సాక్షి, మెదక్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెతుకుసీమలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో మంగళవారం ఆమె హైదరాబాద్‌లో సమావేశమైనట్లు తెలిసింది. చర్చల అనంతరం సీఎం కేసీఆర్‌తోనూ ఆమె ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. వచ్చే నెల మూడో తేదీన నర్సాపూర్‌లో జరిగే మెదక్ లోక్‌సభ నియోజకవర్గ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. అయితే.. సునీతా లక్ష్మారెడ్డి ‘కారు’ఎక్కనున్నారనే సమాచారంతో కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలక నేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫోన్‌లో ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆమె అనుచరులు, బంధువుల వద్దకు వెళ్లి మాట్లాడినట్లు తెలుస్తోంది.
హ్యాట్రిక్ విజయం
సునీతా లక్ష్మారెడ్డి మూడు పర్యాయాలు (1999, 2004, 2009) కాంగ్రెస్ నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సీపీఐకి చెందిన చిలుముల కృష్ణారెడ్డిపై 13,274 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే 2014 సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నిక, ఆ తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అంచెలంచెలుగా ఎదిగిన సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో అనేక పదవులు నిర్వహించారు.
తొలుత బీజేపీలోకి అంటూ..
ఇటీవల గద్వాల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే.అరుణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆమెతో కలసి సునీతా లక్ష్మారెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండటంతో సునీత లక్ష్మారెడ్డి సైతం బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆమె ఖండించారు. అయితే.. అరుణ ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ సునీత ససేమిరా అన్నట్లు తెలిసింది.
కేటీఆర్‌తో వరుస భేటీలు..
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ పటిష్టతపై కె.తారకరామారావు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా పార్టీ నాయకులు, ముఖ్య అనుచరులతో సమావేశాలు జరుపుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంపై ఆయన మరింత దృష్టి పెట్టారు.ఈ క్రమంలో ఇటీవల సునీతా లక్ష్మారెడ్డి మూడు, నాలుగు పర్యాయాలు కేటీఆర్‌ను కలసి చర్చి ం చినట్లు తెలిసింది. పార్టీ పటిష్టతలో భాగంగా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నామని.. తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆమెతో కేటీఆర్ అన్నట్లు సమాచారం. అంతేకాకుండా సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో కూడా ఫోన్‌లో మాట్లాడించినట్లు తెలిసింది.
టీఆర్‌ఎస్‌లోకి సునీతా లక్ష్మారెడ్డి!
Published Wed, Mar 27 2019 5:45 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment