గురువారం ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
1960వ దశకం నాటి సంగతది. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఎం.సత్యనారాయణరావు మరికొందరు మిత్రులు కలిసి ‘చివరకు మిగిలేది’అని ఒక సినిమా తీశారు. మహానటి సావిత్రి, బాలయ్య, కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి (తొలిచిత్రం) నటించిన ఈ సినిమా పీవీ నరసింహారావు సహా విమర్శకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నర్స్‌గా సావిత్రి అద్భుత నటనకు రాష్ట్రపతి అవార్డు కూడా దక్కింది. మహానటికి బాగా నచ్చిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇంత ప్రత్యేకత ఉన్న సినిమా మంచి హిట్టవ్వాలి.
కానీ.. నిర్మాతలైన నాటి కాంగ్రెస్ సీనియర్ నేతలకు సినిమా మార్కెటింగ్‌పై సరైన అవగాహన లేకపోవడంతో.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ ‘చివరకు మిగిలేది’చిత్రానికి.. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధముందా? తాజా పరిణామాలు చూస్తుంటే.. ఎక్కడో కనెక్షన్ ఉన్నట్లే అనిపిస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మొన్నటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు ‘చే’జారగా.. గురువారం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆరోవికెట్‌నూ టీఆర్‌ఎస్ ఖాతాలో వేసేశారు. ఇంత నష్టం జరుగుతున్నా.. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు ఎమ్మెల్యేల్లో, కేడర్‌లో ఎందుకు విశ్వాసం కలిపించలేకపోతున్నారు. ఇలా ఒక్కో వికెట్ పడుతూ పోతే.. కాంగ్రెస్ పార్టీలో ‘చివరకు మిగిలేది’ఎవరనే చర్చ జరుగుతోంది.
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఏ క్షణాన వచ్చిందో కానీ.. అప్పటి నుంచి కాంగ్రెస్‌కు వలసల బెడద మొదలైంది. అంతకుముందే అంతర్గతంగా చర్చలు జరిగినా.. ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పటి నుంచే బయటపడటం ప్రారంభించారు. ముందుగా ఆదివాసీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావులు గాంధీభవన్ నుంచి ప్రగతిభవన్ బాటపట్టారు. ఆ తర్వాత దళిత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆ వెంటనే ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌లు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నామని ప్రకటిం చారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి, గురువారం కందాల ఉపేందర్‌రెడ్డిలు అధికార పక్షంలో చేరిపోయారు. మొత్తం గెలిచిన 19మంది ఎమ్మెల్యేల్లో ఎన్నికలు జరిగి 3 నెలలు గడవక ముందే అరడజను మంది పార్టీ ఫిరాయించడంతో.. ఇక మిగిలేది ఎంతమందనే చర్చ మొదలైంది. వీరికి తోడు ఇంకా నలుగురైదుగురు టీఆర్‌ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నారని, వారు కూడా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్‡్షలో పడిపోయారనే వార్తలు పార్టీ శ్రేణులను నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నాయి.
ఉన్నట్టే ఉండి.. ఉట్టి ఎత్తేసి!
ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జారిపోతున్నా ఇటు టీపీసీసీ నేతలు కానీ, అటు పార్టీ అధిష్టానం కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు పార్టీ వదిలిపోవడం ఒక్కరోజులో జరిగే పనికాదని.. చర్చలు, సంప్రదింపులు జరిగిన తర్వాతే అది సాధ్యమవుతుందనే విషయం టీపీసీసీ నేతలకు కూడా బాగా తెలుసు. అయినా..పార్టీ ఎమ్మెల్యేల ‘పక్కచూపులు’కనిపెట్టలేక తీరా ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తర్వాత తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రేగా కాంతారావు, ఆత్రం సక్కులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన అసెంబ్లీ సెషన్‌లోనే.. కేసీఆర్‌ను కలిసి పార్టీ మారేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. అప్పటి నుంచి నెలరోజులకు పైగా వారు పార్టీలోనే ఉన్నారు.
ఆత్రం సక్కు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికీ హాజరయ్యారు. ఆ తర్వాత వెంటనే పార్టీ మారుతున్నట్టు లేఖ విడుదల చేశారు. సబితా ఇంద్రారెడ్డి అయితే.. రాహుల్‌గాంధీ పాల్గొన్న సభకు కూడా హాజరై స్వాగతోపన్యాసం చేశారు. మరుసటిరోజే అసదుద్దీన్ ఇంటికి వెళ్లి కేటీఆర్‌ను ఆ తర్వాత కవితను కలిసి వచ్చారు. రెండు రోజుల తర్వాత సీఎంను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. గురువారం ప్రగతిభవన్ వెళ్లిన కందాల ఉపేందర్‌రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోయినా రాహుల్ సభకు వచ్చి ఆయన్ను కలిశారు. ఆయన్ను స్వయంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌గాంధీతో మాట్లాడించారు. నాలుగైదు రోజుల తర్వాత ఆయన కూడా కేటీఆర్‌ను కలిసి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
ఎందుకిలా జరుగుతోంది?
ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లిపోతున్నారన్న దానిపై కాంగ్రెస్ వద్ద సరైన సమాధానం లేదు. వ్యక్తిగత అజెండాతో డబ్బు సంచులకు ఆశపడి వారంతా పార్టీ వీడి వెళ్తున్నారనే అపవాదున్నా.. టీపీసీసీ ముఖ్య నేతలు కూడా వారి వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నందువల్లే ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కనీసం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను పలకరించిన దాఖలాలు లేవు. ఎన్నికలకు ముందు ముఖ్య నేతలంతా ఎవరికి వారే వర్గాలను ప్రోత్సహించుకున్నారని, ఎన్నికల తర్వాత కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలకు కనీస మర్యాద కూడా దక్కడం లేదనే విమర్శలు వినిపించాయి. శంషాబాద్‌లో రాహుల్ సభ జరిగినప్పుడు ఎమ్మెల్యేలు సురేందర్, హర్షవర్దన్‌లు రాహుల్‌ను కలిసేందుకు నాలుగైదు సార్లు ప్రయత్నించారు. అయినా వారిని కలవనీయకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, కార్యదర్శి బోసురాజులు బలవంతంగా అడ్డుకున్నారు.
చివరకు రాహుల్ వెళ్లిపోయే సమయంలో మొక్కుబడి వారు వెళ్లి దండం పెట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు కూడా పార్టీ అధినేతను కలిసేందుకు కష్టపడాల్సి వస్తుందని, రాష్ట్ర నేతలు, జాతీయ నేతలెవ్వరూ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కలిసి.. వద్దని చెప్పిన దాఖలాలూ లేవు. సబితా ఇంద్రారెడ్డి ఒక్కరి విషయంలో కొంత ప్రయత్నం జరిగినా అది కూడా ఫలించలేదు. వెళ్లిన వారి సంగతి అటుంచితే పార్టీలో ఉన్నవారిని జాగ్రత్త చేసుకునేందుకు కూడా పీసీసీ, జాతీయ నాయకత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెళ్లేవారిని చేతులు అడ్డుపెట్టి ఆపలేం కదా అనే ముక్తాయింపు ఒకటి. పార్టీలో పరిస్థితిపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పార్టీలో ప్రస్తుత పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. కొందరి వ్యక్తిగత అజెండాతో పార్టీకి నష్టం కలుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ఏఐసీసీ దృష్టికి కూడా తీసుకెళ్లాను. నాయకులకు మర్యాద ఇవ్వాలి. కార్యకర్తలకు భరోసా కల్పించాలి. నాకు కూడా మనోవేదన కల్గించే ఘటనలు పార్టీలో ఎదురయ్యాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ప్రయత్నించడంలో నాయకులు విఫలమయ్యారు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేదంటే పార్టీ భారీ మూల్యం చెల్లుకోవాల్సి వస్తుంది’అని పేర్కొన్నారు.
అడ్డుకునే కార్యాచరణేదీ?
కాంతారావు, సక్కులు వెళ్లిపోయిన మరుసటి రోజు అసెంబ్లీలోని గాంధీవిగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చినా కార్యకర్తలు స్పందించలేదు. పినపాకలో నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను కాంతారావు అనుచరులు అడ్డుకున్నారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా.. అప్రజాస్వామ్యమని, అ«ధికార రాక్షసత్వమని, జాతీయ స్థాయిలో చర్చ చేస్తామని, కోర్టులకు వెళతామని ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారనే తప్ప క్షేత్రస్థాయిలో కేడర్‌ను కదిలించి సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నమే చేయకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆ దేవుడే రక్షించాలనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏం జరుగుతుందో.. చివరకు ఏం మిగులుతుందో వేచిచూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment