సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వద్దిరాజు రవిచంద్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, టీజేఎస్ పార్టీలకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులపై పోటీ చేసిన ఇద్దరు శనివారం హైదరాబాద్‌లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ గ్రానైట్ వ్యాపారి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి శనివారం టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షాన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అదే విధంగా మరో సీనియర్ నాయకుడు, బీజేపీ, టీజేఎస్‌ల్లో పనిచేసిన పగిడిపాటి దేవయ్య రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యాన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.
కేసీఆర్ విధానాలు నచ్చడంతో..
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్‌కు 83,922 ఓట్లు రాగా, రవిచంద్రకు 55,140 ఓట్లు వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన వద్దిరాజు రవిచంద్ర టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్
శనివారం ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కేసీఆర్ అనుసరిస్తున్న కార్యాచరణ, తెలంగాణ అభివృద్ధికి దోహదం చేస్తున్న తీరు తనను ఎంతగానో ప్రభావితం చేసిందని టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత రవి చంద్ర అన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వామ్యం పంచుకుంటూ.. బంగారు తెలంగాణ సాధనలో అడుగులు వేస్తానని తెలిపారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తూ 16 పార్లమెంట్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోబోతోందని.. అధినేత కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతలను జిల్లా నేతల సహకారం, సమన్వయంతో నిర్వహిస్తానని వివరించారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో..
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పగిడిపాటి దేవయ్య గులాబీ గూటికి చేరారు. 2015 వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 1,29,980 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా వర్దన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దేవయ్య టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన దేవయ్యను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment