Three Seats Unanimous In Telangana Local Bodies MLC Elections - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ.. కవిత సహా ముగ్గురు ఏకగ్రీవం..!

Published Thu, Nov 25 2021 3:11 AM | Last Updated on Thu, Nov 25 2021 10:31 AM

Three Seats Unanimous In Telangana Local Bodies MLC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలోని 12 స్థానిక సంస్థల కోటా స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ల్లో.. మూడు చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. బుధవారం జరిగిన నామినేషన్ల స్క్రూటినీ అనంతరం నిజామాబాద్‌ జిల్లాలోని ఒక స్థానంలో కల్వకుంట్ల కవిత.. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు ఇద్దరే బరిలో మిగిలారు. వీరి ఎన్నిక దాదాపు ఖరారైనా.. ఈ నెల 26న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక అధికారికంగా ప్రకటించనున్నారు.

తిరస్కరణలతో..: నిజామాబాద్‌ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు. బుధవారం జరిగిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ)లో స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్‌ నామినేషన్‌ను అధికా రులు తిరస్కరించారు. దీనితో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత ఒక్కరే పోటీలో మిగిలారు. రంగారెడ్డి జిల్లా లోని రెండు స్థానాలకుగాను.. టీఆర్‌ఎస్‌ తరఫున పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజుతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా చాలిక చంద్రశేఖర్‌ నామినేషన్లు వేశారు.

ఇందులో చంద్రశేఖర్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో.. ఉన్న రెండు స్థానాలకు ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే మిగిలారు. దీనితో ఈ ముగ్గురి ఏకగ్రీవం ఖాయమైంది. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. నిబంధనల మేరకు ఈ గడువు ముగిశాకే రిటర్నింగ్‌ అధికారులు ఏకగ్రీవాలను ప్రకటించాల్సి ఉంటుంది.

మెదక్, ఖమ్మం బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు
ఏకగ్రీవాలు ఖాయమైన మూడు స్థానాలుపోగా.. మిగతా తొమ్మిది స్థానాల్లో రెండు చోట్ల మాత్రమే కా>ంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్‌లో నిర్మల జగ్గారెడ్డి, ఖమ్మంలో రాయల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మరో ఏడు చోట్ల టీఆర్‌ఎస్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో.. స్వతంత్ర అభ్యర్థులను విత్‌డ్రా చేయించి ఈ ఏడు స్థానాలనూ ఏకగ్రీవం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్టు సమాచారం.

  • కరీంనగర్‌లోని రెండు స్థానాలకుగాను ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బరిలో ఉండగా.. టీఆర్‌ఎస్‌కే చెందిన సర్దార్‌ రవీందర్‌సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దీనితోపాటు పోటీలో ఎక్కువ మంది ఉండటంతో.. టీఆర్‌ఎస్‌ పార్టీ తమ ఓటర్లను క్యాంపుకు తరలించింది.
  • ఇక పలు సాంకేతిక కారణాల వల్ల వరంగల్‌ స్థానంలో నామినేషన్ల పరిశీలనను గురువారానికి వాయిదా వేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. వరంగల్‌లో ఐదుగురు నామినేషన్లు వేయగా.. అందులో నలుగురి నామినేషన్లు సరైనవిగా ధ్రువీకరించారు. ఐదో నామినేషన్‌పై నిర్ణయాన్ని గురువారం వెల్లడించనున్నట్టు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

‘రంగారెడ్డి’ ఎన్నిక రద్దు చేయండి
రంగారెడ్డి ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన తమను అధికార పార్టీ నేతలు అడ్డుకుని, నామినేషన్‌ పత్రాలను చించేశారంటూ.. పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ ఫోరం అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, చింపుల శైలజారెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్, రిటర్నింగ్‌ అధికారి అమయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి ‘స్థానిక’ ఎన్నికను రద్దు చేయాలని.. తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి, తమకు పోటీ అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.

స్క్రూటినీ తర్వాత అభ్యర్థుల లెక్క ఇదీ..
స్థానం        టీఆర్‌ఎస్‌    కాంగ్రెస్‌    స్వతంత్ర        మొత్తం
ఆదిలాబాద్‌        1                –                23                  24
వరంగల్‌            1                –                03                   04
నల్లగొండ          1                 –                05                   06
మెదక్‌               1                1                 03                  05
నిజామాబాద్‌     1                –                  –                    01
ఖమ్మం             1                1                 02                   04
కరీంనగర్‌          2               –                 22                   24
మహబూబ్‌నగర్‌  2             –                  02                  04
రంగారెడ్డి           2               –                  –                    02  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement