సాక్షి, మెదక్ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో.. కార్యకర్తలతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. సునీత చేరికతో మెదక్‌లో టీఆర్‌పార్టీ మరింత బలోపేతమవుతుందంటున్నారు విశ్లేషకులు.
ఈ సందర్భంగా సునీతా లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. ‘కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదు. 50 ఏళ్లలో సాధ్యం కానీ అభివృద్ధిని కేసీఆర్ నాలుగేళ్లలో చేసి చూపారు. మెదక్ జిల్లా అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాన’ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మెదక్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సునీతా లక్ష్మారెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అయితే గత కొన్ని రోజులుగా సునీతా టీఆర్‌ఎస్‌లో చేరతారనే వార్తలు వినిపించాయి. తొలుత ఆమె బీజేపీలో చెరతారనే ప్రచారం జరిగింది. కానీ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆమె టీఆర్‌ఎస్‌లో చేరడానికే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఈ నెల 3న మెదక్ నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారని భావించారు. కానీ ఈ లోపే సోమవారం ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment