70 ఏళ్లలో ఏం ఉద్ధరించారు? | KTR Criticize On Congress Kamareddy | Sakshi
Sakshi News home page

70 ఏళ్లలో ఏం ఉద్ధరించారు?

Published Thu, Mar 14 2019 1:44 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

KTR Criticize On Congress Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఏం ఉద్ధరించాయని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌ ప్రాంతాల పేరుతో, బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మాగి గ్రామంలో జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ కరెంటు, రోడ్డు లేని ఊళ్లు, నీళ్లు దొరకని గ్రామాలు, తిండిలేని అభాగ్యులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దానికి కారణమైన కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశం మొత్తం కీర్తిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 90% నిధులిచ్చిన కేంద్రం.. అదే తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపడితే ప్రధాన మంత్రి మోదీ నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలను నీతి ఆయోగ్‌ మెచ్చుకుని రూ.24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తే.. 24 పైసలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.

మా పథకాలను కాపీ కొట్టారు 
తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేసేందుకు యత్నిస్తున్నాయని కేటీఆర్‌ వివరించారు. చివరకు ప్రధాని మోదీ కూడా రైతుబంధును కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. దేశానికి 15 మంది ప్రధానులు మారినా, ఉమ్మడి రాష్ట్రానికి సీఎంలున్నా.. తెలంగాణలో రైతులు, పేదల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. రైతులు, పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలాగే.. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు కేసీఆర్‌ పెద్దకొడుకయ్యాడని వివరించారు. దేశంలో బడితె ఉన్నోడిదే బర్రె అన్నట్టుగా తయారైందని కేటీఆర్‌ విమర్శించారు.

మమతా బెనర్జీ కేంద్ర రైల్వే మంత్రిగా ఉండి రైల్వేలైన్లను బెంగాల్‌కు తీసుకువెళ్లారని, లాలూప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌కు వెళ్లాయన్నారు. మోదీ ప్రధాని ఉండటంతో బుల్లెట్‌ రైలు గుజరాత్‌ మీదుగా ముంబైకు వెళ్లిందన్నారు. 2014లో 280 సీట్లు గెలిచిన బీజేపీకి ఇప్పుడు 150 సీట్లు దాటే పరిస్థితి లేదని, రాహుల్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పుంజుకోలేదని, 44 సీట్లు 110కి పెరగొచ్చు తప్ప అధికారం చేపట్టలేదన్నారు. ఉప్పు–నిప్పులాంటి కాంగ్రెస్, బీజేపీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో కీలకమై, జుట్టు చేతిలో పెట్టుకుని కావలసినన్ని నిధులు సాధిస్తామన్నారు. ఐదేళ్లలో లక్ష, లక్షన్నరకోట్లు తెచ్చుకోగలుగుతామన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

గుణాత్మక మార్పుకోసం 
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఇందుకోసం 16 ఎంపీ సీట్లను గెలిపించాలని కోరారు. కేంద్రంలో కొట్లాడే సైనికులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సభకు జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అధ్యక్షత వహించగా, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి, నారాయణ్‌ఖేడ్, అందోల్, జహీరాబాద్‌ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్‌రావ్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావ్, ఫరీదుద్దీన్, షేరి సుభాష్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ రాజు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు గంగాధర్‌ పట్వారి, ముజీబొద్దీన్, టీఆర్‌ఎస్‌ నేతలు పోచారం భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, నిట్టు వేణుగోపాల్‌రావ్, కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ పిప్పిరి సుష్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

బుధవారం కామారెడ్డి జిల్లా మాగి గ్రామంలో జరిగిన టీఆర్‌ఎస్‌ సన్నాహక సభలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement