టిడిపి బండారం బట్టబయలు
పెద్దల సభ అయిన రాజ్యసభను ఆచరణలో ధనవంతుల సభగా మార్చేస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టిడిపి కూడా పార్టీ కోసం పాటుపడేవారు, బడుగుబలహీన వర్గాలకు కాకుండా ధనవంతులకే రాజ్యసభ టిక్కెట్లు కట్టబెట్టాయి. దాదాపు అన్ని పార్టీలు ఇదే పంథాను అనుసరిస్తున్నాయి. సంపన్నులకు, ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేని వారికి, ఓడిపోయినవారికి రాజ్యసభ టిక్కెట్లు ఇస్తున్నాయి. తిక్కవరపు సుబ్బరామిరెడ్డిని మళ్లీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనతో టిడిపి బండారం కూడా బట్టబయలైంది.
టిడిపి గతంలో సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటివారిని రాజ్యసభకు పంపింది. వాళ్లు ఎంతటి సంపన్నులో వేరే చెప్పవలసిన అవసరంలేదు. ఇప్పుడు కూడా ధనవంతులనే ఎంపిక చేసింది. ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వియ్యంకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గరికపాటి మోహనరావును, జగదీష్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ అధిపతి సత్యనారాయణ భార్య సీతామహాలక్ష్మిని రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. అవకాశం ఉన్న రెండు స్థానాలకు సంపన్నులనే ఎంపిక చేయడాన్ని పార్టీలో పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పార్టీలో ఎక్కువ మందికి నచ్చలేదని తెలుస్తోంది.
రాజ్యసభ టిక్కెట్ ఆశిస్తున్న నందమూరి హరికృష్ణ, మోత్కుపల్లి నర్సింహులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరు ముగ్గురూ నిన్న జరిగిన పార్టీ పోలిట్బ్యూరో సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వచ్చారు. మోత్కుపల్లి మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను బుజ్జగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు అనేక తాయిలాల ఆశ చూపుతున్నారు. ఆయన ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఓ దశలో ఆయన పార్టీపై మండిపడుతూ డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా? అని ప్రశ్నించినట్లు సమాచారం. అసంతృప్తి తీవ్రరూపం దాల్చుతుండటంతో ఆ పార్టీ ఆందోళనలో పడింది.