Kanakamedala Ravindra Kumar
-
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడలకు షాక్.. ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ బ్రేక్
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ బ్రేక్ వేశారు. షెడ్యూల్ ట్రైబ్స్ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏపీ విషయాలను జోడించి కనకమేడల అసందర్భంగా మాట్లాడారు. కనకమేడల ప్రసంగంపై ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కనకమేడల ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగిస్తామని డిప్యూటీ ఛైర్మన్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను రాబట్టే విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం విఫలమైందని చూపేందుకు గతంలో కూడా ప్రతిపక్ష టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. 2019 నుంచి రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివరాలు చెప్పాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సోమ్ ప్రకాష్‌ను రాజ్య సభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, ఇంకా చెప్పాలంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ‘ఆల్ టైమ్ రికార్డ్’ స్థాయిలో పెరిగాయని చెప్పారు. చదవండి: ‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’ -
సీఎం జగన్ పాలనలో సరికొత్త రికార్డ్‌లు.. టీడీపీకి షాకిచ్చిన రిపోర్ట్!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాబట్టే విషయంలోనూ వేగంగా ముందుకు సాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. ఆర్ధిక సంవత్సరం 2022-2023 నాటికి అత్యధికంగా 284.22 మిలియన్ డాలర్లను రాష్ట్రం రాబట్టినట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్య సభలో మాట్లాడుతూ.. 2019 నుంచి రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివరాలు చెప్పాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సోమ్ ప్రకాష్‌ను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను రాబట్టే విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం విఫలమైందని చూపేందుకు ప్రతిపక్ష టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మే 2019 నుంచి రాష్ట్రంలో ఎఫ్‌డీఐ ప్రవాహం భారీగా తగ్గిపోయిందని, ఫలితంగా ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాలు పడిపోయాయని ప్రభుత్వానికి తెలుసా? తెలియదా? అంటూ టీడీపీ ప్రశ్నించింది. కనకమేడల ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, ఇంకా చెప్పాలంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ‘ఆల్ టైమ్ రికార్డ్’ స్థాయిలో పెరిగాయని చెప్పారు. మహమ్మారి కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు తాత్కాలికంగా తగ్గాయని’ రాత పూర్వకంగా పేర్కొన్నారు. అక్టోబర్ 2019 నుండి మార్చి 2023 వరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన విదేశీ పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నట్లు తెలిపారు. 2019-20 (అక్టోబర్ 2019-2020)లో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐ పెట్టుబడులు 200.97 మిలియన్లు. మహమ్మారి కారణంగా 2020-21లో ఇది 85.85 మిలియన్లకు తగ్గింది. కానీ 2021-22లో 224.96 మిలియన్లకు, 2022-23లో 284.22 మిలియన్లకు పెరిగింది’అని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ స్పష్టం చేశారు. -
‘ఏపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదు’
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఎలాంటి సందర్భాలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. స్పిల్‌వే, అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, కాంక్రీట్ డ్యామ్ (గ్యాప్–3), డయాఫ్రమ్ వాల్ ఆఫ్ ఎర్త్ కమ్ రాక్–ఫిల్ డ్యామ్–ఈసీఆర్ఎఫ్ (గ్యాప్–3) వంటి అనేక కీలక నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ఈ ఏడాది జూన్ వరకు హెడ్ వర్క్స్ 77%, ఎడమ మెయిన్ కెనాల్ 72%, కుడి మెయిన్ కెనాల్ 93% పనులు పూర్తయ్యాయని అన్నారు. కాగా, పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. షెడ్యూల్ కంటే ముందుగానే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. -
టీడీపీ విషప్రచారం.. తిప్పికొట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ విషప్రచారాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి బలంగా తిప్పికొట్టారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అవాస్తవాలను వల్లేవేశారు. సినిమా టికెట్లు సహా పలు అంశాలపై తప్పుడు ప్రచారం చేయడానికి కనకమేడల ప్రయత్నించారు. దీనిపై స్పందించిన వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుండా టీడీపీ పాలన కంటే వైఎస్సార్సీపీ పాలన వెయ్యిరెట్లు గొప్పగా ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబర్చడం సరికాదని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్సీపీపై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి.. 7 సార్లు ప్రధాని మోదీని, 12 సార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. -
కనకమేడలపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి సోమవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 4న రాజ్యసభలో చర్చ సందర్భంగా కనకమేడల చేసిన ప్రసంగం సభ నియమ, నిబంధనలకు ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కనకమేడల ప్రసంగంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ శాసన సభ కార్యకలాపాల గురించి, అత్యున్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల గురించి కనకమేడల చేసిన వ్యాఖ్యలు అత్యంత హానికరమైనవి. సభలో చర్చ జరిగే అంశం నుంచి పక్కకు మళ్లుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసన వ్యవస్థల కార్యకలాపాలపైన, వ్యక్తులపైన కనకమేడల చేసిన అసహ్యమైన వ్యాఖ్యలు రాజ్యసభ రూల్ 238 (3), రూల్ 238 (5) ఉల్లంఘన అవుతుంది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విద్వేషపూరిత రాజకీయాల్లో భాగంగానే కనకమేడల ప్రసంగాన్ని పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల టీడీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో మత ఘర్షణలు జరుగుతున్నట్టు చెప్పారని, ఇందుకు సాక్ష్యంగా 2016–17 కాలం నాటి ఒక వీడియో క్లిప్‌ను ఆయనకు చూపి కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి చెందిన వీడియో క్లిప్ వాస్తవానికి 2016–17 మధ్య నాటిదని, అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న వాస్తవాన్ని టీడీపీ ఎంపీలు హోం మంత్రి వద్ద దాచిపెట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. కనకమేడల ప్రసంగంలోని విద్వేషపూరిత వ్యాఖ్యలు ఏ రూల్ ప్రకారం సభా నియమాలకు విరుద్ధమో వివరిస్తూ ఒక జాబితాను ఫిర్యాదుకు జత చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన విజయసాయిరెడ్డి అంతకుముందు రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికి ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ‘ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగినప్పుడు టీడీపీ ఎంపీ ప్రస్తావించిన అంశాలు అభ్యంతరకరం. వాటిని ఈ సభలో ప్రస్తావించాల్సి ఉండకూడదు. మీరు వాటిని అనుమతించారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలి’ అని కోరారు. అభ్యంతరాలను పరిశీలిస్తానని చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశాలతో ఈ సభకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి వివరించబోగా.. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి మెరిట్స్‌లోకి వెళ్లొద్దని, అభ్యంతరాలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తానని చైర్మన్ పేర్కొన్నారు. తిరిగి జీరో అవర్ పూర్తయ్యాక ప్రత్యేక ప్రస్తావనలు ప్రారంభించే సమయంలో కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు లేచి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ఎవరైనా సభ్యుడు అభ్యంతరకరంగా మాట్లాడితే తన దృష్టికి తీసుకురావాలని, కానీ అలా చేయకుండా తనపై ఆరోపణలు చేశారని, ఇది చైర్మన్ తన విధులను నిర్వర్తించకుండా చేయడమేనని అన్నారు. -
వెంకయ్యనాయుడికి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ..
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ఆయన సోమవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 4న రాజ్యసభలో జరుగుతున్న చర్చలో మాట్లాడుతూ కనకమేడల చేసిన ప్రసంగం సభ నియమ నిబంధనలకు ఉల్లంఘన అవుతుందన్నారు. ఆయన తన ప్రసంగంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించకపోవడం అత్యంత దురదృష్టకరమని తన ఫిర్యాదులో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల గురించి, అత్యున్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల గురించి కనకమేడల చేసిన వ్యాఖ్యలు అత్యంత హానికరమైనవి. సభలో చర్చ జరిగే అంశం నుంచి పక్కకు మళ్ళుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసన వ్యవస్థల కార్యకలాపాలపైన, వ్యక్తులపైన కనకమేడల చేసిన అసహ్యమైన వ్యాఖ్యలు రాజ్యసభ రూల్ 238 (3), రూల్ 238 (5) ఉల్లంఘన అవుతుందని విజయసాయి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విద్వేష పూరిత రాజకీయాలలో భాగంగానే కనకమేడల ప్రసంగాన్ని పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల టీడీపీకి చెందిన ఎంపీలు.. కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్రంలో మత సంఘర్షణలు జరుగుతున్నాయని ఇందుకు సాక్ష్యంగా 2016-17 మధ్య నాటి ఒక వీడియో క్లిప్‌ను ఆయనకు చూపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ఆయన వీడియో క్లిప్ వాస్తవానికి 2016-17 మధ్య నాటిది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న వాస్తవాన్ని టీడీపీ ఎంపీలు.. హోం మంత్రి వద్ద దాచిపెట్టారని తెలిపారు. ఎంపీ కనకనమేడలపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవలసిందిగా విజయసాయిరెడ్డి ఫిర్యాదు లేఖలో కోరారు. దీనికి సంబంధించి కనకనమేడల తన ప్రసంగంలో చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు ఏ రూల్ ప్రకారం సభా నియమాలకు విరుద్దమో వివరిస్తూ ఒక జాబితాను లేఖకు జత చేస్తున్నట్లు తెలిపారు. వీటిని పరిశీలించి ఆ సభ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో విజయసాయి రెడ్డి.. రాజ్యసభ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. (చదవండి: మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..) (బాబ్బాబూ.. పోటీలో ఉండండి చాలు..) -
ఎన్నికల వేళ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరు విస్తుగొల్పుతోంది. తమ పార్టీ నాయకులపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టిన ధర్నాకు జనం పెద్దగా రాకపోవడంతో మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత సీనియర్‌నని చెప్పుకునే ఆయన ఎన్నికల ప్రశాంతతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రమంతా అట్టుడికి పోవాలంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏమరుపాటుగా ఉంటే ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అంతేకాకుండా అధికారులపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోవద్దని, తిరగబడాలని చంద్రబాబు అన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని మేధావులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. అధినేత పిలుపుకు స్పందించి తెలుగు తమ్ముళ్లు ఎటువంటి ఆందోళనలకు దిగుతారోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి నిరసనలకు పిలుపు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. కనకమేడల సుద్ధులు ఆదాపపన్ను శాఖ సోదాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తనదైన శైలిలో స్పందించారు. ‘ఎన్నికల సంఘానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇన్‌టాంక్స్ అధికారులందరినీ బోనులో నిలబెట్టి అసలు ఎందుకు దాడులు చేస్తున్నారని నిలదీయాల’ని అన్నారు. ఎవరి ఆదేశాలతో సీఎం రమేశ్ ఇంటిపై దాడులు చేశారని ప్రశ్నించారు. పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటీ అధికారులను సీఎం రమేశ్ అడ్డుకోవడాన్ని ఆయన సమర్థించారు. -
సచివాలయంలో టీడీపీ ఎంపీకి చేదు అనుభవం
సాక్షి, అమరావతి : అధికార పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు ఏపీ సచివాలయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. పబ్లిసిటీ సెల్లో మీడియా సమావేశం నిర్వహించాలనుకున్న కనకమేడలకు ఐ అండ్ పీఆర్ అధికారులు అనుమతి నిరాకరించారు. కేవలం మంత్రులు, విప్ల మీడియా సమావేశాల నిర్వహణకు మాత్రమే సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌ని అనుమతిస్తారని అధికారులు తెలిపారు. పబ్లిసిటీ సెల్లో మీడియా సమావేశానికి అనుమతి నిరాకరించడంతో ఫోర్త్ బ్లాక్ బయట మీడియా సమావేశాన్ని నిర్వహించారు కనకమేడల. -
ఎంపీ కనకమేడలకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఏపీ టీడీపీ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను బుధవారం హైకోర్టు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఇరు సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
-
ఏపీ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో మిగతా ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీకి చెందిన సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన ఈ నెల(మార్చి) 15న వెల్లడించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్ధిగా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయనకు అనుబంధంగా ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ప్రశాంతిరెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థుల ఎంపికపై రెండు రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైడ్రామా నడిపించిన విషయం తెలిసిందే. పలువురు ఆశావహులు ఆయనను కలిసినా చివరకు సీఎం రమేశ్, వర్ల రామయ్య, బీద మస్తాన్‌రావుల్లో ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు తొలుత లీకులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పి.. బీద మస్తాన్‌రావును తప్పించి సీఎం రమేశ్, వర్లకు లైన్‌క్లియర్ చేసినట్లు ప్రచారం సాగింది. కానీ, అనూహ్యంగా సీఎం రమేష్‌ను ఖరారు చేసి వర్లను తప్పించి రెండో అభ్యర్థిగా న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ పేరును తెరపైకి తెచ్చి వారిద్దరితో నామినేషన్ వేయించారు. -
అందుకే కనకమేడలకు టికెట్: చంద్రబాబు
సాక్షి, అమరావతి : నాటకీయ పరిణామాల మధ్య వెల్లడైన టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లపై ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పలువురు ఆశావాహులతో వరుస భేటీలు నిర్వహించి, చివరి క్షణంలో కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేశ్‌ల పేర్లనే ఎందుకు ఖరారు చేశామో వివరించారు. సోమవారం అసెంబ్లీలో సీఎం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘పార్లమెంట్లో అన్ని పార్టీలకూ అడ్వకేట్లు ఎంపీలుగా ఉన్నారు. ఒక్క టీడీపీకి మాత్రమే ఇంతవరకు లేరు. అందుకే రాజ్యసభకు కనకమేడల రవీంద్రకుమార్ పేరును ఖరారు చేశాం. గడిచిన 20 ఏళ్లుగా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీకి సంబంధించిన అన్ని కేసులను ఆయనే చూస్తారు. నిజానికి గతంలోనే రవీంద్రకుమార్‌కు ఎమ్మెల్సీ ఇద్దామనుకున్నాం. కానీ అనివార్య కారణాలవల్ల కుదరలేదు. చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టికెట్ ఇచ్చాం’’ అని చంద్రబాబు వివరించారు. హైడ్రామా : అభ్యర్థుల ఎంపికపై శని, ఆదివారాల్లో చంద్రబాబు హైడ్రామా నడిపించారు. శనివారం ఆశావహులందరినీ కలిశారు. చివరకు సీఎం రమేశ్, వర్ల రామయ్య, బీద మస్తాన్‌రావుల్లో ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు లీకులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పి.. బీద మస్తాన్‌రావును ఆదివారం రేసు నుంచి తప్పించారు. దీంతో వర్ల తనకు అవకాశమిచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ పలు చానళ్లతో మాట్లాడారు. సీఎం రమేశ్‌కు రెండోసారి అవకాశం ఇచ్చేందుకు మొదట్లో సుముఖత వ్యక్తం చేయకపోయినా.. చివరకు ఖరారు చేశారు. రెండో అభ్యర్థిగా న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ పేరును హఠాత్తుగా తెరపైకి తీసుకొచ్చారు. రవీంద్ర గతంలో టీడీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడిగా.. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు.