నాలుగోమాట లేదు
రాజ్యసభకు నాలుగో అభ్యర్థిపై టీడీపీ వెనుకంజ
- ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే కష్టాలు
- దానిపై ఎవరైనా కోర్టుకు వెళితే వారిపై అనర్హత వేటు భయం
- ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే గెలవలేమనే ఆందోళన
- విజయవాడ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్: బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల బరిలో నాలుగో అభ్యర్థిని దించేందుకు సిద్ధమైన టీడీపీ ఆఖరు నిమిషంలో వెనకడుగు వేసింది. నాలుగో అభ్యర్థిపై బీజేపీ విముఖత, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడితే మళ్లీ గెలవలేమనే భయం, రాజ్యసభ ఎన్నికలను విజయవాడకు మార్చాలని కోరినా ఈసీ అంగీకరించకపోవడం, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ సీనియర్ నేతల అసంతృప్తి, ఓటుకు కోట్లు వ్యవహారంలోలా దొరికిపోతామనే భయం... అన్నిటికీ మించి ఎన్నికోట్లు వెదజల్లినా వైఎస్సార్‌సీపీ నుంచి ముగ్గురు లేదా నలుగురు కంటే ఎక్కువమంది పార్టీ మారే అవకాశం కనిపించకపోవడంతో అధికారపార్టీ వెనుకంజ వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవడం ఆత్మహత్యా సదృశమని, ఫలితంలో తేడా వస్తే జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు కావాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు చివరి నిమిషంలో ప్రయత్నాలను విరమించుకున్నారని తెలుస్తోంది.
అనర్హత వేటు భయం...
రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తారు. ఓటింగ్ జరిగిన పక్షంలో ప్రతి ఎమ్మెల్యే తాను ఏ పార్టీకి ఓటు వేసింది తప్పకుండా ఆయా పార్టీల ఎన్నికల ఏజెంట్‌కు చూపించాల్సి ఉంటుంది. అప్పుడు ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతుంది. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లో ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తొమ్మిది మంది బీజేపీలోకి ఫిరాయించారు. వీరిని ఆ రాష్ర్ట ప్రభుత్వ విశ్వాస పరీక్షలో ఓటు వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకునే సంస్థలు కోర్టును ఆశ్రయిస్తే వీరిని రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనర్హులుగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఉప ఎన్నికల్లో వారు మళ్లీ గెలుస్తారనే ధైర్యం లేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలపై చంద్రబాబు అంచనాలు తల్లకిందులయ్యాయి.
గాలానికి దొరకని ఎమ్మెల్యేలు
రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థి విషయమై పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు తిరుపతి, విజయవాడల్లో గంటల తరబడి మంతనాలు జరిపారు. ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తారో చెప్పండంటూ వారిపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమేనని ప్రతిపాదించారు. రెండేళ్ల పాలనలో సంపాదించిన అవినీతి సొమ్ములో రూ.250 కోట్లు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధం చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, మంత్రులు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు గాలం వేశారు. ఎవరెంత ప్రయత్నించినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలనుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించినా... వారితో రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోవడం సాధ్యం కాదు.
బీజేపీ అల్టిమేటం
రాష్ట్రంనుంచి టీడీపీ తరఫున నాలుగో అభ్యర్థిని బరిలోకి దించే ప్రయత్నాలపై బీజేపీ అధిష్టానం కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నాలుగో అభ్యర్థిపై టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీకి ఓ నివేదిక పంపినట్లు సమాచారం. ఈ నివేదికలో నాలుగో అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించితే ఏపీ నుంచి రాజ్యసభ సీటు తీసుకోవద్దని అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. మూడు సీట్లు గెలుచుకునేందుకే టీడీపీకి సంపూర్ణమైన బలం ఉందని, మరో అభ్యర్థిని బరిలోకి దించితే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం ద్వారా మాత్రమే గెలుచుకుంటారని అందులో పేర్కొన్నారు. కొనుగోలుకు సంప్రదింపులు జరిపే సమయంలో ఓటుకు నోటు కేసు మాదిరిగా అడ్డంగా దొరికితే ఆ పార్టీ ప్రతిష్ట మంట కలిసిపోతుందని, దానితో పాటు కలిసి ఉన్నందున బీజేపీ కూడా అప్రతిష్ట పాలవుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆ నివేదిక పరిశీలించిన తరువాతే బీజేపీ అధిష్టానం చంద్రబాబుతో ఈ అంశంపై చర్చించి నాలుగో అభ్యర్థిని బరిలోకి దించితే తమకు సీటు వద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. బీజేపీ దాదాపు అల్టిమేటం ఇవ్వటంతో బాబు వెనుకంజ వేశారు.
ఓటుకు కోట్లులా దొరికిపోతామనే
ఏపీలో సంపాదించిన అవినీతి సొమ్ముతో గత ఏడాది తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బు చెల్లిస్తూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంలో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన మాటలు టీవీల్లో ప్రసారం కావడంతో టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. చంద్రబాబు నిజస్వరూపమేమిటో బట్టబయలైంది. జాతీయ స్థాయిలో టీడీపీ, చంద్రబాబు అప్రతిష్టపాలయ్యారు. ఇప్పుడు బలంలేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయక తప్పదు. ఆ ప్రయత్నంలో మరోసారి దొరికిపోతే పార్టీకి పుట్టగతులుండవని సన్నిహితులు హెచ్చరించటం కూడా బాబు వెనుకంజకు కారణంగా తెలుస్తోంది.
సీనియర్ నేతల్లో అసంతృప్తి
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఇద్దరు వ్యాపార, పారిశ్రామికవేత్తలను ఖరారు చేసింది. చంద్రబాబు టీడీపీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఒకటి, రెండు సందర్భాల్లో మినహా మిగిలిన అన్ని సమయాల్లో వ్యాపార, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లనే రాజ్యసభకు పంపారు. దీనిపై పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజ్యసభ సభ్యత్వం ఆశించిన పార్టీ సీనియర్ నేత జేఆర్ పుష్పరాజ్ బహిరంగంగానే తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీలో వ్యాపారవేత్తలకే పెద్ద పీట వేస్తున్నారని, పార్టీకి సేవ చేసిన బడుగు బలహీన వర్గాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి పాలనను గాలికి వదిలేశారు.
రెండేళ్లలో సంపాదించిన అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలు వెదజల్లి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ముమ్మరంగా ప్రయత్నించారు. ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించిన 17మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మరికొందరిని తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. మంత్రులను కూడా అందుకు పురమాయించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, స్పీకర్ వ్యవస్థను తమకు అనుకూలంగా వాడుకున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అయినా రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థికి కనీసం నామినేషన్ కూడా వేయించుకోలేకపోయారు. మరోవైపు నాలుగో అభ్యర్థిపై మిత్రపక్షం బీజేపీ అధిష్టానం కూడా అంగీకరించలేదు. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగో అభ్యర్థిపై చంద్రబాబు తోకముడవక తప్పలేదు. వాస్తవాలిలా ఉండగా... తాము బాబుపై ఎంతో ఒత్తిడి తెచ్చినా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఆయన నాలుగో అభ్యర్థిని నిలబెట్టేందుకు అంగీకరించలేదని వైఎస్సార్‌సీపీనుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి చెప్పడం కొసమెరుపు.
ఈసీ నిర్ణయంతో కుదేలు
రాజ్యసభకు నాలుగో అభ్యర్థి విషయంలో చంద్రబాబు మొదట తీవ్రంగా కసరత్తు చేశారు. 17 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తీరులోనే ఒక్కొక్కరికీ రూ.30-50 కోట్ల వరకు అవినీతి సొమ్మును వెదజల్లైనా మరో 15 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నాలుగో అభ్యర్థిని గెలిపించుకోవచ్చునని యోచించారు. బేరసారాలకు వీలుగా రాజ్యసభ ఎన్నికల వేదికను విజయవాడకు మార్పించాలని పన్నాగం పన్నారు. అక్కడైతే తమ అక్రమ చర్యలను అడ్డుకునే వారు ఉండరని, యథేచ్ఛగా కొనుగోళ్లకు పాల్పడవచ్చని వ్యూహాలు సిద్ధం చేశారు. అందులో భాగంగా రాజ్యసభ ఎన్నికల వేదిక విజయవాడకు మార్చాలని అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణతో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయించారు. అయితే ఈ వినతిని ఈసీ తిరస్కరించడంతో చంద్రబాబు వ్యూహాలు తారుమారయ్యాయి.