
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ నేతలపై ఆంధ్రజ్యోతి పత్రిక అసత్య కథనాలు ప్రచురిస్తోందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నవంబర్ 30న ఆంధ్రజ్యోతిలో ‘భూ దందాలో పెద్దలు’ శీర్షిక పేరుతో వాస్తవాలను వక్రీకరిస్తూ కథనాన్ని ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం వైఎస్సార్‌సీపీ నేతలపై బురద జల్లడమేనని ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సర్వే నంబర్ 275 భూమికి సంబంధించిన వివాదం మొత్తం టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు.
సింహాచలం దేవస్థానం ఆక్రమిత భూములను క్రమబద్ధీకరిస్తామని 1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అది వివాదస్పదంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవాలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయన్నారు. కాగా.. ఇప్పుడు దీనిపై న్యాయసలహాలు తీసుకోవాలని ఈవోకు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
సింహాచలం భూముల కుంభకోణాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ అశోక్ గజపతిరాజేనని ధ్వజమెత్తారు. అసలు ఆయన ధర్మకర్త కానేకాదని అధర్మకర్తని పేర్కొన్నారు. ఈ విషయం అశోక్ గజపతిరాజుకూ బాగా తెలుసని చెప్పారు. కానీ బయట ప్రజలను నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా సర్వే నంబర్ 275లో దేవస్థాన ఆక్రమిత భూములు 22(ఎ) కింద ఉన్నాయని తెలిసి కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలా ఎల్‌ఆర్‌సీ ఇచ్చిందో తెలియడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment