సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి సోమవారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 4న రాజ్యసభలో చర్చ సందర్భంగా కనకమేడల చేసిన ప్రసంగం సభ నియమ, నిబంధనలకు ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కనకమేడల ప్రసంగంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ శాసన సభ కార్యకలాపాల గురించి, అత్యున్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల గురించి కనకమేడల చేసిన వ్యాఖ్యలు అత్యంత హానికరమైనవి. సభలో చర్చ జరిగే అంశం నుంచి పక్కకు మళ్లుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసన వ్యవస్థల కార్యకలాపాలపైన, వ్యక్తులపైన కనకమేడల చేసిన అసహ్యమైన వ్యాఖ్యలు రాజ్యసభ రూల్ 238 (3), రూల్ 238 (5) ఉల్లంఘన అవుతుంది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విద్వేషపూరిత రాజకీయాల్లో భాగంగానే కనకమేడల ప్రసంగాన్ని పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల టీడీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో మత ఘర్షణలు జరుగుతున్నట్టు చెప్పారని, ఇందుకు సాక్ష్యంగా 2016–17 కాలం నాటి ఒక వీడియో క్లిప్‌ను ఆయనకు చూపి కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి చెందిన వీడియో క్లిప్ వాస్తవానికి 2016–17 మధ్య నాటిదని, అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న వాస్తవాన్ని టీడీపీ ఎంపీలు హోం మంత్రి వద్ద దాచిపెట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. కనకమేడల ప్రసంగంలోని విద్వేషపూరిత వ్యాఖ్యలు ఏ రూల్ ప్రకారం సభా నియమాలకు విరుద్ధమో వివరిస్తూ ఒక జాబితాను ఫిర్యాదుకు జత చేశారు.
పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన విజయసాయిరెడ్డి
అంతకుముందు రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికి ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ‘ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగినప్పుడు టీడీపీ ఎంపీ ప్రస్తావించిన అంశాలు అభ్యంతరకరం. వాటిని ఈ సభలో ప్రస్తావించాల్సి ఉండకూడదు. మీరు వాటిని అనుమతించారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలి’ అని కోరారు. అభ్యంతరాలను పరిశీలిస్తానని చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశాలతో ఈ సభకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి వివరించబోగా.. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి మెరిట్స్‌లోకి వెళ్లొద్దని, అభ్యంతరాలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తానని చైర్మన్ పేర్కొన్నారు. తిరిగి జీరో అవర్ పూర్తయ్యాక ప్రత్యేక ప్రస్తావనలు ప్రారంభించే సమయంలో కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు లేచి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ఎవరైనా సభ్యుడు అభ్యంతరకరంగా మాట్లాడితే తన దృష్టికి తీసుకురావాలని, కానీ అలా చేయకుండా తనపై ఆరోపణలు చేశారని, ఇది చైర్మన్ తన విధులను నిర్వర్తించకుండా చేయడమేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment