
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణాలతో పాటు ప్రతి గ్రామానికీ మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో సోమవారం స్టేట్ బ్రాడ్‌బ్యాండ్ కమిటీ రెండో సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 2022 నాటికి నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కింద ప్రతి గ్రామానికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు దానిని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటీ విధానం కూడా ఇందుకు ఎంతో దోహదపడుతుందని సీఎస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీసర్వే ప్రక్రియలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణకు అటవీ శాఖ క్లియరెన్సులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎస్ చెప్పారు. సమావేశంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌లు రామకృష్ణ, రాఘవేంద్రరావు తదితరులు కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.