అజేయ కల్లం, దినేశ్‌కుమార్‌లను వరుసగా సీఎస్‌లుగా నియమిస్తూ 2017 ఫిబ్రవరి 27న అప్పటి టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి టీడీపీ, దాని అనుకూల మీడియా పచ్చి అబద్ధాలు వల్లిస్తూ బురద చల్లేందుకు ప్రయత్నిస్తుండటంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి సీఎస్‌గా సమీర్‌శర్మ నియమితులైన విషయం తెలిసిందే. అయితే సీఎస్ నియామకంపై 20 రోజులు ముందు జీవో ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదంటూ ఓ దినపత్రిక దుష్ప్రచారం చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఇద్దరు సీఎస్‌లను నియమిస్తూ ఒకే జీవో జారీ చేయడం టీడీపీ అనుకూల మీడియాకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా అజేయ కల్లంను సీఎస్‌గా నియమిస్తూ జారీ చేసిన జీవోలో ఆయన పదవీ కాలం మరో నెల ఉండగానే తదుపరి సీఎస్‌గా దినేశ్‌కుమార్‌ను అందులోనే పేర్కొన్నారు. ఈమేరకు 27–02–2017న జీవో 456 ఇచ్చారు. మరి అప్పుడు సంప్రదాయం, గౌరవం లాంటివి గుర్తు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఒక్క జీవో.. ఇద్దరు సీఎస్‌లు
టీడీపీ హయాంలో సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ కార్యదర్శిగా ఉన్న ఎన్. శ్రీకాంత్ జీవో ఆర్‌టీ 456 జారీ చేశారు. అప్పటి సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ 28–02–2017న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అజేయ కల్లంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. కల్లం 31–03–2017న పదవీ విరమణ చేయనున్నందున 01–04–2017 నుంచి సీఎస్‌గా దినేశ్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు అదే జీవోలో పేర్కొన్నారు. ఓ సీఎస్ నియామకం రోజునే, ఆయన పదవీ విరమణకు ఇంకా నెల సమయం ఉండగానే అదే జీవోలో తదుపరి సీఎస్ దినేశ్‌గా పేర్కొంటూ చంద్రబాబు సర్కారు జీవో ఇచ్చిందని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ విషయాన్ని మభ్యపుచ్చుతూ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారంటూ అసత్య కథనాలు ప్రచురించడం ద్వారా టీడీపీ అనుకూల మీడియా విలువలకు పాతరేసిందని పేర్కొంటున్నాయి. సీఎస్‌గా అజేయ కల్లం నియామక జీవోలోనే పదవీ విరమణ గురించి ప్రస్తావించడంకూడా చంద్రబాబు హయాంలోనే జరిగిందని వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment