local bodies mlc
-
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక
విశాఖపట్నం, సాక్షి: స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం. బొత్స ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ తీసుకున్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. బీ ఫారం ఇచ్చి పోటీకి ప్రొత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సహకరించిన జిల్లా నేతలకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారాయన. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.ఫలించని కూటమి ఎత్తులువిశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కావాల్సిన పూర్తి బలం వైఎస్సార్సీపీకి ఉంది. అయినప్పటికీ పోటీకి దించాలని కూటమి ప్రభుత్వం తొలుత భావించింది. కుయుక్తులు, కుట్రలకు తెర లేపింది. కానీ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్రమత్త చేయడంతో.. వైఎస్సార్సీపీ కేడర్ ఏకతాటిపై నిల్చుంది. దీంతో టీడీపీ-కూటమి పాచికలు పారలేదు. లాభం లేదనుకుని అభ్యర్థిని నిలిపే ఆలోచనను విరమించుకుంది. మరోవైపు.. స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. -
YS Jagan: శ్రీనివాసరావుకు పరామర్శ.. విశాఖ నేతలతో కీలక భేటీ
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వంలో దాడులకు గురవుతున్న పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెబుతూ.. భరోసా ఇస్తున్నారు. తాజాగా.. టీడీపీ శ్రేణుల చేతిలో మూక దాడికి గురైన గింజుపల్లి శ్రీనివాసరావును జగన్ పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ కార్యకర్తలే ఆయనపై దాడికి పాల్పడినట్లు స్పష్టంగా నిర్ధారణ అయ్యింది కూడా. ఈ నేపథ్యంలో.. రేపు సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్నారు జగన్. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించనున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక.. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయనున్నారు. బుధ, గురువారాల్లో వరుసగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు కుటిల రాజకీయాల నేపథ్యంలో పార్టీ కేడర్‌ను ఆయన అప్రమత్తం చేయనున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, భవిష్యత్తు వైఎస్సార్సీపీదేని భరోసా ఇస్తూనే.. ఎన్నికల్లో వ్యవహారించాల్సిన తీరును ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. -
చంద్రబాబు నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ ఉందని.. అయినా టీడీపీ పోటీకి వెళ్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ నేతలతో తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ ఉంది. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పోటీ పెట్టకూడదు. కానీ చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదు. అందుకే బరిలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. పైగా.. అడ్డగోలుగా ప్రలోభాలు, బెదిరింపులతో గెలవడానికి ప్రయత్నిస్తారు. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం అని జగన్ ఆక్షేపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఉన్నిక జరగబోతోందని.. అందుకే పార్టీలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.అనంతరం.. ఒక్కొక్కరి నుంచి జగన్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారాయన. అనంతరం.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని.. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని.. వాటిని థీటుగా ఎదుర్కొనేలా అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపు ఇచ్చారు. -
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స
గుంటూరు, సాక్షి: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ప్రకటించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. పలువురి పేర్లు పరిశీలించి.. చర్చించిన తర్వాత బొత్స పేరును ప్రకటించారాయన. ఈ భేటీలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు.ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం.. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన.. ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక జరుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. వైఎస్సార్సీపీదే బలంవిశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రలోభాల పర్వం మొదలుపెట్టింది. జీవీఎంసీలో 12 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. అయితే.. కార్పొరేటర్లతో మాట్లాడిన వైఎస్ జగన్, రాబోయే రోజులు వైఎస్సార్సీపీవేనని.. అధైర్యపడొద్దని చెప్పారు. ఇక.. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ఆయన ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్లింది. దీంతో.. బాబ్జీకి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. -
AP: ‘ఎమ్మెల్సీ’లోనూ ఏకగ్రీవాలు
సాక్షి అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవ విజయాలు నమోదు చేస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 9 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించనున్నారు. వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉంది. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారు. వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో బలపరిచిన వారి సంతకాలు ఫోర్జరీవని తేలడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి వేలూరు రంగయ్య నామినేషన్‌ను అధికారులు స్క్రూటినీలో తిరస్కరించారు. దీంతో ఈ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్.మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేరిగ మురళి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని తాను బలపరచలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని సూళ్లూరుపేట కౌన్సిలర్ చెంగమ్మ రిటర్నింగ్ ఆఫీసర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ఇక్కడ మురళి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణరావు ఎన్నిక లాంఛనమే కానుంది. టీడీపీకి చెందిన కడలి శ్రీదుర్గ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించారు. బరిలో కుడుపూడి సూర్యనారాయణరావు మాత్రమే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల పరిశీలన పూర్తయ్యింది. వైఎస్సార్సీపీ తరఫున నర్తు రామారావు, ఇండిపెండెంట్‌గా ఆనెపు రామకృష్ణ బరిలో ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు రెండింటిలో మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఏడుగురు బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి నల్లి రాజేష్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం నలుగురు నామినేషన్లు దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థి కుమ్మరి శ్రీనివాసులు నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎ.మధుసూదన్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో మిగిలారు. పట్టభద్రుల నియోజకవర్గాలకు భారీగా నామినేషన్లు మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు 137 నామినేషన్లు, రెండు టీచర్ల నియోజకవర్గాలకు 25 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి అత్యధికంగా 63 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 12 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 51 మంది బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గం బరిలో వైఎస్సార్సీపీ నుంచి వెన్నపూస రవీంద్ర రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, భూమిరెడ్డి ఉమాదేవి, బీజేపీ నుంచి రాఘవేంద్ర నగరూరు సహా పలువురు ఉన్నారు. శ్రీకాకుళం–విజయనగరం–విశాఖ పట్టభద్రుల నియోజకవర్గంలో 44 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి సీతంరాజు సుధాకర్, టీడీపీ నుంచి వేపాడ చిరంజీవిరావు, గుణూరు మల్లునాయుడు, బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్ తదితరులు నామినేషన్లు వేశారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గానికి 30 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటలో ఏడింటిని అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్సీపీ నుంచి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, పేర్నేటి హేమ సుస్మిత, టీడీపీ నుంచి కంచర్ల శ్రీకాంత్ చౌదరి, అవిల్నేని సరిత, బీజేపీ నుంచి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తదితరులు బరిలో ఉన్నారు. టీచర్ల నియోజకవర్గాలకు బరిలో 22 మంది పార్టీలకు అతీతంగా జరిగే రెండు టీచర్ల నియోజకవర్గాలకు మొత్తం 25 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు నియోజకవర్గానికి 8 నామినేషన్లు దాఖలవగా అన్నీ ఆమోదం పొందాయి. కడప–అనంతపురం–కర్నూలుకు 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ముగ్గురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 22 మంది బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం నికరంగా ఎంతమంది బరిలో ఉన్నారన్న విషయంపై స్పష్టత వస్తుంది. ఏకగ్రీవం కాని స్థానిక సంస్థలు, పట్టభద్రులు, టీచర్ల స్థానాలకు మార్చి13న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి16న ఓట్లు లెక్కించి, విజేతలను ప్రకటిస్తారు. -
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై బీజేపీ పునరాలోచన
-
మండలి ‘స్థానికం’లో అన్నీ గెలవాలి.. పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆరు శాసనమండలి స్థానిక కోటా స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలవాలని పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పార్టీ ఎంపీలతో భేటీలో ఈ అంశంపై టీఆర్ఎస్ అధినేత ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. సంఖ్యాపరంగా టీఆర్ఎస్కే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నందున గెలుపు గురించి అనుమానాలు అక్కర్లేనప్పటికీ పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు జరిగే స్థానాల పరిధిలోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు అవసరమైతే ఓటర్లు బస చేసిన క్యాంపులకు వెళ్లి ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో భేటీ కావాలని ఆయన సూచించినట్లు తెలిసింది. నిధులు, విధులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో నెలకొన్న అసంతృప్తిని కొందరు ఎంపీలు ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి వేతనాల పెంపుతోపాటు కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా, మండల పరిషత్‌ల అభివృద్ధికి రూ. 250 కోట్లను తక్షణమే విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేకే, నామా నాగేశ్వర్రావు, కొత్తా ప్రభాకర్‌రెడ్డితోపాటు ఇతర ఎంపీలు, మంత్రులు హరీశ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి పాల్గొన్నారు. -
తేలిన స్థానిక సంస్థల మండలి ఓటర్ల లెక్క.. 6 స్థానాల్లో 5,326 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న ఆరు స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరు స్థానాల్లో 2,997 మంది మహిళలు, 2,329 మంది పురుషులు.. కలిపి మొత్తం 5,326 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీలు 3,223, జెడ్పీటీసీలు 325, మున్సిపల్ కౌన్సిలర్లు 1,544, కార్పొరేటర్లు 169, ఎక్స్అఫీషియో ఓటర్లు 65 మంది ఉన్నారు. రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల అథారిటీల (12 సీట్లకు) మండలి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, ఆరు సీట్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన ఆదిలాబాద్, కరీంనగర్ (2 సీట్లు), మెదక్, నల్లగొండ, ఖమ్మం స్థానాలకు వచ్చే నెల 10న పోలింగ్ నిర్వహించి 12న ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ స్థానాల్లో ఓటేయనున్న వారి వివరాలను పట్టికలో చూడవచ్చు.. -
ఆ ఆరూ కారెక్కాల్సిందే.. మండలి స్థానిక కోటా సీట్లపై టీఆర్ఎస్ పట్టు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకుగాను పోరు తప్పని ఆరింటినీ తన ఖాతాలో వేసుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో పావులు కదుపుతోంది. విపక్షాల వ్యూహాలకు కౌంటర్ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలవారీగా ఎన్నిక జరుగుతుండటంతో ఆయా జిల్లాల మంత్రులకు సమన్వయ బాధ్యతలు, ప్రణాళికను అమలు చేసే పనిని పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అప్పగించారు. మెదక్, ఖమ్మం మినహా మిగిలిన నాలుగింటిలోని స్వతంత్ర అభ్యర్థుల వెనుక బీజేపీ, కాంగ్రెస్ నేతల హస్తం ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఆయా పార్టీలకున్న బలాబలాలను అంచనా వేస్తోంది. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో జిల్లా మంత్రులు భేటీ అయి ఎన్నికల వ్యూహాన్ని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాలలోని పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరినవారిని కూడా కలుపుకుంటే సంఖ్యాపరంగా అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్దే ఆధిపత్యం. నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడితో సమావేశం జరిగింది. ఆ జిల్లాలో ఆరుగురు స్వతంత్రులు బరిలో ఉన్నా వారి ప్రభావం పెద్దగా ఉండదని సమావేశం అభిప్రాయపడింది. ఖమ్మంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి ఖమ్మం బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను మంత్రి పువ్వాడ ఒక్కరే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మధిర, భద్రాచలం ఎమ్మెల్యేలు మినహా మరో ఏడుగురు తర్వాత అధికార పార్టీలో చేరారు. ఇక్కడ టీఆర్ఎస్కు ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలమున్నా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు అధిష్టానానికి ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చేనెల ఒకటి తర్వాత కార్పొరేటర్ల క్యాంపు కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలతో కలుపుకొని మొత్తం పది మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో టీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఇప్పటికే పార్టీకి చెందిన ఎంపీటీసీలు హైదరాబాద్ శివారులోని క్యాంపులకు తరలిపోగా, డిసెంబర్ మొదటివారంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా బెంగళూరు టూర్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెదక్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు బీజేపీలో చేరిన ఓ కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే నియోజకవర్గాలవారీగా ఓటర్లతో భేటీ అవుతున్నారు. ఐదో తేదీ తర్వాత ఇక్కడి నుంచి క్యాంపులకు తరలేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఆరుచోట్లా విపక్షనేతల మంత్రాంగం కరీంనగర్లో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమకు అనుకూలంగా ఉండే స్వతంత్రులను బరిలోకి దించి టీఆర్ఎస్ ఓటమికి పథక రచన చేస్తున్నారు. మెదక్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మద్దతు పలుకుతున్నారు. పుష్పరాణికి ఎంపీ సోయం బాపూరావుతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దన్నుగా ఉన్నట్లు సమాచారం. నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సోదరుల అండతో ఒకరిద్దరు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఖమ్మంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పోడెం వీరయ్య కాంగ్రెస్ అభ్యర్థికి ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఏపీలో 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం.. అన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోకే..!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 11 స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. పోటీ లేకపోవడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను రిటర్నింగ్ అధికారులు లాంఛనంగా జారీ చేయనున్నారు. దీంతో 58 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో వైఎస్సార్సీపీ బలం 20 నుంచి 31కు పెరగనుంది. స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వీరే.. జిల్లా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ విజయనగరం ఇందుకూరు రఘురాజు విశాఖపట్నం వరుదు కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్ తూర్పుగోదావరి అనంత ఉదయభాస్కర్ కృష్ణా తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్ గుంటూరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ప్రకాశం తూమాటి మాధవరావు చిత్తూరు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ అనంతపురం వై.శివరామిరెడ్డి -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ.. కవిత సహా ముగ్గురు ఏకగ్రీవం..!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలోని 12 స్థానిక సంస్థల కోటా స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ల్లో.. మూడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. బుధవారం జరిగిన నామినేషన్ల స్క్రూటినీ అనంతరం నిజామాబాద్ జిల్లాలోని ఒక స్థానంలో కల్వకుంట్ల కవిత.. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు ఇద్దరే బరిలో మిగిలారు. వీరి ఎన్నిక దాదాపు ఖరారైనా.. ఈ నెల 26న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక అధికారికంగా ప్రకటించనున్నారు. తిరస్కరణలతో..: నిజామాబాద్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు. బుధవారం జరిగిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ)లో స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్‌ను అధికా రులు తిరస్కరించారు. దీనితో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఒక్కరే పోటీలో మిగిలారు. రంగారెడ్డి జిల్లా లోని రెండు స్థానాలకుగాను.. టీఆర్ఎస్ తరఫున పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజుతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా చాలిక చంద్రశేఖర్ నామినేషన్లు వేశారు. ఇందులో చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో.. ఉన్న రెండు స్థానాలకు ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులే మిగిలారు. దీనితో ఈ ముగ్గురి ఏకగ్రీవం ఖాయమైంది. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. నిబంధనల మేరకు ఈ గడువు ముగిశాకే రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవాలను ప్రకటించాల్సి ఉంటుంది. మెదక్, ఖమ్మం బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవాలు ఖాయమైన మూడు స్థానాలుపోగా.. మిగతా తొమ్మిది స్థానాల్లో రెండు చోట్ల మాత్రమే కా>ంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్‌లో నిర్మల జగ్గారెడ్డి, ఖమ్మంలో రాయల నాగేశ్వర్రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మరో ఏడు చోట్ల టీఆర్ఎస్తోపాటు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో.. స్వతంత్ర అభ్యర్థులను విత్‌డ్రా చేయించి ఈ ఏడు స్థానాలనూ ఏకగ్రీవం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. కరీంనగర్‌లోని రెండు స్థానాలకుగాను ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉండగా.. టీఆర్ఎస్కే చెందిన సర్దార్ రవీందర్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీనితోపాటు పోటీలో ఎక్కువ మంది ఉండటంతో.. టీఆర్ఎస్ పార్టీ తమ ఓటర్లను క్యాంపుకు తరలించింది. ఇక పలు సాంకేతిక కారణాల వల్ల వరంగల్ స్థానంలో నామినేషన్ల పరిశీలనను గురువారానికి వాయిదా వేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వరంగల్‌లో ఐదుగురు నామినేషన్లు వేయగా.. అందులో నలుగురి నామినేషన్లు సరైనవిగా ధ్రువీకరించారు. ఐదో నామినేషన్‌పై నిర్ణయాన్ని గురువారం వెల్లడించనున్నట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ‘రంగారెడ్డి’ ఎన్నిక రద్దు చేయండి రంగారెడ్డి ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నామినేషన్ వేసేందుకు వెళ్లిన తమను అధికార పార్టీ నేతలు అడ్డుకుని, నామినేషన్ పత్రాలను చించేశారంటూ.. పంచాయతీరాజ్ చాంబర్స్ ఫోరం అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, చింపుల శైలజారెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, రిటర్నింగ్ అధికారి అమయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి ‘స్థానిక’ ఎన్నికను రద్దు చేయాలని.. తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి, తమకు పోటీ అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. స్క్రూటినీ తర్వాత అభ్యర్థుల లెక్క ఇదీ.. స్థానం టీఆర్ఎస్ కాంగ్రెస్ స్వతంత్ర మొత్తం ఆదిలాబాద్ 1 – 23 24 వరంగల్ 1 – 03 04 నల్లగొండ 1 – 05 06 మెదక్ 1 1 03 05 నిజామాబాద్ 1 – – 01 ఖమ్మం 1 1 02 04 కరీంనగర్ 2 – 22 24 మహబూబ్‌నగర్ 2 – 02 04 రంగారెడ్డి 2 – – 02 -
AP: ఏకగ్రీవం కానున్న 11 ఎమ్మెల్సీ స్థానాలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ పూర్తి అయింది. 11 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. దీంతో 11 ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు.. ► కృష్ణా : కృష్ణా జిల్లా నుంచి తలసిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్ ► విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నుంచి వరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్. ► గుంటూరు: గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మూరుగుడు హనుమంతరావు ► విజయనగరం: విజయనగరం జిల్లా నుంచి ఇందుకురు రఘురాజు, ► తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత ఉదయ భాస్కర్ ► అనంతపురం: అనంతపురం జిల్ల నుంచి వై శివరమిరెడ్డి ► చిత్తూరు: చిత్తూరు జిల్లా నుంచి భరత్ ► ప్రకాశం: ప్రకాశం జిల్లా నుంచి మాధవరావు -
Telangana MLC Elections: నామినేషన్లు ముగిశాయ్.. క్యాంపులు షురూ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో 12 శాసనమండలి స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారం ముగిసింది. చివరి రోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ మినహా పూర్వపు తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానాలకు ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా బుధవారం నామినేషన్ల పరిశీలన, 26 వరకు ఉపసంహరణ తర్వాత బరిలో మిగిలే అభ్యర్థుల జాబితాపై స్పష్టత రానుంది. ఈ కోటా కింద ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో టీఆర్ఎస్కు చెందినవారే అధికంగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు అత్యధికంగా కరీంనగర్ నుంచి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. టీఆర్ఎస్ నామినేషన్లు ఇలా..: మెదక్ అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి రెండో సెట్ నామినేషన్ పత్రా లు దాఖలు చేయగా, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్ సమర్పించారు. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, నల్లగొండ స్థానం నుంచి ఎంసీ కోటిరెడ్డి కోటిరెడ్డి, ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు, ఆదిలాబాద్ స్థానం నుంచి దండె విఠల్ నామినేషన్ వేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఎల్.రమణ, తానిపర్తి భానుప్రసాద్ నామినేషన్లు వేశారు. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీరాజ్ చాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు శైలజారెడ్డి, ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు నిర్మలాశ్రీశైలంగౌడ్ సహా మరో 10 మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు నామినేషన్లు వేసేందుకు వచ్చారు. అధికార పార్టీకి చెం దిన నాయకులు వీరిని అడ్డు కుని నామినేషన్ పత్రాలను చించివేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళంలోనే, శేరిలింగంపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చలిక చంద్రశేఖర్ చాకచక్యంగా లోపలికెళ్లి స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. మంత్రులకు బాధ్యతలు: సంఖ్యా పరంగా ఎక్కు వ మం ది ఓటర్లను కలిగి ఉన్న టీఆర్ఎస్ వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవంగా గెలుపొందేలా వ్యూహరచ న చేస్తోంది. పార్టీ ఓటర్లు చేజారకుండా ఉండేందుకు ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు క్యాంపులకు తరలించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులకు ఓటర్ల మద్దతు కూడగట్టడం, క్యాంపుల నిర్వహణ, అసంతృప్తుల బుజ్జగింపు, స్వతంత్రులకు నచ్చచెప్పి పోటీ నుంచి వైదొలిగేలా చూడటం వంటి బా«ధ్యతలు అప్పగించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఓటర్లను మంగళవారం సాయంత్రానికే హైదరాబాద్ సమీపంలోని ఓ రిసార్టుకు తరలించినట్లు సమాచారం. -
TS: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆఖరి నిమిషంలో ట్విస్ట్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో నిన్నటి వరకు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకులు లలిత పేరు వినిపించింది. (చదవండి: ఎటూ తేల్చని కాంగ్రెస్) కానీ చివరకు అధిష్టానం నిజామాబాద్ నుంచి స్థానికసంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేసింది. రేపు ఉదయం కవిత నామినేషన్ వేయనున్నారు. చివరి వరకూ ఆకుల లలిత పేరు వినిపించినా చివరి నిముషంలో కవిత అభ్యర్థిత్వం ఖరారు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..! -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆరుగురు కొత్తవారికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అవకాశమిచ్చారు. మరో ఆరుగురు పాతవారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. సామాజిక, కుల సమీకరణాలు, తాను ఇచ్చిన హామీలు, మంత్రుల అభిప్రాయాలు, పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు తదితర అంశాల ప్రాతిపదికగా 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు నామినేషన్లు సిద్ధం చేసుకోవాలని ఒక్కొక్కరుగా అభ్యర్థులకు సమాచారం అందింది. కేసీఆర్ ఈ బాధ్యతలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావుకు అప్పగించి ఢిల్లీ వెళ్లగా.. హరీశ్‌రావు అభ్యర్థులకు ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. అధికారికంగా అభ్యర్థుల జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు సమాచారం. అన్నింటినీ బేరీజు వేశాకే.. ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక, కుల సమీకరణాలను బేరీజు వేసుకున్నాకే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఐదుగురే పాతవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), టి.భానుప్రసాదరావు (కరీంనగర్) ఉన్నారని.. వారు మరోమారు స్థానిక కోటాలో పోటీలో ఉంటారని సమాచారం. నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత.. ఈసారి పోటీకి అనాసక్తిగా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఆమె వద్దనుకుంటే ఎమ్మెల్యే కోటాలో రిటైరైన ఆకుల లలితకు స్థానిక కోటాలో అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. కవిత పోటీకి దిగితే మాత్రం ఆరుగురు సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. అయితే ఆకుల లలిత అభ్యర్థిత్వమే ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాలు చెప్తున్నాయి. కొత్తగా అవకాశం వచ్చిన జాబితాలో గాయకుడు సాయిచంద్ (మహబూబ్‌నగర్), ఎల్.రమణ (కరీంనగర్), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ), దండె విఠల్ (ఆదిలాబాద్), తాతా మధు (ఖమ్మం), డాక్టర్ యాదవరెడ్డి (మెదక్) ఉన్నారు. ఈ మేరకు ఎన్నికలు జరగనున్న తొమ్మిది జిల్లాల మంత్రులతో కేసీఆర్ సమావేశమై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. చేజారనివ్వొద్దు.. ఎన్నికలు జరగనున్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో టీఆర్ఎస్కు సంపూర్ణ బలం ఉందని.. ఓటర్లు చేజారకుండా నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్టు సమాచారం. అవసరమైన చోట క్యాంపులు ఏర్పాటు చేయడం సహా ఇతర జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఈ నెల 23వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో నామినేషన్లు సిద్ధం చేసుకునేలా అభ్యర్థులకు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రులతోపాటు, పార్టీపక్షాన మంత్రి హరీశ్‌రావు సదరు అభ్యర్థులకు ఫోన్‌చేసిన సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. అభ్యర్థిత్వం ఖరారైన నేతలు సోమ లేదా మంగళవారాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమకు పార్టీపరంగా సమాచారం అందిందని, నామినేషన్లకు సిద్ధమవుతున్నామని కొందరు అభ్యర్థులు ‘సాక్షి’కి ధ్రువీకరించారు. హామీలు, సాన్నిహిత్యంతో.. శాసన మండలిలో పద్మశాలి సామాజికవర్గానికి అవకాశమిస్తామనే సీఎం హామీ మేరకు ఎల్.రమణకు అవకాశం వచ్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎంసీ కోటిరెడ్డికి.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ యాదవరెడ్డికి జాబితాలో చోటు దక్కింది. గతంలో సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దండె విఠల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన స్వస్థలం సిర్పూర్ కాగజ్‌నగర్ కావడంతో ప్రస్తుతం ఆదిలాబాద్ ‘స్థానిక’ కోటా అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సాన్నిహిత్యంతోపాటు చాలాకాలంగా టీఆర్ఎస్లో కొనసాగుతుండటంతో తాతా మధుకు ఖమ్మం అభ్యర్థిత్వం దక్కినట్టు చెప్తున్నారు. ఉద్యమ సమయం నుంచి సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా ఉన్న సాయిచంద్‌కు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. 12 మంది ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఏడుగురు ఓసీలు, నలుగురు బీసీలు, ఒక ఎస్సీ సామాజికవర్గ అభ్యర్థికి ప్రాతినిధ్యం లభించింది. అభ్యర్థుల వారీగా చూస్తే.. పట్నం మహేందర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి (రెడ్డి), భానుప్రసాద్‌రావు (వెలమ), తాతా మధు (కమ్మ) ఓసీ కేటగిరీలో ఉన్నారు. బీసీ కేటగిరీలో శంభీపూర్ రాజు, ఆకుల లలిత, దండె విఠల్ (మున్నూరు కాపు), ఎల్.రమణ (పద్మశాలి) అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ఎస్సీ (మాల) కేటగిరీలో సాయిచంద్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. సిట్టింగ్‌లు రంగారెడ్డి: శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి వరంగల్: పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కరీంనగర్: భానుప్రసాదరావు మహబూబ్‌నగర్: కసిరెడ్డి నారాయణరెడ్డి కొత్తవారు ఎల్.రమణ, సాయిచంద్, దండె విఠల్, కోటిరెడ్డి, యాదవరెడ్డి, తాతా మధు. మళ్లీ పోటీకి అవకాశం దక్కనివారు నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పురాణం సతీశ్ (ఆదిలాబాద్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), వి.భూపాల్‌రెడ్డి (మెదక్) ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం రాత్రి పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలతో ఈ విషయమై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో పార్టీకి తగినంత బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీజేపీ స్ధానిక సంస్థల ప్రతినిధులు ఏ పార్టీకి మద్దతు ఇవ్వరాదని, ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా మద్దతు కోరితే ఆలోచించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. -
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. అనంతపురం-1, కృష్ణా-2, తూర్పుగోదావరి-1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. -
నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది..!
సాక్షి, నల్గొండ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. నల్గొండలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తెర చిన్నపరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది. నాకు ఓటేసిన అందరికీ ధన్యవాదాలు. మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరి కృషితో మంచి మెజారిటీతో విజయం సాధించబోతున్నా. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమమే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్కు పట్టేందుకు దోహదపడింది. శాసనమండలికి వెళ్లి విశేషమైన అభివృద్ధి చేసి చూపిస్తా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నల్గొండ జిల్లా లోకల్‌బాడీ స్థానాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుంది. నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. (చదవండి : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం) -
‘నా సతీమణి తప్పక గెలుస్తుంది’
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తన సతీమణి గెలుపొందుతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఉప ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను హీనంగా చూస్తుందని ఆరోపించారు. ఇన్ని రోజులు గడిచిన సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వలేదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే కేసీఆర్‌కు బుద్ధి చెబుతూ నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిని గెలిపించాలని కోరారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 2,799 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం రంగారెడ్డిలో 8, వరంగల్‌లో 10, నల్లగొండలో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్‌రెడ్డి సూర్యాపేట పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సరళిని పరిశీలించారు. 2016లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా పట్నం నరేందర్‌రెడ్డి, వరంగల్ నుంచి కొండా మురళి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు గెలిచారు. గత శాసనసభ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి కొడంగల్ నుంచి, రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కొండా మురళి వ్యక్తిగత కారణాలతో రాజీనామా సమర్పించడంతో తాజాగా వీటికి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కాగా, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి(టీఆర్ఎస్), కోమరి ప్రతాప్‌రెడ్డి(కాంగ్రెస్), నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి (టీఆర్ఎస్), కోమటిరెడ్డి లక్ష్మీ(కాంగ్రెస్), వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ( టీఆర్ఎస్), ఎంగా వెంకట్రామ్రెడ్డి(కాంగ్రెస్) ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నిల ఫలితాలను జూన్ 3వ తేదీన ప్రకటించనున్నారు. నల్లగొండలో హోరాహోరి.. ఉమ్మడి జిల్లాలోని 1086 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగిచుకోనున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. ఇప్పటివరకు రహస్య ప్రాంతాల్లో ఉన్న ఇరు పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంది. -
నేడే ‘స్థానిక’ మండలి ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు శుక్రవారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 2,799 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రంగారెడ్డిలో 8, వరంగల్‌లో 10, నల్లగొండలో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, (టీఆర్ ఎస్), కోమరి ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్), నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి (టీఆర్ఎస్), కోమటిరెడ్డి లక్ష్మి (కాంగ్రెస్), వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్ఎస్), ఎంగాల వెంకట్రామ్రెడ్డి (కాంగ్రెస్), ఇండిపెండెంట్లుగా ఎ.యాకయ్య, తక్కళ్లపల్లి రవీందర్, రంగరాజు రవీందర్ పోటీలో ఉన్నారు. జూన్ 3న ఫలితాలను ప్రకటించనున్నారు. -
స్థానిక ఎమ్మెల్సీలకు జూన్‌లో ఎన్నికలు
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ నెలలో కమిషన్ ఎన్నికలు నిర్వహించనుందని రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రెండు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు చెందిన ఓటర్ల జాబితాను రెండు రోజుల క్రితమే ప్రకటించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాను వెబ్ సైట్లో కూడా ఉంచామని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోకపోతే ఓటు వేసే అవకాశం ఉండదని, ఈ నేపథ్యంలో జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని, పేరు లేకపోతే ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓటర్లకు సూచించారు. స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓటర్లగా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులుంటారని, అలాగే ఎక్స్ ఆఫీషియో సభ్యులగా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన వివరించారు. ఈ నెల 25వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను వచ్చే నెల 6వ తేదీన ప్రకటిస్తామని, ఇదే జాబితాను రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు.