(సాక్షి ప్రతినిధి, ఏలూరు): చంద్రబాబు రుణవంచనపై రైతన్న తిరగబడ్డాడు. నారా వారి నయామోసంపై మహిళాలోకం గర్జించింది. ఉద్యోగాలిప్పిస్తామని, నిరుద్యోగభృతి కల్పిస్తామని చెప్పిన మాయమాటలపై యువత నిప్పులు చెరిగింది. ఎడాపెడా పింఛన్ల కోతపై వృద్ధులు, వికలాంగులు కదం తొక్కారు. అధికారం దన్నుతో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడుతున్న వేధింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి. వెరసి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాకు వేలాదిగా ప్రజ పోటెత్తింది.
ఆరునెలల తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకు, రుణమాఫీపై రోజుకో మాట-పూటకో ప్రకటనతో రైతులను మోసం చేస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది. శుక్రవారం ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ధర్నా చేపట్టాలని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. ఆ మేరకు సరిగ్గా పదిగంటలకే కలెక్టరేట్ వద్ద ధర్నా మొదలు పెట్టగా, మధ్యాహ్నం రెండుగంటల వరకు ప్రజాందోళన ఏకబిగిన కొనసాగింది. ధర్నా ప్రారంభానికి ముందే చుట్టుపక్కల ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు ధర్నా జరిగే ప్రాంతానికి నలువైపులా బ్యారికేడ్లు, ఇనుపముళ్ల కంచెలు ఏర్పాటు చేసినా, ఇవేమీ జనం రాకకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. చివరికి ధర్నా ముగిసే సమయం మధ్యాహ్నానికి కూడా నరసాపురం నుంచి పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు నాయకత్వంలో ఏలూరు తరలివచ్చిన వేలాదిమంది ఫైర్‌స్టేషన్ సెంటర్‌లోని మహానేత వైఎస్ విగ్రహం మొదలుకుని ధర్నా స్థలి వరకు జగన్నినాదాలు చేస్తూ నడుచుకుంటూ వచ్చారు.
అంచనాలకు మించి.. స్వచ్ఛందంగా
పార్టీ సీనియర్ నేతలు, పోలీసు అధికారుల అంచనాలను మించి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది జనం కదలివచ్చారు. మెట్టలో ఆకుమడులు, డెల్టాలో కోతలతో జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత నేపథ్యంలో రైతులు ఏ మేరకు ఏలూరు తరలివస్తారోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ రైతన్నలు పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా కదలివచ్చారు. తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నరసాపురం, పోలవరం.. ఇలా ప్రాంతాలకు అతీతంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన కర్షకులు, మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారు. బాబు ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, ఆళ్ల నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు, తెర్లాం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వంకా రవీంద్ర, కారుమూరి నాగేశ్వరరావు, బి.వి.ఆర్,చౌదరి, జిఎస్.రావు, ముదునూరి ప్రసాదరాజు తదితర నేతలు విరుచుకుపడినప్పుడు జనం చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు. ఇప్పటి వరకు జై జగన్ నినాదాలు ఎక్కువగా యువత నుంచే వినిపించేవి..ఇప్పుడు రైతాంగం నుంచి కూడా జగన్నినాదాలు మిన్నంటడం... ఆ వర్గానికి వైఎస్ జగన్ పట్ల నమ్మకాన్ని తెలియజేస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు.
పశ్చిమ నుంచే మొదలైన తిరుగుబాటు
జిల్లాలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను టీడీపీ, మిత్రపక్ష బీజేపీ గెలుచుకోవడంతో అధికార పక్షానికి పెట్టని కోటగా భావిస్తున్న పశ్చిమ జిల్లా నుంచే ప్రజల నుంచి బాబు సర్కారుపై తిరుగుబాటు తీవ్రస్థాయిలో మొదలైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మహాధర్నా వంటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ల నాని తన పట్టు నిరూపించుకున్నారు. ఇక జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ కన్వీనర్లు, పార్టీ సీనియర్ నాయకులు రావడంతో పాటు ఒకే వేదికపై కూర్చొని సంఘీభావం ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వ ఆగడాలపై రాజీలేని పోరాటంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతర ఉద్యమాలకు శ్రీకారం చుడతామని సభా వేదిక నుంచి పిలుపునివ్వడం పార్టీ శ్రేణులకు కొత్త ఊపునిచ్చింది. మొత్తంగా మహాధర్నా విజయవంతం జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలోపేతమవుతోందన్న విషయాన్ని స్పష్టం చేసిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
హామీల మాఫీపై మహాగ్రహం
Published Sat, Dec 6 2014 1:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM
Advertisement
Advertisement