
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో మిగతా ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లయింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీకి చెందిన సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన ఈ నెల(మార్చి) 15న వెల్లడించే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్ధిగా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయనకు అనుబంధంగా ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు.
మంగళవారం ప్రశాంతిరెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థుల ఎంపికపై రెండు రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైడ్రామా నడిపించిన విషయం తెలిసిందే. పలువురు ఆశావహులు ఆయనను కలిసినా చివరకు సీఎం రమేశ్, వర్ల రామయ్య, బీద మస్తాన్‌రావుల్లో ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు తొలుత లీకులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పి.. బీద మస్తాన్‌రావును తప్పించి సీఎం రమేశ్, వర్లకు లైన్‌క్లియర్ చేసినట్లు ప్రచారం సాగింది. కానీ, అనూహ్యంగా సీఎం రమేష్‌ను ఖరారు చేసి వర్లను తప్పించి రెండో అభ్యర్థిగా న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ పేరును తెరపైకి తెచ్చి వారిద్దరితో నామినేషన్ వేయించారు.
Comments
Please login to add a commentAdd a comment