ఏకగ్రీవాలకు భారీ నజరానా | A Huge Reward For Unanimous Election | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవాలకు భారీ నజరానా

Published Wed, Jan 27 2021 3:17 AM | Last Updated on Wed, Jan 27 2021 9:10 AM

A Huge Reward For Unanimous Election - Sakshi

సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో గ్రూపులు, ఘర్షణలకు తావు లేకుండా ప్రజలంతా అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవించేలా ఏకగ్రీవాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమైతే ఊరు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి గరిష్టంగా రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకంగా అందనున్నాయి. పచ్చని పల్లెల్లో ఎన్నికలు కక్షలు, కార్పణ్యాలకు కారణం కాకూడదని, గ్రామీణుల సర్వశక్తులు అభివృద్ధికి దోహద పడాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మధ్య విభేదాలు పొడచూపకుండా ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖకు నిర్దేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎన్నికల వల్ల ప్రజలు వర్గాలుగా విడిపోయి గ్రామాభివృద్ధిని ఇబ్బందుల్లోకి నెట్టరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 12వ తేదీన ఈ ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం విదితమే. ఒక గ్రామానికి ఏడాది వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే అన్ని రకాల గ్రాంట్లు, ఇంటి పన్ను రూపంలో వసూలయ్యే డబ్బుల కంటే ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల ద్వారా అధికంగా నిధులు అందనున్నాయి. నిధుల కొరతతో సమస్యల మధ్య కొట్టుమిట్టాడే గ్రామాలు పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ప్రోత్సాహకంగా భారీగా నిధులను పొందే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్ర హయాం నుంచే ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నారు.  
 
ప్రోత్సాహకాలపై విస్త్రత ప్రచారం.. 
పంచాయతీ మొదటి దశ ఎన్నికలకు ఈనెల 29వతేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్లెల్లో శాంతియుత వాతావరణం వెల్లివిరిసేందుకు ఏకగ్రీవ గ్రామాలకు అందచేసే ప్రోత్సాహక నిధుల గురించి సమాచార శాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 మార్చిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించగా అప్పట్లోనే ఏకగ్రీవమయ్యే గ్రామాలకు గరిష్టంగా రూ.20 లక్షలు చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ గతేడాది మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని తాజా ఉత్తర్వులలో సీఎస్‌ గుర్తు చేశారు. కరోనా కారణంగా అప్పుడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకుండా ఎన్నికలు వాయిదా పడడంతో ప్రభుత్వం ప్రకటించిన ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులపై మరోసారి తెలియచేయడం సముచితమని భావిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
గతంలోనూ ఆనవాయితీ... 
73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత ఇప్పటివరకు నాలుగు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఐదోసారి జరగనున్నాయి. 2001 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజన తర్వాత కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రోత్సాహకాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
గుజరాత్, హర్యానా, తెలంగాణలో కూడా.. 
గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలలోనూ ఎన్నికల కారణంగా గ్రామాల్లో వైషమ్యాలు చెలరేగకూడదనే ఉద్దేశంతో ఏకగ్రీవమయ్యే చోట్ల ప్రోత్సాహక నిధులు అందచేస్తున్నారు. గుజరాత్‌లో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే గ్రామాలకు ‘సమ్రాస్‌’ పథకం పేరుతో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రత్యేక పోత్సాహక నిధులను అందజేస్తోంది. తెలంగాణలోనూ రెండేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలల్లో ఈ తరహా ప్రోత్సాహకాలను అందచేశారు. 

ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు 
► 2001 ఎన్నికలలో ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అదే ఏడాది ఆగస్టు 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.  
► 2006లోనూ ఉమ్మడి రాష్ట్రంలో 2,924 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఆయా గ్రామాలకు ప్రోత్సాహక నిధులను విడుదల చేస్తూ 2008 నవంబరు 25వతేదీన అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  
► 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో 13 జిల్లాల పరిధిలో 1,835 గ్రామాలలో ఎన్నికలు ఏకగ్రీవాలు కాగా వాటికి రూ.128.45 కోట్లను 
విడుదల చేస్తూ 2015 ఏప్రిల్‌ 23వ తేదీన అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   
► ఇదే తరహాలో ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవమయ్యే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందజేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్యి 2020 మార్చి 12న ఉత్తర్వులు జారీ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement