సాక్షి, అమరావతి : నాటకీయ పరిణామాల మధ్య వెల్లడైన టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లపై ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పలువురు ఆశావాహులతో వరుస భేటీలు నిర్వహించి, చివరి క్షణంలో కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేశ్‌ల పేర్లనే ఎందుకు ఖరారు చేశామో వివరించారు. సోమవారం అసెంబ్లీలో సీఎం మీడియాతో చిట్‌చాట్ చేశారు.
‘‘పార్లమెంట్‌లో అన్ని పార్టీలకూ అడ్వకేట్లు ఎంపీలుగా ఉన్నారు. ఒక్క టీడీపీకి మాత్రమే ఇంతవరకు లేరు. అందుకే రాజ్యసభకు కనకమేడల రవీంద్రకుమార్ పేరును ఖరారు చేశాం. గడిచిన 20 ఏళ్లుగా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీకి సంబంధించిన అన్ని కేసులను ఆయనే చూస్తారు. నిజానికి గతంలోనే రవీంద్రకుమార్‌కు ఎమ్మెల్సీ ఇద్దామనుకున్నాం. కానీ అనివార్య కారణాలవల్ల కుదరలేదు. చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టికెట్ ఇచ్చాం’’ అని చంద్రబాబు వివరించారు.
హైడ్రామా : అభ్యర్థుల ఎంపికపై శని, ఆదివారాల్లో చంద్రబాబు హైడ్రామా నడిపించారు. శనివారం ఆశావహులందరినీ కలిశారు. చివరకు సీఎం రమేశ్, వర్ల రామయ్య, బీద మస్తాన్‌రావుల్లో ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు లీకులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పి.. బీద మస్తాన్‌రావును ఆదివారం రేసు నుంచి తప్పించారు. దీంతో వర్ల తనకు అవకాశమిచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ పలు చానళ్లతో మాట్లాడారు. సీఎం రమేశ్‌కు రెండోసారి అవకాశం ఇచ్చేందుకు మొదట్లో సుముఖత వ్యక్తం చేయకపోయినా.. చివరకు ఖరారు చేశారు. రెండో అభ్యర్థిగా న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ పేరును హఠాత్తుగా తెరపైకి తీసుకొచ్చారు. రవీంద్ర గతంలో టీడీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడిగా.. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment