Telangana MLC Elections
-
ఓటేసి వెళ్లి కన్యాదానం.. లండన్ నుంచి రాక
అమ్మ వస్తుంది... ఏడవకు ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి ఓ మహిళా ఓటరు తన కుమార్తెతో కలిసి వచ్చింది. ఆ చిన్నారిని ఓ మహిళా కానిస్టేబుల్ ఎత్తుకోగా బిగ్గరగా ఏడవడంతో.. ఆమెను బుజ్జగించేందుకు ఇద్దరు మహిళా పోలీసులు ప్రయత్నించారు. అయినా ఏడుపు ఆపకపోవడంతో ఆ చిన్నారిని తల్లితో పాటు పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. దీంతో ఆమె తన కూతురిని ఎత్తుకుని ఓటు వేసింది. ఒకరికి బదులు మరొకరు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి టీఎన్జీఓ భవన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీటీసీ కె.సునీతకు బదులు అదే పేరు ఉన్న మరో జెడ్పీటీసీ ఓటేయడం గందరగోళానికి దారితీసింది. ఆమె అధికారులతో వాగ్వాదాని కి దిగగా..వారు పొరపాటును గ్రహించి తప్పును సరిదిద్దడంతో వివాదం సద్దుమణిగింది. లండన్ నుంచి రాక ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి ఎంపీటీసీగా టీఆర్ఎస్ తరఫున గెలిచిన చిలుకూరి శ్యామల ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లారు. అయితే, పార్టీ తరఫున గెలిచిన వారంతా తప్పక ఓటు వేయాలని అధిష్టానం సూచించడంతో ఆమె కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం అక్కడి నుంచి కల్లూరు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఓటు వేశారు. పుట్టెడు శోకంలోనూ.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం బాలాజీనగర్‌కు చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యుడు మెఘావత్ బన్సీలాల్ కుమారుడు రమేష్ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అంత్యక్రియలు ముగిసిన వెంటనే పుట్టెడు శోకాన్నీ దిగమింగుకుంటూ బన్సీలాల్ బంధువుల సాయంతో వచ్చి దేవరకొండలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. పోలింగ్ కేంద్రం వద్ద తోటి ఎంపీటీసీ సభ్యులను చూసి బోరున విలపించాడు. ఓటేసి వెళ్లి కన్యాదానం కూతురి పెళ్లి ఉన్నా బాధ్యత మరవకుండా ఓటేశాడు ఉమ్మ డి మెదక్ జిల్లా అందోలు మండల పరిధిలోని రాంసానిపల్లి ఎంపీటీసీ సభ్యుడు గజేందర్‌రెడ్డి. ఉదయం 8.30 గంటలకు ఓటేసిన ఆయన, జోగిపేటకు 30 కి.మీ దూరంలో ఉన్న సంగారెడ్డిలోని ఫంక్షన్ హాలుకు వెళ్లి కన్యాదానం చేశాడు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. ఉమ్మడి మెదక్ జిల్లా కొల్చారం జెడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల సోదరుడు మధుసూదన్ సంగారె డ్డిలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. తమ్ముడి మరణ వార్తతో కుప్పకూలిన మేఘమాల, దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ఓటేసిన అనంతరం స్వగ్రామానికి వెళ్లారు. -
‘నువ్వెంత అంటే నువ్వెంత’..పైలట్, పట్నం వాగ్వాదం
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ‘నువ్వెంత అంటే నువ్వెంత’అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఒకదశలో వారు కొట్టుకునేంత పనిచేశారు. ఎమ్మెల్సీ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారంటూ ఎమ్మెల్యే వర్గం అభ్యంతరం తెలపడం గొడవకు దారితీసింది. ఈ ఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తాండూరులో గ్రామపంచాయతీలకు ఫాగింగ్ మెషీన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీలు పట్నం, సురభి వాణీదేవి హాజరయ్యారు. వేదికపై ఎమ్మెల్సీ వర్గానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు ఆశీనులు కాగా, ఎమ్మెల్యే వర్గాని కి చెందిన సర్పంచ్ రాములు, ఎంపీటీసీ సాయిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పెద్దేముల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్ అభ్యంతరం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం హాజరైతే అభ్యంతరమెందుకని మున్సిపల్ చైర్పర్సన్ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ‘నువ్వెంత అంటే నువ్వెంత’అంటూ వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. నేతల గొడవపట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఇరువర్గాల నేతలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
మండలి ‘స్థానికం’లో అన్నీ గెలవాలి.. పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆరు శాసనమండలి స్థానిక కోటా స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలవాలని పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పార్టీ ఎంపీలతో భేటీలో ఈ అంశంపై టీఆర్ఎస్ అధినేత ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. సంఖ్యాపరంగా టీఆర్ఎస్కే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నందున గెలుపు గురించి అనుమానాలు అక్కర్లేనప్పటికీ పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు జరిగే స్థానాల పరిధిలోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు అవసరమైతే ఓటర్లు బస చేసిన క్యాంపులకు వెళ్లి ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో భేటీ కావాలని ఆయన సూచించినట్లు తెలిసింది. నిధులు, విధులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో నెలకొన్న అసంతృప్తిని కొందరు ఎంపీలు ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి వేతనాల పెంపుతోపాటు కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా, మండల పరిషత్‌ల అభివృద్ధికి రూ. 250 కోట్లను తక్షణమే విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేకే, నామా నాగేశ్వర్రావు, కొత్తా ప్రభాకర్‌రెడ్డితోపాటు ఇతర ఎంపీలు, మంత్రులు హరీశ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి పాల్గొన్నారు. -
స్నేహ‘హస్తం’.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులకు కాంగ్రెస్ మద్దతు..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనే పోటీకి పరిమితమైన కాంగ్రెస్.. మిగిలిన చోట్ల స్వతంత్రులకు మద్దతు ప్రకటించాలని యోచిస్తోంది. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో పార్టీ అభ్యర్థులున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్‌లోని రెండు స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం సీరియస్‌గా ఆలోచిస్తోం ది. అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున స్థానిక ప్రజాప్రతి నిధులు ఉన్నందున వారిని కాపాడుకునేందుకు పరోక్షంగానైనా పార్టీ బరిలో ఉండాలనే ప్రతిపాదనను సీనియర్లు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యం లో ఆదిలాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థిని పుష్పారాణికి అధికారికంగానే కాంగ్రెస్ మద్దతిస్తోంది. అయితే నల్లగొండలో స్వతంత్రులకు మద్దతివ్వడం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రుల్లో ఇద్దరు కాంగ్రెస్ జెడ్పీటీసీలే ఉన్నారు. కుడుదుల నగేశ్(ఆలేరు), వంగూరి లక్ష్మయ్య (నల్ల గొండ)లు కాంగ్రెస్ గుర్తుపైనే గెలిచారు. ఈ నేప థ్యంలో వారికి పార్టీ బీ–ఫారం ఇవ్వకుండా స్వతంత్రుల కోటాలో మద్దతు ప్రకటించడం సమస్యలు తెస్తుందనే భావన వ్యక్తమవుతోంది. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. కరీంనగర్లో స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల మద్దతు ఉండటం తో మరో అభ్యర్థికి మద్దతిచ్చే అంశాన్ని టీపీసీసీ యోచిస్తోంది. ఎన్నికలు జరిగే నాటికి ప్రతి చోటా ఒక అభ్యర్థికి పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. -
తేలిన స్థానిక సంస్థల మండలి ఓటర్ల లెక్క.. 6 స్థానాల్లో 5,326 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న ఆరు స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరు స్థానాల్లో 2,997 మంది మహిళలు, 2,329 మంది పురుషులు.. కలిపి మొత్తం 5,326 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీలు 3,223, జెడ్పీటీసీలు 325, మున్సిపల్ కౌన్సిలర్లు 1,544, కార్పొరేటర్లు 169, ఎక్స్అఫీషియో ఓటర్లు 65 మంది ఉన్నారు. రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల అథారిటీల (12 సీట్లకు) మండలి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, ఆరు సీట్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన ఆదిలాబాద్, కరీంనగర్ (2 సీట్లు), మెదక్, నల్లగొండ, ఖమ్మం స్థానాలకు వచ్చే నెల 10న పోలింగ్ నిర్వహించి 12న ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ స్థానాల్లో ఓటేయనున్న వారి వివరాలను పట్టికలో చూడవచ్చు.. -
ఆ ఆరూ కారెక్కాల్సిందే.. మండలి స్థానిక కోటా సీట్లపై టీఆర్ఎస్ పట్టు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకుగాను పోరు తప్పని ఆరింటినీ తన ఖాతాలో వేసుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో పావులు కదుపుతోంది. విపక్షాల వ్యూహాలకు కౌంటర్ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలవారీగా ఎన్నిక జరుగుతుండటంతో ఆయా జిల్లాల మంత్రులకు సమన్వయ బాధ్యతలు, ప్రణాళికను అమలు చేసే పనిని పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అప్పగించారు. మెదక్, ఖమ్మం మినహా మిగిలిన నాలుగింటిలోని స్వతంత్ర అభ్యర్థుల వెనుక బీజేపీ, కాంగ్రెస్ నేతల హస్తం ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఆయా పార్టీలకున్న బలాబలాలను అంచనా వేస్తోంది. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో జిల్లా మంత్రులు భేటీ అయి ఎన్నికల వ్యూహాన్ని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాలలోని పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరినవారిని కూడా కలుపుకుంటే సంఖ్యాపరంగా అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్దే ఆధిపత్యం. నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడితో సమావేశం జరిగింది. ఆ జిల్లాలో ఆరుగురు స్వతంత్రులు బరిలో ఉన్నా వారి ప్రభావం పెద్దగా ఉండదని సమావేశం అభిప్రాయపడింది. ఖమ్మంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి ఖమ్మం బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను మంత్రి పువ్వాడ ఒక్కరే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మధిర, భద్రాచలం ఎమ్మెల్యేలు మినహా మరో ఏడుగురు తర్వాత అధికార పార్టీలో చేరారు. ఇక్కడ టీఆర్ఎస్కు ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలమున్నా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు అధిష్టానానికి ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చేనెల ఒకటి తర్వాత కార్పొరేటర్ల క్యాంపు కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలతో కలుపుకొని మొత్తం పది మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో టీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఇప్పటికే పార్టీకి చెందిన ఎంపీటీసీలు హైదరాబాద్ శివారులోని క్యాంపులకు తరలిపోగా, డిసెంబర్ మొదటివారంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా బెంగళూరు టూర్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెదక్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు బీజేపీలో చేరిన ఓ కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే నియోజకవర్గాలవారీగా ఓటర్లతో భేటీ అవుతున్నారు. ఐదో తేదీ తర్వాత ఇక్కడి నుంచి క్యాంపులకు తరలేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఆరుచోట్లా విపక్షనేతల మంత్రాంగం కరీంనగర్లో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమకు అనుకూలంగా ఉండే స్వతంత్రులను బరిలోకి దించి టీఆర్ఎస్ ఓటమికి పథక రచన చేస్తున్నారు. మెదక్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మద్దతు పలుకుతున్నారు. పుష్పరాణికి ఎంపీ సోయం బాపూరావుతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దన్నుగా ఉన్నట్లు సమాచారం. నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సోదరుల అండతో ఒకరిద్దరు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఖమ్మంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పోడెం వీరయ్య కాంగ్రెస్ అభ్యర్థికి ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. -
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు
-
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్.. మండలికి రాజ్యసభ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనదైన శైలిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆశావహుల జాబితాలో లేని వారిని తెరపైకి తెచ్చి అందరినీ విస్మయానికి గురిచేశారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వరుసగా రెండో పర్యాయం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో గవర్నర్ కోటా కింద మంత్రివర్గం సిఫారసు చేసిన పాడి కౌశిక్‌రెడ్డి.. అభ్యర్థిత్వం ఆమోదం పొందక పోవడంతో ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ను అనూహ్యంగానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. సుమారు దశాబ్దంన్నర క్రితం పార్టీలో చేరిన ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావును ఎంపిక చేయడం ద్వారా గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. అలాగే సోమవారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి కూడా అనూహ్యంగానే ఎమ్మెల్యే కోటాలో అవకాశం చేజిక్కించుకుని నామినేషన్ దాఖలు చేశారు. చివరి నిమిషం వరకు గోప్యత మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందనగా.. ఉదయం 10 గంటల వరకు అభ్యర్థుల జాబితాపై గోప్యత పాటించారు. చివరకు ఎంపికకు సంబంధించి అధికారికంగా ఎలాంటి జాబితా విడుదల చేయకుండా నేరుగా అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్ల్లపల్లి రవీందర్రావు అభ్యర్థిత్వం సోమవారమే ఖరారు కాగా, మిగతా నాలుగు స్థానాలకు సంబంధించి సోమవారం అర్ధరాత్రి వరకు పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులందరూ మంగళవారం ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకోగా, ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం అభ్యర్థులతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వీరికి మద్దతుగా నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేలు ఎవరూ సంతకాలు చేయకపోవడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురి కానున్నాయి. ఇతర పార్టీలేవీ బరిలో నిలవలేదు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉండటంతో, బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశముంది. రెడ్డి సామాజికవర్గానికి పెద్దపీట ఆరుగురిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి, మరొకరు వెలమ (తక్కల్లపల్లి) సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం కాగా, బండా ప్రకాశ్ ముదిరాజ్ బీసీ, కడియం శ్రీహరి ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎంపికయ్యారు. ఆరు స్థానాలకు గాను రెడ్లు, బీసీలకు రెండు చొప్పున, వెలమ, ఎస్సీ కేటగిరీలో ఒకటి చొప్పున అవకాశం దక్కుతుందని తొలుత అంచనా వేశారు. అయితే రెడ్డి సామాజికవర్గం నుంచి ముగ్గురికి అవకాశం దక్కడంతో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆశావహులపై ప్రభావం చూపింది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు పద్మశాలి సామాజికవర్గం నుంచి ఎల్.రమణ, విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారికి అవకాశం దక్కుతుందని భావించారు. బీసీ కేటగిరీలో మున్నూరు కాపు కులానికి చెందిన ఆకుల లలిత, పీఎల్ శ్రీనివాస్ కూడా సీటు ఆశించారు. కానీ వీరికి అవకాశం లభించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి కూడా ఆశావహుల జాబితాలో ఉన్నా ఎంపిక కాలేదు. అయితే మధుసూధనాచారిని గవర్నర్ కోటాలో, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను స్థానిక సంస్థల (మెదక్) కోటాలో ఎంపిక చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలపై నేడు కాంగ్రెస్ నిర్ణయం చివరి వరకు ఎదురుచూపులే! -
పెరిగిన ఎమ్మెల్సీ వేడి.. తెరపైకి ఆ ముగ్గురి పేర్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరిగింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థుల జాబితా ఖరారైన నేపథ్యంలో పలువురికి ప్రగతిభవన్ నుంచి సీఎం నేరుగా ఫోన్‌చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో పన్నెండు, ఎమ్మెల్యే కోటాలో ఆరు సీట్లను దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం నాలుగు సీట్లు దక్కనున్నాయి. వాస్తవానికి ఆరుగురు అభ్యర్థుల్లో బీసీ సామాజికవర్గం నుంచి ఎల్.రమణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి పాడి కౌశిక్‌రెడ్డికి స్థానాలు ఖరారయ్యాయని సమాచారం. ఇటీవల గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేట్చేసినా.. ఆయనపై ఉన్న కేసుల కారణంగా అది వాస్తవరూపం దాల్చలేదు. దీంతో ఎమ్మెల్యే కోటాలో అధిష్టానం కౌశిక్‌కు బెర్త్ కన్ఫర్మ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. చదవండి: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. వెంటనే ఆమోదం స్థానిక సంస్థల కోటాలో తెరపైకి ముగ్గురు! త్వరలో స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి జిల్లా నుంచి రెండు స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రెండుస్థానాల ఆశావహుల జాబితా కూడా రెడీ అయిందని సమాచారం. ప్రస్తుతం ఓసీ (వెలమ సామాజికవర్గం) భానుప్రసాదరావు, బీసీ (ఎల్లాపు) నుంచి నారదాసు లక్ష్మణరావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఈసారి వెలమసామాజికవర్గానికి చెందిన చెన్నాడి సుధాకర్‌రావు, బీసీ (యాదవ) నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు, మాజీ జెడ్పీటీసీ వీర్ల వెంకటేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. భాను ప్రసాద్‌కు ఎమ్మెల్యే టికెట్హామీ దక్కడంతో ఆయన పోటీ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారదాసు లక్ష్మ ణరావుకు ఇప్పటికే రెండుసార్లు అవకాశం కల్పించిన నేపథ్యంలో మూడోసారి ఎమ్మెల్సీ టికెట్ దక్కే చాన్స్‌లు దాదాపుగా లేవనే చెబుతున్నారు. పార్టీ మొత్తంగా భర్తీ చేయనున్న 18 సీట్లలో నాలుగు సీట్లు ఉమ్మడి జిల్లా నుంచి భర్తీ కానుండటం గమనార్హం. హుజూరాబాద్ ఓటమిని మరిచిపోయేలా.. మరోవైపు పార్టీలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ టమి తీరని నైరాశ్యాన్ని నింపింది. నాలుగైదు నెలలపాటు భారీ మెజారిటీతో గెలుస్తామన్న ధీమాగా ఉన్న పార్టీకి ఈటల విజయం సాధించడంతో ఊ హించని భంగపాటు ఎదురైంది. దీంతో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా ఢీలా పడ్డాయి. అందుకే, ఆ నష్టాన్ని పూడ్చాలంటే.. రాబోయే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటాలో సీట్లు కైవసం చేసుకుని తిరిగి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాలి. అందుకే, పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రతిపక్షాలను తిరిగి ఆత్మరక్షణ ధోరణిలో పడేసేలా పావులు కదుపుతోంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆది నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాపై ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు సడలనీయవద్దన్న పట్టుదలతో పకడ్బందీగా ముందుకు సాగుతోంది. -
MLC Election Results: సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న టీఆర్ఎస్
సాక్షి, నల్గొండ: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆయన ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నపై గెలుపొందారు. కాగా మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై ఆమె గెలుపొందారు. చదవండి: MLC Election Results: సురభి వాణిదేవి విజయం -
కౌంటింగ్.. ఇంకా వెయిటింగ్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటా స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై మూడు రోజులు గడుస్తున్నా తుది ఫలితం తేలకపోవడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో సహా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పోలై... చెల్లుబాటయ్యే ఓట్లలో 50% + ఒక ఓటును పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఏడురౌండ్లలో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా... ఏ అభ్యర్థీ 50% ఓట్లు (విజ యానికి కావాల్సిన నిర్ణీత కోటా ఓట్లు) సాధించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. అతితక్కువ ఓట్లు సాధించిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ (ఆఖరి స్థానంలో నిలిచిన అభ్యర్థిని మొదట ఎలిమినేట్ చేస్తారు. అలా కింది నుంచి పైకి వెళుతూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తారు), వారి బ్యాలెట్లో ద్వితీయ ప్రాధాన్యత ఓటును లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ (ఎలిమినేషన్ విధానం) కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానంలో శనివారం మధ్యాహ్నం వరకు, ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’స్థానంలో శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశముందని లెక్కింపు సరళి వెల్లడిస్తోంది. అయితే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోనూ పూర్తయిన తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా ముగ్గురు అభ్యర్థుల నడుమ చివరి వరకు గెలుపు దోబూచులాడే అవకాశముందని స్పష్టమవుతోంది. రెండు స్థానాల్లోనూ శనివారం రాత్రికి తుది ఫలితం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. ‘హైదరాబాద్’లో ఇద్దరి నడుమ హోరాహోరీ ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 93 అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎస్.వాణీదేవి (టీఆర్ఎస్) ఒకటో, ఎన్.రామచందర్‌రావు (బీజేపీ) రెండో స్థానంలో నిలిచారు. దీంతో చివరి నిముషం వరకు ఈ ఇద్దరి నడుమ ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశముంది. మూడో స్థానంలో నిలిచిన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ (స్వతంత్ర), నాలుగో స్థానంలో నిలిచిన జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్) బ్యాలెట్లలో వచ్చే రెండో ప్రాధాన్యత ఓట్లపై వాణీదేవి, రాంచందర్‌రావు గెలుపోటములు ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో చిన్నారెడ్డి, నాగేశ్వర్లు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తే వారి బ్యాలెట్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వాణీదేవి, రామచందర్‌రావు నడుమ ఎవరికి ఎక్కువగా వెళితే వారు విజేత అయ్యే అవకాశముంది. విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు రావాలంటే వాణీదేవి మరో 17.57 శాతం, రాంచందర్‌రావు మరో 19 శాతం ఓట్లు సాధించాల్సి ఉంది. నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు ఇద్దరికీ కలిసి 25.26 శాతం తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, స్వతంత్ర అభ్యర్థులు జి.హర్షవర్దన్‌రెడ్డి, అన్వర్‌ఖాన్, వేముల తిరుమల బ్యాలెట్లలో వచ్చే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కూడా కొంత మేర వాణీదేవి, రాంచందర్‌రావుకు కీలకం కానున్నాయి. ‘నల్లగొండ’లో ఆ ముగ్గురు నడుమ పోటీ ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభధ్రుల నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) మొదటి స్థానంలో, తీన్మార్ మల్లన్న (స్వతంత్ర) రెండు, ప్రొఫెసర్ కోదండరాం (టీజేఎస్) మూడో స్థానంలో నిలిచారు. అయితే ప్రథమ ప్రాధాన్యత ఓట్ల సంఖ్య పరంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న కంటే సుమారు 7.5 శాతం ఓట్లు అదనంగా సాధించారు. కోదండరాం కంటే తీన్మార్ మల్లన్న సుమారు 2.5 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. పల్లా ముందంజలో ఉన్నా మల్లన్న, కోదండరాంలకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తే...ప్రధాన పోటీదారుల స్థానాలు తారుమారయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ), ఎస్.రాములు నాయక్ (కాంగ్రెస్) బ్యాలెట్స్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మల్లన్న, కోదండరాం గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. వీరితో పాటు జయసారధిరెడ్డి (సీపీఐ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ), రాణీరుద్రమ (యువ తెలంగాణ) బ్యాలెట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా పల్లా, మల్లన్న, కోదండరాం సాధించే ఫలితంపై కొంత మేర ప్రభావం చూపే అవకాశముంది. తేలని లెక్క.. కొనసాగుతున్న ఉత్కంఠ పట్టభద్రుల స్థానాల కోటా ఓట్ల లెక్కింపు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ఎవరు విజేతగా నిలుస్తారనే అంశంపై స్పష్టత రాకపోవడంతో అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జన సామాన్యానికి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ విధానంపై అవగాహన లేకపోవడంతో ఎవరికి వారుగా తుది ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై ఆరా తీస్తున్నారు. ‘హైదరాబాద్’లో 93, ‘నల్గొండ’లో 71 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఎలిమినేషన్ విధానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నెమ్మదిగా జరుగుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియలో శుక్రవారం రాత్రికి రెండు స్థానాల్లోనూ కేవలం ఐదారుగురు అభ్యర్థులు మాత్రమే లెక్కింపు బరిలో మిగిలే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు ధీటుగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ‘హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్‌నగర్’ పోటీ చేసిన అభ్యర్థులు ః 93 మొత్తం ఓట్లు ః 5,31,268 పోలైన ఓట్లు ః 3,58,348 చెల్లని ఓట్లు ః 21,309 చెల్లిన ఓట్లు ః 3,37,039 గెలిచేందుకు రావాల్సిన ఓట్లు ః 1,68,520 ఎస్.వాణిదేవి (టీఆర్ఎస్) ః 1,12,689 (33.43 శాతం) ఎన్.రాంచందర్‌రావు (బీజేపీ) ః 1,04,668 (31 శాతం) కె.నాగేశ్వర్ (స్వతంత్ర) ః 53,620 (15.9 శాతం) చిన్నారెడ్డి (కాంగ్రెస్) ః 31,554 (9.36 శాతం) తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ‘నల్గొండ– ఖమ్మం– వరంగల్’ పోటీ చేసిన అభ్యర్థులు ః71 మొత్తం ఓట్లు ః 5,05,565 పోలైన ఓట్లు ః 3,87,969 చెల్లని ఓట్లు ః 21,636 చెల్లిన ఓట్లు ః 3,66,333 గెలిచేందుకు రావాల్సిన ఓట్లు ః 1,83,167 పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) ః 1,10,840 (30.25 శాతం) తీన్మార్ మల్లన్న (స్వతంత్ర) ః 83,290 (22.73 శాతం) కోదండరాం (టీజేఎస్) ః 70,072 (19.12 శాతం) గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ) ః 39,107 (10.67శాతం) రాములు నాయక్(కాంగ్రెస్) : 27,588 (7.53 శాతం) శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు కలుపుకొని తాజాగా ప్రధాన అభ్యర్థుల ఓట్ల వివరాలు ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) ః 1,11,190 ఓట్లు తీన్మార్ మల్లన్న (స్వతంత్ర) ః 83,629 ఓట్లు కోదండరాం (టీజేఎస్) ః 70,472 ఓట్లు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ) ః 39, 268 ఓట్లు రాములు నాయక్(కాంగ్రెస్) : 27, 713 ఓట్లు ‘హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్‌నగర్’ ఎస్.వాణిదేవి (టీఆర్ఎస్) ః 1,12,802 ఓట్లు ఎన్.రాంచందర్‌రావు (బీజేపీ) ః 1,04,965 ఓట్లు కె.నాగేశ్వర్ (స్వతంత్ర) ః 53,687 ఓట్లు చిన్నారెడ్డి (కాంగ్రెస్) ః 31,602 ఓట్లు ఎలిమినేషన్ ఇలా సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. మొత్తం పోలైన ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగం + ఒక ఓటు... విజయానికి కావాల్సిన నిర్ణీత కోటా (50%+1) అవుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరూ ఈ కోటాను చేరుకోకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు పది మంది అభ్యర్థులు రంగంలో ఉంటే.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని (అంటే 10వ స్థానంలో నిలిచిన అభ్యర్థిని) మొదట ఎలిమినేట్ చేస్తూ...ఆ అభ్యర్థి బ్యాలెట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పైన ఉండే తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఎవరెవరికి వస్తే వారికి ఆ ఓట్లను కలుపుతారు. పదో వ్యక్తి ఎలిమినేట్ అవడంతో.. 9 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉన్న అభ్యర్థికి చెందిన బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పైన ఉన్న ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఎవరికి వస్తే వారికి ఆ ఓట్లను కలిపి... వారికి వచ్చిన మొత్తం ఓట్లుగా పరిగణిస్తారు (ఎలిమినేట్ అయిన పదో అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్లలో ఒకవేళ తొమ్మిదవ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చి ఉంటే.. ఆ బ్యాలెట్ పేపర్లలోని మూడో ప్రాధాన్యత ఓట్లను పైనున్న ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఎవరికి వస్తే వారికి కలుపుతారు). తర్వాత 8వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ఇతనికి చెందిన బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పైన ఉండే ఏడుగురు అభ్యర్థుల్లో ఎవరెవరికి వస్తే.. వారికి ఆ ఓట్లను కలుపుతారు. ఇలా ఎలిమినేట్ ఆయ్యే క్రమంలో పైనున్న స్థానాల్లోని అభ్యర్థుల్లో ఎవరికైనా 50 శాతం ఓట్లతో పాటు ఒక్క ఓటు అదనంగా వచ్చినా .. వారిని విజేతగా ప్రకటిస్తారు. అక్కడితో (ఆ ఎలిమినేషన్ రౌండ్‌తో) కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేస్తారు. ఇద్దరే మిగిలితే... ఎక్కువ ఓట్లున్న వారే విజేత నిర్ణీత కోటా ఓట్లను ఎవరూ సాధించలేని పక్షంలో పోటీలో ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ ఇద్దరిలో ఎవరికీ నిర్ణీత కోటా ఓట్లు (50 శాతం + 1 ఓటు) రాకపోయినా సరే... ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటే వారినే విజేతగా ప్రకటిస్తారని నల్లగొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని విజేతను ప్రకటిస్తారని వెల్లడించారు. -
కొండా వర్సెస్ పట్నం
మరో బిగ్ ఫైట్‌కు ఉమ్మడి జిల్లా వేదిక కానుంది. హోరాహోరీగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన నెల రోజులకే ఇద్దరు ఉద్ధండులు అమీతుమీ తేల్చుకునేందుకు రంగం సిద్ధమైంది. కొంతకాలంగా ఒకరిపై ఒకరు అంతర్గతంగా కారాలుమిరియాలు నూరుతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి.. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడనున్నారు. సాక్షి, రంగారెడ్డి: జిల్లాస్థానిక కోటాలో ఈనెల 31న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఆదివారం ఖరారు చేసింది. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో దిగనున్నారు. మహేందర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొదటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొనడంతో.. పట్నంపై పైచేయి సాధించేందుకు కొండా కదన కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామంతో జిల్లా రాజకీయ యవనికపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఆది నుంచి వైరమే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన కొండా.. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున చేవెళ్ల లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. ఇదే సమయంలో అప్పటి వరకు టీడీపీలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పట్నం చేరికపై కొండా అయిష్టంగానే ఉన్నారు. 2014 జనరల్ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీసెగ్మెంట్ నుంచి గెలుపొందిన పట్నం కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈనేపథ్యంలో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు షురూ మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపడం మొదలయ్యాయి. దీనికితోడు నియోజకవర్గంలో తనను మహేందర్ రెడ్డి తిరగనివ్వడం లేదని, తన అనుచరులను వేధింపులకు గురిచేస్తున్నారని అంతర్గతంగా కొండా సీరియస్ కావడానికి ప్రధాన కారణమైంది. ఈ వైరం కాస్త ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో కారుకు గుడ్‌బై చెప్పిన విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన పట్నం.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కొండా ప్రధాన అనుచరుడు పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో ఆయన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కొండానే ఎందుకు? ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. వీరు బరిలో దిగేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్లయిన ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లను ప్రభావితం చేయడం కష్టం. అలాగే టీఆర్ఎస్ ఓటర్ల సంఖ్యా బలం అధికంగా ఉండటంతో.. తమకు ఓటమి తప్పదని వారు భావిస్తున్నారు. పైగా క్యాంపుల నిర్వహణ డబ్బులతో ముడిపడి ఉన్న వ్యవహారం. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న నేతలు పోటీ చేసేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఎవరూ ముందుకు రాకపోవడం, తన రాజకీయ శత్రువుగా భావిస్తున్న మహేందర్ రెడ్డి అధికార పార్టీ తరఫున బరిలో ఉండడంతో కొండా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీలో పట్టు ఉండటంతోపాటు ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన.. అధికార పార్టీ క్యాంపు రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారని పార్టీ కూడా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచే వీలుంది. ఒకవేళ విశ్వేశ్వర్‌రెడ్డి కాకపోతే ఆయన సతీమణి సంగీతారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. -
‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘స్థానిక’ సంస్థల వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి(వరికోలు) శ్రీనివాస్‌రెడ్డికే అవకాశం దక్కింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఆదివారం ప్రకటించిన కేసీఆర్.. వరంగల్‌కు శ్రీనివాస్‌రెడ్డి పేరును కూడా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ‘పోచంపల్లి’ పేరే ప్రచారంలో ఉంది. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షు డు తక్కళ్లపెల్లి రవిందర్ సైతం తనవంతు ప్రయత్నం చేశారు. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌లకు క్లాస్మేట్గా వారితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు కలిగిన శ్రీనివాస్‌రెడ్డి మొదటి నుంచి కేసీఆర్ కుటుంబానికి విధేయుడు, విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపిన కేసీఆర్ శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. పాత వరంగల్ జిల్లాలోని పరకాల మండలం వరికోలు గ్రామానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ‘పోచంపల్లి’ నేపథ్యం ఇదీ.. పాత వరంగల్ జిల్లాలోని పరకాల మండలం వరికోలు గ్రామానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరికోలు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, 8 నుంచి 10వ తరగతి వరకు పరకాల సీఎస్ఐ మిషన్ హైస్కూల్లో విద్యనభ్యసించారు. ఇంటర్మీడిఝెట్(1992–1994) హన్మకొండలోని నాగార్జున ప్రైవేట్ జూనియర్ కాలేజీ, డిగ్రీ హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో బీకాం(1994–1996) చేశారు. ఎంబీఏ పుణేలోని వీ.కె పటేల్ ఫౌండేషన్ కళాశాలలో జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి చదివిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఆయన 2001 సంవత్సరం నుంచి టీఆర్ఎస్లో ఒక కార్యకర్తగా పనిచేస్తూ ప్రతి పనిని చేసుకుంటూ వచ్చారు. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కేటీఆర్ రోడ్ షోలకు ఇన్చార్జిగా ఉండి కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల కోసం మూడు పార్లమెంట్ నియోజవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలకు ఇన్చార్జిగా వ్యవహించి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, జూబ్లీ హిల్స్, గోశామహల్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. బయోడేటా.. పేరు : పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పుట్టిన తేదీ : ఏప్రిల్ 15, 1973 భార్య : మమత రెడ్డి కూతురు : అశ్రితరెడ్డి తండ్రి : జనార్దన్‌రెడ్డి తల్లి : సమ్మక్క తోబుట్టువులు : ఇద్దరు అక్కలు, ఒక చెల్లి,పెద్దక్క నల్ల స్వరూపరాణిరెడ్డి(47 డివిజన్ కార్పొరేటర్), బావ : సుధాకర్‌రెడ్డి రిటైర్డ్ ఇంజినీర్, రెండో అక్క పోరెడ్డి విజయనిర్మల (గహిణి), బావః పోరెడ్డి వాసుదేవరెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలర్, ములుగు విద్యాభ్యాసం.. ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరికోలు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల 8 నుంచి 10వ తరగతి వరకు సీఎస్ఐ మిషన్ హైస్కూల్, పరకాల ఇంటర్మీడిఝెట్ 1992–94 సంవత్సరం హన్మకొండలోని నాగార్జున ప్రైవేట్ జూనియర్ కాలేజీ డిగ్రీ హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో బీకాం(1994–96) ఎంబీఏ పుణేలోని వి.కె పటేల్ ఫౌండేషన్ కళాశాల 2001 సంవత్సరం నుంచి టీఆర్ఎస్లో కార్యకర్తగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉంటూ వారిని జైలు నుంచి బయటకు తీసుకావడంలో కీలక పాత్ర షోషించారు. విద్యార్థులతో కలిసి ఉద్యమంలో పని చేశారు. -
మండలి టికెట్ మహేందర్‌రెడ్డికే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న అంశంపై దాదాపు స్పష్టత వచ్చింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన పేరును ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ స్థానంలో ఎమ్మెల్సీగా కొనసాగిన మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి నరేందర్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, అధికార పార్టీ తరఫున బరిలో ఎవరు ఉంటారన్నది ఇప్పటి వరకు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ మధ్యలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరే సమయంలో పార్టీ అధిష్టానం నుంచి సబితమ్మకు మంత్రి పదవితోపాటు కార్తీక్‌కు ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కార్తీక్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే కార్తీక్ మాత్రం ఎమ్మెల్సీ బరిలో లేరని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ ఎవరి పేరు ఖరారు చేసినా తమ మద్దతు ఉంటుందని చెబుతున్నాయి. సీఎం భరోసా మేరకు.. అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మహేందర్‌రెడ్డి.. చేవెళ్ల లోక్‌సభ టికెట్ ఆశించారు. దాదాపు ఈ టికెట్ ఆయనకే ఖరారైందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, అనూహ్యంగా మహేందర్‌రెడ్డి మిత్రుడు పారిశ్రామికవేత్త డాక్టర్ రంజిత్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఇలా చివరి నిమిషంలో టికెట్ చేజారిన మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని సీఎం కేసీఆర్ అప్పుడు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు మహేందర్ రెడ్డి వైపు సీఎం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. నేడు కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై కాంగ్రెస్ పెద్దలు శనివారం ప్రత్యేకంగా గాంధీభవన్‌లో భేటీ కానున్నారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల అభ్యర్థులను తేల్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిసింది. జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిద్దిరిలో ఒకరికి అవకాశం ఇస్తారా? లేదంటే మరొకరిని తెరమీదకు తీసుకొస్తారా? అనేది ఈ భేటీలో తేలనుంది. -
కాంగ్రెస్‌కు పునర్‘జీవన్’
సాక్షి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిని అల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి శాసనమండలి ఎన్నికలు ఊపిరిలూదాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్‌కు ఊరట లభించింది. లోకసభ ఎన్నికలకు పదిహేను రోజుల ముందు జీవన్‌రెడ్డి గెలుపు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి ఘన విజయం పార్టీకి ఊరటనిచ్చింది. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా గల్లంతవడం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిదింటిలో టీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా ఇటీవల టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో కనీస ప్రాధాన్యత లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కూడా పార్టీని వీడుతుండడం, ఉద్ధండ నేతలు కూడా అందులో ఉండడం క్యాడర్‌ను కలవరపరుస్తోంది. కొంతమంది టీఆర్ఎస్లోకి, మరికొందరు బీజేపీలోకి చేరుతుండడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. రోజుకో ఎమ్మెల్యే, పూటకో నాయకుడు పార్టీని వీడుతుండడంతో, ఇక తెలంగాణలో టీడీపీ తరహా పరిస్థితి కాంగ్రెస్‌కు కూడా ఎదురవబోతుందనే ప్రచారం చోటుచేసుకొంది. ఈ సమయంలో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అనూహ్యంగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి పోటీ చేయడం అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూసిన జీవన్‌రెడ్డి, ఏ ధైర్యంతో ఎమ్మెల్సీకి పోటీచేస్తున్నారనే మాటలు మొదట్లో వినిపించాయి. కాని పట్టువదలని విక్రమార్కుడిలా జీవన్‌రెడ్డి పోటీ చేయడమే కాకుండా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుమార్లు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయన దూకుడును చూసిన పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగస్వామ్యులయ్యారు. ఎమ్మెల్సీ పోలింగ్ రోజు కేంద్రాల వద్ద ఉండి కాంగ్రెస్ శ్రేణులు జీవన్‌రెడ్డికి ఓటు అభ్యర్థించారు. జీవన్‌రెడ్డితోపాటు బీజేపీ అభ్యర్థి పి.సుగుణాకర్‌రావు, యువతెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ పోటీ చేశారు. కాగా టీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకుండా, పోటీకి దూరంగా ఉంటున్నట్లు ముందుగా ప్రకటించింది. కానీ స్థానిక పరిస్థితుల కారణంగా మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో చంద్రశేఖర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కాకుండా ఆ పార్టీ మద్దతుతో పోటీకి దిగారు. ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులతో సమన్వయం చేసుకోవడంలో విఫలమైనట్లు ఆ పార్టీ నేతలే అంటున్నారు. చివరకు చంద్రశేఖర్‌గౌడ్‌పై జీవన్‌రెడ్డి భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యతలోనే విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను, అన్ని రౌండ్లలోనూ జీవన్‌రెడ్డి సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించడం విశేషం. కాగా జీవన్‌రెడ్డి వ్యక్తిగత చరిష్మాకు కాంగ్రెస్ పార్టీ తోడు కావడంతో ఘన విజయం సాధ్యపడినట్లు పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఏదేమైనా లోకసభ ఎన్నికలు మరో పదిహేను రోజుల్లో జరగనున్న నేపథ్యంలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించడం ఆ పార్టీకి జవసత్వాలు నింపినట్లయింది. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరుస విజయాలతో దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్కు షాక్ తగిలింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమిపాలైయ్యారు. యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 18885 ఓట్లు పోలవ్వగా నర్సిరెడ్డికి 8976 ఓట్లు రాగా.. పూల రవీందర్‌కు 6279 ఓట్ల వచ్చాయి. గెలుపునకు కావల్సింది 9014 కావడంతో 38 ఓట్ల దూరంలో నర్సిరెడ్డి నిలిచిపోయారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లలో నర్సిరెడ్డి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. పూల రవీందర్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నర్సిరెడ్డి గతంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. -
నేడు ‘మండలి’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు/ ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపా ధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యా య నియోజకవర్గాల ఓట్లను కరీంనగర్ పట్టణం లోని ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్లను నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని టీఎస్‌డబ్ల్యూసీ గోదాములో లెక్కించనున్నారు. పోలింగ్‌ను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించడంతో ఫలితాల వెల్లడికి ఆలస్యం కానుంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సీఈఓ రజత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం క్లిక్చేయండి - ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్ -
పోలింగ్ నేడే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాసనమండలిలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ సీట్ల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నాలుగు పాత జిల్లాల్లోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఓట్లు 1,96,321 ఉండగా.. ఉపాధ్యాయుల ఓట్లు 23,214 ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కోసం 15 కొత్త జిల్లాల్లో 313 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ స్థానానికి జరిగే పోలింగ్‌కు 253 పోలింగ్ కేంద్రాలు పనిచేస్తాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఈనెల 26న జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీకి 17 మంది, ఉపాధ్యాయ స్థానానికి ఏడుగురు పోటీ పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ కోసం 17 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. పార్టీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి టి.జీవన్‌రెడ్డి, బీజేపీ నుంచి పి.సుగుణాకర్‌రావు, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమ పోటీ చేస్తుండగా.. గ్రూప్–1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు అధికార టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కామారెడ్డికి చెందిన రణజిత్ మోహన్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. కరీంనగర్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన కేశిపతి శ్రీధర్‌రాజు ఇటీవల పోటీనుంచి తప్పుకుని టీఆర్ఎస్ మద్దతుదారుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించారు. ఇక టీచర్ల ఎమ్మెల్సీకి ప్రస్తుత శాసనమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ తరఫున కూర రఘోత్తంరెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి తదితరులు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు నాలుగు పూర్వ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎవరికివారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఓటేసే ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు అర్హత గల ఉద్యోగులందరికీ ప్రభుత్వం శుక్రవారం రోజున ప్రత్యేక క్యాజువల్ లీవ్ ప్రకటించినట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. అర్హత గల ఉద్యోగులందరు ఓటుహక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిపుష్టికి తమవంతు సహకారం అందించాలని కోరారు. అలాగే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంబంధిత సంస్థలకు కూడా శుక్రవారం సెలవు వర్తింస్తుందని తెలిపారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. ఏర్పాట్లు పూర్తి : ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లుపూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల సామగ్రిని కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం, హుజూరాబాద్ రెండు చోట్లనుంచి ఇచ్చి పంపించినట్లు ఆయన తెలిపారు. పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు 409 పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 430 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 430 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1227 మంది ఇతర పోలింగ్ ఆఫీసర్లను ఎన్నికల నిర్వహణకు నియమించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 250 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు 1227 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను అన్ని పోలింగ్ స్టేషన్లలో వందశాతం వెబ్æకాస్టింగ్, వీడియోగ్రఫీ చేయిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్చైర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ ఓటర్లందరికీ ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్లు వివరించారు. పోలింగ్ స్టేషన్లలో ఎస్సై, ఏఎస్ఐ, హెచ్ఎస్వోలు, స్ట్రైకింగ్ ఫోర్స్, ఇతర పోలీసులు, హోంగార్డులకు బందోబస్తు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిసెప్షన్ సెంటర్ కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశామని, శుక్రవారం సాయంత్రం 4గంటల నుంచి ఇండోర్ స్టేడియంలోని రిసెప్షన్ సెంటర్లో బ్యాలెట్ బాక్సులను స్వీకరించి పటిష్టమైన పోలీసు బందోబస్తుతో బలపరుస్తామని వివరించారు. -
కాంగ్రెస్ పార్టీలో చివరకు మిగిలేది!
1960వ దశకం నాటి సంగతది. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఎం.సత్యనారాయణరావు మరికొందరు మిత్రులు కలిసి ‘చివరకు మిగిలేది’అని ఒక సినిమా తీశారు. మహానటి సావిత్రి, బాలయ్య, కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి (తొలిచిత్రం) నటించిన ఈ సినిమా పీవీ నరసింహారావు సహా విమర్శకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నర్స్‌గా సావిత్రి అద్భుత నటనకు రాష్ట్రపతి అవార్డు కూడా దక్కింది. మహానటికి బాగా నచ్చిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇంత ప్రత్యేకత ఉన్న సినిమా మంచి హిట్టవ్వాలి. కానీ.. నిర్మాతలైన నాటి కాంగ్రెస్ సీనియర్ నేతలకు సినిమా మార్కెటింగ్‌పై సరైన అవగాహన లేకపోవడంతో.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ ‘చివరకు మిగిలేది’చిత్రానికి.. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధముందా? తాజా పరిణామాలు చూస్తుంటే.. ఎక్కడో కనెక్షన్ ఉన్నట్లే అనిపిస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మొన్నటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు ‘చే’జారగా.. గురువారం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆరోవికెట్నూ టీఆర్ఎస్ ఖాతాలో వేసేశారు. ఇంత నష్టం జరుగుతున్నా.. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు ఎమ్మెల్యేల్లో, కేడర్‌లో ఎందుకు విశ్వాసం కలిపించలేకపోతున్నారు. ఇలా ఒక్కో వికెట్ పడుతూ పోతే.. కాంగ్రెస్ పార్టీలో ‘చివరకు మిగిలేది’ఎవరనే చర్చ జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఏ క్షణాన వచ్చిందో కానీ.. అప్పటి నుంచి కాంగ్రెస్‌కు వలసల బెడద మొదలైంది. అంతకుముందే అంతర్గతంగా చర్చలు జరిగినా.. ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పటి నుంచే బయటపడటం ప్రారంభించారు. ముందుగా ఆదివాసీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావులు గాంధీభవన్ నుంచి ప్రగతిభవన్ బాటపట్టారు. ఆ తర్వాత దళిత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆ వెంటనే ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌లు టీఆర్ఎస్లోకి వెళ్తున్నామని ప్రకటిం చారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి, గురువారం కందాల ఉపేందర్‌రెడ్డిలు అధికార పక్షంలో చేరిపోయారు. మొత్తం గెలిచిన 19మంది ఎమ్మెల్యేల్లో ఎన్నికలు జరిగి 3 నెలలు గడవక ముందే అరడజను మంది పార్టీ ఫిరాయించడంతో.. ఇక మిగిలేది ఎంతమందనే చర్చ మొదలైంది. వీరికి తోడు ఇంకా నలుగురైదుగురు టీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నారని, వారు కూడా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్‡్షలో పడిపోయారనే వార్తలు పార్టీ శ్రేణులను నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నాయి. ఉన్నట్టే ఉండి.. ఉట్టి ఎత్తేసి! ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జారిపోతున్నా ఇటు టీపీసీసీ నేతలు కానీ, అటు పార్టీ అధిష్టానం కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు పార్టీ వదిలిపోవడం ఒక్కరోజులో జరిగే పనికాదని.. చర్చలు, సంప్రదింపులు జరిగిన తర్వాతే అది సాధ్యమవుతుందనే విషయం టీపీసీసీ నేతలకు కూడా బాగా తెలుసు. అయినా..పార్టీ ఎమ్మెల్యేల ‘పక్కచూపులు’కనిపెట్టలేక తీరా ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తర్వాత తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రేగా కాంతారావు, ఆత్రం సక్కులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన అసెంబ్లీ సెషన్లోనే.. కేసీఆర్‌ను కలిసి పార్టీ మారేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. అప్పటి నుంచి నెలరోజులకు పైగా వారు పార్టీలోనే ఉన్నారు. ఆత్రం సక్కు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికీ హాజరయ్యారు. ఆ తర్వాత వెంటనే పార్టీ మారుతున్నట్టు లేఖ విడుదల చేశారు. సబితా ఇంద్రారెడ్డి అయితే.. రాహుల్‌గాంధీ పాల్గొన్న సభకు కూడా హాజరై స్వాగతోపన్యాసం చేశారు. మరుసటిరోజే అసదుద్దీన్ ఇంటికి వెళ్లి కేటీఆర్‌ను ఆ తర్వాత కవితను కలిసి వచ్చారు. రెండు రోజుల తర్వాత సీఎంను కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. గురువారం ప్రగతిభవన్ వెళ్లిన కందాల ఉపేందర్‌రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోయినా రాహుల్ సభకు వచ్చి ఆయన్ను కలిశారు. ఆయన్ను స్వయంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌గాంధీతో మాట్లాడించారు. నాలుగైదు రోజుల తర్వాత ఆయన కూడా కేటీఆర్‌ను కలిసి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఎందుకిలా జరుగుతోంది? ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోతున్నారన్న దానిపై కాంగ్రెస్ వద్ద సరైన సమాధానం లేదు. వ్యక్తిగత అజెండాతో డబ్బు సంచులకు ఆశపడి వారంతా పార్టీ వీడి వెళ్తున్నారనే అపవాదున్నా.. టీపీసీసీ ముఖ్య నేతలు కూడా వారి వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నందువల్లే ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కనీసం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను పలకరించిన దాఖలాలు లేవు. ఎన్నికలకు ముందు ముఖ్య నేతలంతా ఎవరికి వారే వర్గాలను ప్రోత్సహించుకున్నారని, ఎన్నికల తర్వాత కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలకు కనీస మర్యాద కూడా దక్కడం లేదనే విమర్శలు వినిపించాయి. శంషాబాద్‌లో రాహుల్ సభ జరిగినప్పుడు ఎమ్మెల్యేలు సురేందర్, హర్షవర్దన్‌లు రాహుల్‌ను కలిసేందుకు నాలుగైదు సార్లు ప్రయత్నించారు. అయినా వారిని కలవనీయకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, కార్యదర్శి బోసురాజులు బలవంతంగా అడ్డుకున్నారు. చివరకు రాహుల్ వెళ్లిపోయే సమయంలో మొక్కుబడి వారు వెళ్లి దండం పెట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు కూడా పార్టీ అధినేతను కలిసేందుకు కష్టపడాల్సి వస్తుందని, రాష్ట్ర నేతలు, జాతీయ నేతలెవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కలిసి.. వద్దని చెప్పిన దాఖలాలూ లేవు. సబితా ఇంద్రారెడ్డి ఒక్కరి విషయంలో కొంత ప్రయత్నం జరిగినా అది కూడా ఫలించలేదు. వెళ్లిన వారి సంగతి అటుంచితే పార్టీలో ఉన్నవారిని జాగ్రత్త చేసుకునేందుకు కూడా పీసీసీ, జాతీయ నాయకత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెళ్లేవారిని చేతులు అడ్డుపెట్టి ఆపలేం కదా అనే ముక్తాయింపు ఒకటి. పార్టీలో పరిస్థితిపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పార్టీలో ప్రస్తుత పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. కొందరి వ్యక్తిగత అజెండాతో పార్టీకి నష్టం కలుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ఏఐసీసీ దృష్టికి కూడా తీసుకెళ్లాను. నాయకులకు మర్యాద ఇవ్వాలి. కార్యకర్తలకు భరోసా కల్పించాలి. నాకు కూడా మనోవేదన కల్గించే ఘటనలు పార్టీలో ఎదురయ్యాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ప్రయత్నించడంలో నాయకులు విఫలమయ్యారు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేదంటే పార్టీ భారీ మూల్యం చెల్లుకోవాల్సి వస్తుంది’అని పేర్కొన్నారు. అడ్డుకునే కార్యాచరణేదీ? కాంతారావు, సక్కులు వెళ్లిపోయిన మరుసటి రోజు అసెంబ్లీలోని గాంధీవిగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చినా కార్యకర్తలు స్పందించలేదు. పినపాకలో నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను కాంతారావు అనుచరులు అడ్డుకున్నారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా.. అప్రజాస్వామ్యమని, అ«ధికార రాక్షసత్వమని, జాతీయ స్థాయిలో చర్చ చేస్తామని, కోర్టులకు వెళతామని ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారనే తప్ప క్షేత్రస్థాయిలో కేడర్‌ను కదిలించి సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నమే చేయకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆ దేవుడే రక్షించాలనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏం జరుగుతుందో.. చివరకు ఏం మిగులుతుందో వేచిచూడాల్సిందే! -
ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్
సాక్షి, మహబూబాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యవతి రాథోడ్ విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. దీంతో మలివిడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉండనున్నాయని టీఆర్ఎస్ శ్రేణులు అశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ముందు డోర్నకల్ ఎమ్మెల్యేగా రెడ్యానాయక్‌కు అవకాశం ఇచ్చారు. అలాగే భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం కల్పించగా, తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగగా, సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ పూర్తి చేసి అభ్యర్థుల ఫలితాలను అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ప్రకటించారు. ఏకపక్షమే.. - సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో కలిసి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫండీలను బరిలో నిలిపింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తనకు ఉన్న 19 మంది ఎమ్మెల్యేలతోపాటు, టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 21 మంది ఎమ్మెల్యేల బలంతో కాంగ్రెస్ పార్టీ తరుఫున అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, అసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు , ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నందుకు నిరసనగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలెవరూ పోలింగ్‌లో పాల్గొనవద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విప్ జారీ చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలింగ్‌కు దూరంగా ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం ఏకపక్షం అయ్యింది. మలి విడతలోనైనా మంత్రి పదవి వరించేనా...! తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు అవకాశం దక్కలేదు. తరువాత జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తానన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం లేకపోవటంతో సత్యవతికి అవకాశం కల్పించేందుకే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. అలాగే ఇద్దరు మహిళలలో ఎమ్మెల్యేల నుంచి ఒక్కరిని, ఎమ్మెల్సీల నుంచి మరోక్కరిని మంత్రిగా అవకాశం కల్పించే అవకాశం ఉందని సమాచారం. దీంతో మలివిడుత మంత్రివర్గ విస్తరణలో జిల్లానుంచి సత్యవతి రాథోడ్‌కు మంత్రిపదవి వరించనున్నదని ఆమె అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు ఎమ్మెల్సీ పోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు అసెంబ్లీలో నిర్వహిస్తారు. మండలిలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఆధ్వర్యంలో పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 5 స్థానాల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమాతో ఉంది. ఈ ఎన్నికలను బహిష్కంచాలని కాంగ్రెస్ నిర్ణయించడంతో పోలింగ్ ఏకపక్షంగానే జరగనుంది. ఖాళీ అవుతున్న ఐదు స్థానాల కోసం టీఆర్ఎస్–ఎంఐఎం తరఫున ఐదుగురు, కాంగ్రెస్ తరుఫున ఒకరు బరిలో ఉన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి టీఆర్ఎస్ తరఫున, ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫండీ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం టీఆర్ఎస్–ఎంఐఎం అభ్యర్థుల గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీ 120 మంది ఉన్నారు. టీఆర్ఎస్కు 91, ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు, టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్, టీడీపీల బలం 15కు పరిమితమైంది. బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పోలింగ్‌లో పాల్గొనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలింగ్‌కు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుత లెక్కల ప్రకారం టీఆర్ఎస్–ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనం కానుంది. -
మేం దూరం!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులకు షాక్ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామా బాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభ ద్రుల నియోజకవర్గాల నుంచి అధికారికంగా అభ్యర్థులను నిలపొద్దని పార్టీ నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి, మహ బూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియో జకవర్గంలో చోటు చేసుకున్న ప్రతికూల పరి ణామాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పార్టీ అభ్యర్థులను బరిలో నిలపొద్దని భావి స్తున్నట్లు సమాచారం. ఇది టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ కావాలని కలలు గన్న ఆ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌తో పాటు ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాద గిరి శేఖర్‌రావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు ప్రయ త్నించారు. కానీ టీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థి ని ప్రకటించలేమని స్పష్టం చేయడంతో రవీందర్ సింగ్ మౌనం దాల్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబ డి ఉండాలని నిర్ణయించుకున్న మేయర్ శనివారం కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఇక యాదగిరి శేఖర్‌రావు ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈనెల 5న భారీ ర్యాలీతో వచ్చి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయాలని నిర్ణయించారు. ఉద్యోగానికి చంద్రశేఖర్ గౌడ్ రాజీనామా గ్రూప్–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షు డిగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగానికి శనివారం రాజీనామా చేశారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకే ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోగా.. ప్రభుత్వం వెంటనే ఆమోదించడం గమనార్హం. టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావించిన చంద్రశేఖర్‌గౌడ్ తనను అభ్యర్థిగా ప్రకటించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులను కలిశారు. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు అధికారికంగా అభ్యర్థి ఉండరని తేల్చినా.. అంతర్గతంగా మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే ఆమోదం లభించిందని ఆయన వర్గీయులు చెపుతున్నారు. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్దీ్ద విషయాన్ని ధ్రువీకరించడం లేదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సైతం.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో కూడా టీఆర్ఎస్ తటస్థ వైఖరినే అవలంభించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీల జోక్యం వద్దని భావించిన టీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. తొలుత శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరిట ప్రకటన వెలువడినా.. ఆ తర్వాత పరిణామాలతో మిన్నకుండి పోయారు. దీంతో ఆయన ఉపాధ్యాయ సంఘాల తరుపునే పోటీలో ఉన్నారు. అలాగే, శనివారం పీఆర్టీయూ నుంచి కూర రఘోత్తంరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఎస్టీయూ నుంచి మామిడి సుధాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి కూడా బరిలో నిలిచారు. కిటకిటలాడిన కలెక్టరేట్ గత నెల 25వ తేదీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా, శనివారం మాత్రమే కరీంనగర్ కలెక్టరేట్ సందడిగా కనిపించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం శుక్రవారం వరకు కేవలం నాలుగు నామినేషన్లు రాగా, శనివారం ఒక్కరోజే 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్‌కు చెందిన కళ్లెం ప్రవీణ్‌రెడ్డి, కామారెడ్డికి చెందిన మాజీ ఏబీవీపీ నాయకుడు గురువుల రణజిత్ మోహన్, పోరుపెల్లి ప్రభాకర్ రావు, గుర్రం ఆంజనేయులు, తోడేటి శ్రీకాంత్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బుట్ట శ్రీకాంత్, ఎడ్ల రవికుమార్ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం ఒక్కరోజే పీఆర్టీయూ నుంచి కూర రఘోత్తం రెడ్డి, ఎస్టీయూ నుంచి మామిడి సుధాకర్‌రెడ్డితో పాటు కొండల్‌రెడ్డి, చార్ల మానయ్య, నిథానియల్ తమ నామినేషన్లు సమర్పించారు. -
పోరు రసవత్తరం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : మండలి ఎన్నికలకు నగారా మోగడంతో పంతుళ్ల పోరు రసవత్తరంగా మారుతోంది. పెద్దల సభలో అడుగు పెట్టేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయా సంఘాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బరిలో నిలవాలని నిర్ణయించుకున్న నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పాటూరి సుధాకర్‌రెడ్డి పదవీకాలం ముగిసింది. ఈ స్థానానికి ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో బరిలో నిలవాలని భావిస్తున్న వారు తమ గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తాజా మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. సుధాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మండలి టీఆర్ఎస్ పార్టీ విప్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని కొందరు పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు స్వాగతించారు. కానీ తమ యూనియన్ తరపున రఘోత్తంరెడ్డి బరిలో ఉంటారని పీఆర్టీయూ జిల్లా ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ యూనియన్ నేతలు గ్రామాల్లో తిరిగి పాఠశాలల ఉపాధ్యాయులను కలిసి ప్రచారం నిర్వహించారు. తర్వాత ఆ యూనియన్ నాయకులు ప్రచారం నిలిపివేశారు. దీంతో ఆ యూనియన్ సభ్యుల్లో అయోమయం నెలకొంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతిపెద్ద యూనియన్ అయిన పీఆర్టీయూలో ఈ అయోమయ పరిస్థితులు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. పీఆర్టీయూ రెబల్‌గా..? ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్‌రెడ్డి కూడా బరిలో ఉంటారని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన పీఆర్టీయూ రెబల్ అభ్యర్థి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ సంఘం వర్గాలు చెబుతున్నాయి. మోహన్‌రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. గత ఎన్నికల్లో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి పాతూరి సుధాకర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా ఆయన మళ్లీ బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. మొత్తం మీద సంఖ్యాపరంగా బలమైన పీఆర్టీయూ యూనియన్ సభ్యులు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాగా యూటీఎఫ్, టీపీటీఎఫ్ వంటి సంఘాల మద్దతుతో బి కొండల్‌రెడ్డి కూడా బరిలో దిగే యోచనలో ఉన్నారు. రెండు, మూడు నెలల నుంచే ఆయన తరపున ఆయా యూనియన్ల నాయకులు పాఠశాలలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎస్టీయూ మద్దతుతో ఎం సుధాకర్‌రెడ్డి కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో ప్రాధాన్యత ఓటూ ప్రధానమే.. ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు, ఒక్కోసారి రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను రెండో ప్రాధాన్యత ఓటు కూడా నిర్ణయించిన ఘటనలు ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 22,488 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యర్థికి పోలైన ఓట్లలో 50 శాతానికి మించి మొదటి ప్రాధాన్యత ఓట్లు పడాల్సి ఉంటుంది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రా«ధాన్యత ఓట్లు పడని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బరిలో నిలవాలని భావిస్తున్న నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. -
పెద్దల సభకు నేతల సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దల సభలో ఖాళీ కాబోతున్న రెండుఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబ«ంధించిన రెండు నియోజకవర్గాలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శాసనమండలి ఛైర్మన్ కె.స్వామిగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయగా.. తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ మార్చి 5వ తేదీ వరకు కొనసాగనుంది. నాలుగు పాత జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పాతూరి సుధాకర్‌రెడ్డి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. పీఆర్టీయూ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. శాసనమండలిలో ప్రస్తుతం విప్‌గా ఉన్న ఆయన టీఆర్ఎస్ నేతగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రికి విశ్వాసపాత్రుడిగా ఉన్న సుధాకర్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు కోరారు. కాంగ్రెస్, బీజేపీ బలపరిచే ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించడంలో సఫలమైన నాయకులు.. ఇప్పుడు పార్టీల మద్దతుతో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. పెద్దల సభ అయినా.. రాజకీయ పార్టీ మద్దతు లేకుండా గెలిచే పరిస్థితి లేకపోవడంతో పలువురు నేతలు ఆయా పార్టీల నుంచి అధికారిక అభ్యర్థిత్వం కోసం హైదరాబాద్‌లో మకాం వేశారు. స్వామిగౌడ్‌ను కాదంటేనే టీఆర్ఎస్ ఆశావహులకు టీఆర్ఎస్ తరఫున ఆరేళ్ల క్రితం ఈ నియోజకవర్గం నుంచి స్వామిగౌడ్ విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన మండలి చైర్మన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగుస్తున్నప్పటికీ.. ఆయన సేవలను మరోసారి వినియోగించుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా మరోసారి ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయనకు అవకాశం ఇస్తారా? లేక ప్రత్యామ్నాయ ఆలోచన ఏమైనా ఉందా..? అనే విషయంలో టీఆర్ఎస్ వర్గాలకు కూడా స్పష్టత లేదు. స్వామిగౌడ్ పదవీకాలం ముగుస్తుందని తేలడంతోనే పలువురు నాయకులు, ఉద్యమ నేతలు తెరపైకి వచ్చి తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. కరీంనగర్ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ కొంతకాలంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఆయన ఎమ్మెల్సీ సీటు విషయంలో ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల కావడంతోనే అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు కరీంనగర్‌కే చెందిన ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లో మకాం వేశారు. సీన్లోకి రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్‌గౌడ్ తెలంగాణ ఉద్యమం నుంచి గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ ఇన్చార్జి డీటీసీగా వ్యవహరిస్తున్న ఆయన నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తారని ధీమాతో ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో తనవంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి దాదాపు ఖరారు కరీంనగర్ జిల్లాలోని అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన తాటిపర్తి జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి అనూహ్యంగా ఓడిపోయారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. 1.90లక్షల ఓటర్లు ఉన్న ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 79వేల మంది కరీంనగర్ ఉమ్మడి జిల్లానుంచే ఉండడం తనకు కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. జిల్లాకు చేసిన సేవలను గుర్తు చేసుకునే పట్టభద్రులు ప్రతిఒక్కరూ తనకే ఓటేస్తారని ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అధికారికంగా ఆదేశాలు రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ నుంచి సుగుణాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు బీజేపీ నుంచి పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ నాయకుడైన సుగుణాకర్‌రావుతోపాటు కామారెడ్డికి చెందిన ఏబీవీపీ నేత రంజిత్ మోహన్, కరీంనగర్‌కు చెందిన కొట్టె మురళీకృష్ణ సైతం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సుగుణాకర్‌రావు పార్టీకి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఆయన పేరునే ఖరారు చేసే అవకాశం ఉంది. వీరు కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు పెద్దల సభకు పోటీ పడనున్నారు. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. కరీంనగర్‌లోనే నామినేషన్లు శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించనున్నారు. నాలుగు జిల్లాల్లోని 42 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరీంనగర్ కలెక్టరేట్లోనే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. -
‘పెద్దల’పై అనాసక్తి..
ఆదిలాబాద్‌అర్బన్: పెద్దల సభ ఎలక్షన్ నేపథ్యంలో ఓటు ఆవశక్యతపై అధికారులు అవగాహన కల్పించకపోవడంతో నమోదుకు పట్టభధ్రులు, ఉపాధ్యాయులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈసారి ఎమ్మెల్సీ ఓటు నమోదులో జిల్లా వెనకబడింది. ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఓటు నమోదు బాగానే జరిగినా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ముందుకు రావడం లేదు. ఓటు నమోదు తక్కువగా జరగడంతో ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. గడువు ఈనెల 19 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లా పాత ఓటర్ల సంఖ్య 34,557గా ఉంది. దీనికి అనుగుణంగా దరఖాస్తులు రాకపోయినా.. కనీసం అందులో సగం మంది ఓటర్లు కూడా ఈసారి నమోదు చేసుకోకపోవడం గమనార్హం. మండలి ఓటు నమోదుపై ప్రచారం లేకనే పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుంచి స్పందన రావడం లేదని గ్రహించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వతహాగా ప్రచారం చేపట్టినా ఆశించిన మేర నమోదు కాలేదు. కాగా ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువ శాతం పట్టభద్రులే ఉన్నారు. ఇందులో కొంత మంది ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేకపోవడం గమనించదగ్గ విషయం. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో జిల్లా యంత్రాంగం ఉండడం, మండలి ఓటరు నమోదుపై ప్రచారం లేకపోవడం.. వెరసి ఈసారి ఎమ్మెల్సీ ఓటర్లు తక్కువగా నమోదయ్యారు. పాత జిల్లాలో 34,557 ఓట్లు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు మొత్తం 34,557 మంది ఉన్నారు. ఇందులో 30,488 మంది పట్టభద్రులు ఉండగా, 4,069 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఈఏడాది అక్టోబర్ నుంచి నవంబర్ 6 వరకు జరిగిన ప్రక్రియ ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు 10,150 మంది పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఒక్కో రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు 1,550 నుంచి 1,950 మంది వరకు ఓటరుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. కాగా 2013లో చేపట్టిన ఎమ్మెల్సీ ఓటరు నమోదులో కన్పించిన జోరు.. ఈసారి కనిపించడం లేదు. నమోదుపై క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడంతో అధిక సంఖ్యలో ఉన్న పట్టభద్రులు ముందుకు రాలేకపోయారు. ఈ నెల 6 వరకు జరిగిన ఓటు నమోదు సమయంలో ఆన్లైన్ మొరాయించిన విషయం తెలిసిందే. దాన్ని సాకుగా చూపుతూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. కనీసం ఎంత మంది పట్టభద్రులు, ఎంత మంది ఉపాధ్యాయులు నమోదు చేసుకున్నారో కూడా తెలియదని సమాధానం ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అభ్యర్థులే ప్రచార సారథులు.. 2019 మార్చి చివరి నాటికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలవాలని భావిస్తున్న వారే శాసన మండలి నియోజకవర్గ ఓటరు నమోదుపై ప్రచారం చేయాల్సి వస్తోంది. ఓటరు నమోదు సమయంలో గత నెలాఖరులో నిర్మల్ జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి పనిలో పనిగా ఆదిలాబాద్‌కు సైతం వచ్చి వెళ్లారు. వీలైనంత ఎక్కువ మందికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశ్యంతో అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అప్రమత్తం కావాల్సి ఉందని ఎన్నికల సంఘం సూచించినట్లు సమాచారం. దీని దృష్ట్యా ఇప్పటికైనా అధికారులు స్పందించి అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా తీరుగానే ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రచారం నిర్వహిస్తే తప్పా పట్టభద్రులు ఓటు కోసం పోటెత్తే అవకాశం కన్పించడం లేదు. ఎమ్మెల్సీ ఓటు నమోదు ఇలా.. ఎమ్మెల్సీ ఓటరుగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలనుకునే వారు ఠీఠీఠీ. ఛ్ఛిౌ ్ట్ఛ ్చnజ్చn్చ. nజీఛి. జీn లోకి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. లేదా నేరుగా ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. 2015 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటు హక్కు పొందడానికి అర్హులు. 2012 నవంబర్ 1 నుంచి ఈఏడాది నవంబర్ 1 వరకు ఆరేళ్లలో మూడేళ్లకు తగ్గకుండా గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో బోధన అనుభవం ఉన్న వారు ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటు హక్కు పొందడానికి అర్హులు. 19 వరకు గడువు పొడిగింపు.. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 6తో ముగిసిన నమోదు ప్రక్రియను ఈనెల 19 వరకు పొడగించింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి గతంలో ఓటేసినా ఇప్పుడు మళ్లీ తప్పక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టభద్రులు ఫారం– 18, ఉపాధ్యాయులు ఫారం– 19ను పూర్తి చేసి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ ఓటు హక్కు పొందే వారు పట్టభద్రుల ఓటు పొందడానికి అర్హులవుతారు. అయితే వారు ఫారం– 18, 19ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా జిల్లా అధికారులకు గడువు పొడిగింపు సమాచారం అధికారికంగా అందాల్సి ఉంది.