సాక్షి, హైదరాబాద్: ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆరు శాసనమండలి స్థానిక కోటా స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలవాలని పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పార్టీ ఎంపీలతో భేటీలో ఈ అంశంపై టీఆర్‌ఎస్ అధినేత ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నందున గెలుపు గురించి అనుమానాలు అక్కర్లేనప్పటికీ పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు జరిగే స్థానాల పరిధిలోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు అవసరమైతే ఓటర్లు బస చేసిన క్యాంపులకు వెళ్లి ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో భేటీ కావాలని ఆయన సూచించినట్లు తెలిసింది.
నిధులు, విధులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో నెలకొన్న అసంతృప్తిని కొందరు ఎంపీలు ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి వేతనాల పెంపుతోపాటు కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా, మండల పరిషత్‌ల అభివృద్ధికి రూ. 250 కోట్లను తక్షణమే విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేకే, నామా నాగేశ్వర్‌రావు, కొత్తా ప్రభాకర్‌రెడ్డితోపాటు ఇతర ఎంపీలు, మంత్రులు హరీశ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment