
నేడు వైఎస్సార్ సీపీ నిరసనలు
టీడీపీ నీచ రాజకీయాలను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు
పార్టీ నేతల పిలుపు
సాక్షి, విజయవాడ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ నీచ రాజకీయాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కగా, సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ ఫోన్‌లో మాట్లాడిన ఆడియో టేపులు ఆదివారం బయటపడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని రూరల్ ప్రాంతంలో గల 13 నియోజకవర్గాల్లోని ప్రధాన కేంద్రాల్లో, నగరంలోని మూడు నియోజకవర్గాలకు కలిపి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకొచ్చి ఏడాదైనా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు.
దీనికి తోడు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన ఇలాంటి ముఖ్యమంత్రి దేశచరిత్రలో ఎవరూ ఉండరని మండిపడ్డారు. అవినీతికి చంద్రబాబు నాయుడు, అతని మంత్రులు కేరాఫ్ అడ్రస్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్ల దగ్గర ముడుపులు తీసుకొని ఆ డబ్బును తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చు చేయటానికి యత్నిస్తూ దొరికిపోయారని చెప్పారు. ఈ ఉదంతంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేవలం పావు మాత్రమేని, అసలు దొంగ చంద్రబాబు నాయుడేనని తెలిపారు.
కార్యకర్తలు తరలిరావాలని పిలుపు...
నిరసన కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సారథి కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగే ధర్నాకు నగరంలోని మూడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలిరావాలని సారథి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, తూర్పు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తలు వంగవీటి రాధాకృష్ణ, గౌతంరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు. అవినీతిని ప్రోత్సహిస్తూ, ఓటు కోసం నేరుగా ఫోన్‌లో సంభాషణలు సాగించిన ముఖ్యమంత్రి తక్షణమే తన పదవి నుంచి వైదొలగాలని వారు డిమాండ్ చేశారు.