సాక్షి ప్రతినిధి, వరంగల్/యాదాద్రి: దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తోందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అన్నారు. ఎర్రకోటపై తెలంగాణ జెండా ఎగురవేయడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఉద్ఘాటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎంఐఎంను కలుపుకొని 17 స్థానాల్లో గెలిస్తే ఢిల్లీ పీఠాన్ని మనమే డిసైడ్ చేయొచ్చన్నారు. గురువారం వరంగల్, భువనగిరిలలో జరిగిన పార్లమెంటరీ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సంక్షేమ రంగంలో కేసీఆర్ పాలన స్వర్ణయుగం అని పేర్కొన్నారు. గతంలో తాను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీని కలసినప్పుడు కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారని చెప్పారు. ‘ఎన్నో ఉద్యమాలు వస్తాయి.. పోతాయి కానీ, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాడు. కేసీఆర్ పరిపాలనాదక్షుడిగా రూపాంతరం చెందాడు’అని జైట్లీ కితాబు ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
మోదీ, గాంధీలు మాత్రమే ప్రధానులుగా ఉండాలా..?
దేశంలో నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీ మాత్రమే ఉన్నారా? మోదీ కాకపోతే రాహుల్.. రాహుల్ కాకపోతే మోదీనే ప్రధానులుగా ఉండాలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. 12 నుంచి 15 రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్థానం లేదన్నారు. మోదీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని చెప్పారు. ఎన్డీఏకు 150, యూపీఏకు 100 సీట్లు రావని, రెండు కలసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని విమర్శించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా ఉందని కేటీఆర్ చెప్పారు. భావసారూప్య ప్రాంతీయ పార్టీలతో కలసి ముందుకు పోతామని చెప్పారు. ఢిల్లీలో శాసించే స్థాయిలో ఉండి అధిక నిధులు తెచ్చుకుందామన్నారు. ఏపీలోని పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకానికి నీతి ఆయోగ్ రూ.25వేల కోట్లు ఇవ్వాలని సూచించినా.. కేంద్రం 25 పైసలు ఇవ్వలేదని విమర్శించారు.
గత పాలకులు రైతులను పట్టించుకోలేదు
దేశంలో ఇన్నేళ్లు రైతుల గురించి ఏ ఒక్క నాయకుడు పట్టించుకున్న దాఖలాలు లేవని కేటీఆర్ విమర్శించారు. రైతుల గురించి పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎప్పటికైనా పరాయి పార్టీలేనని చెప్పారు. రైతుబంధు పథకాన్ని ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దులా కేసీఆర్ ముందుకు తీసుకుపోతుంటే, పార్లమెంట్ ఎన్నికలు సీఎం కేసీఆర్‌కు సంబంధం లేనివని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఎద్దేవా చేశారు.
నవ్విండు తప్ప రూపాయి ఇవ్వలేదు
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరితే నవ్విండు తప్ప.. రూపాయి ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కొందరు ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యన జరుగుతున్న ఎన్నికలుగా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని.. ఇవి తెలంగాణ భవితవ్యానికి అతి ముఖ్యమైన ఎన్నికలని చెప్పారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 283 సీట్లు సాధించినప్పటికీ దేశంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఈసారి బీజేపీకి 150 నుంచి 160 సీట్లు, కాంగ్రెస్‌కు 100 నుంచి 110 సీట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వారు ఒకరిద్దరు తప్పిదారి గెలిస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. గతంలో గెలుపొందిన ఎంపీలు ఢిల్లీలో గులాం జీ హుజూర్ అని చేయడానికి మాత్రమే పరిమితమయ్యేవారని మండిపడ్డారు.
నేల విడిచి సాము చేయకండి - కార్యకర్తలకు కేటీఆర్ హితబోధ
కార్యకర్తలు నేల విడిచి సాము చేయొద్దని కేటీఆర్ హితవు పలికారు. డబ్బా కొట్టుకోవడానికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం లేదని అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. వేదికపై ఎమ్మెల్యేలు చెప్పిన మెజార్టీ వివరాలను తాను రాసుకున్నానని ఎన్నికల తర్వాత అందరినీ అడుగుతానని పేర్కొన్నారు. 5 లక్షల మెజార్టీ సాధించాలని చెప్పడం కాదని, దాన్ని ఆచరణలో చేసి చూపాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment