా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంది.. మరిదాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కేరళ ప్రభుత్వం అడిగిన మేర సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రూ.20 వేల కోట్ల మొత్తాన్ని కేరళ అడగడం లేదని.. కేవలం రూ.2600 కోట్ల సాయాన్ని మాత్రమే ఆర్థిస్తుందని చెప్పారు. యూఏఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే.. కేరళకు కచ్చితంగా రూ.2600 కోట్లు ఇవ్వాల్సిందేనని.. భారత్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment