మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’అని చెప్పే ప్రధాని తెలంగాణకు మొండిచేయి (హాథ్) ఇచ్చారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం కంటోన్మెంట్ ఏరియాలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి హాజరై ప్రసంగించారు. తెలంగాణలో రూ.80వేల కోట్లతో చేపడుతున్న కాళేశ్వరం, లేదా రూ.40వేల కోట్లతో చేపడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఏదైనా ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు.
పన్నుల్లో రాష్ట్ర వాటా మినహా కేంద్రం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో 2019లో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని నిర్ణయించే స్థాయిలో మనముంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని కూటమి 70 నుంచి 100 ఎంపీ సీట్లు సాధించి దేశంలో కీలకం కాబోతుందన్నారు. దీంతో ఢిల్లీలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని మనమే నిర్ణయిస్తామన్నారు. అఖిలేష్ సహా పలు ప్రాంతీయ పార్టీ ల నేతలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన రక్షణ, రైల్వే భూములు కావాలని ఏళ్ల తర బడి అడుగుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ప్యాట్నీ–తూముకుంట, ప్యారడైజ్–సుచిత్ర మార్గాల్లో ఫ్లై ఓవర్ల కోసం 100 ఎకరాల రక్షణ భూములకు బదులుగా 500 ఎకరాలు ఇస్తా మని చెప్పినా బదలాయించడం లేదన్నారు.
గాంధీభవన్‌లో అటెండర్లే మిగులుతారు
టీఆర్‌ఎస్‌లోకి వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలు చూస్తుంటే.. గాంధీభవన్‌లో అటెండ ర్లే మిగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తన నియోజకవర్గం పరిధిలో 20వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలం ఉందని, ఆ మేరకు సీఎం సహకారంతో త్వరలోనే నిర్మాణం చేపడతామన్నారు. ‘సీఎం హమారా.. పీఎం హమారా’అన్న నినాదంతో కేంద్రంలో టీఆర్‌ఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కేసీఆర్ కడుపున పులిబిడ్డ కేటీఆర్ పుడితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కడుపున పప్పు పుట్టాడన్నారు. విజన్ ఉన్న నేత కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తామంతా గర్వపడుతున్నామన్నారు. భారీ మెజారిటీతో సికింద్రాబాద్ ఎంపీని గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు. సభలో హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కేశవరావులు ప్రసంగించారు. మేయర్ బొంతు రామ్మోహన్ సహా పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
రాహుల్, మోదీ తప్పితే నేతలు లేరా?
పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే సాగుతున్నాయి అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు పదే పదే చెబుతున్నారని.. దేశంలో రాహుల్, మోదీ తప్పితే నేతలే లేరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల మధ్య పోటీ బోఫోర్స్, రఫేల్‌గా మారిందన్నారు. కాం గ్రెస్‌లో జోష్ లేదని, బీజేపీలో హోష్ లేదని ఎద్దేవా చేశా రు. 71 ఏళ్లలో ఒకట్రెండు ఏళ్లు మినహా ఈ 2 పార్టీలే దేశాన్ని ఏలాయని, అయినా నేటికీ చాలా గ్రా మా లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయన్నారు.
లచ్చన్న సవాలు హాస్యాస్పదం
బీజేపీ అధ్యక్షుడు లచ్చన్న (లక్ష్మణ్) మరోసారి తనపై సవాలు విసురుతుండటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి సవాలే విసిరి అభాసు పాలయ్యారని అన్నారు. అప్పట్లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్, ఉప్పల్, ఖైరతాబాద్ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు గెలిచారన్నారు. ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా లక్ష్మణ్‌కు రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి కేవలం దత్తాత్రేయకు మాత్రమే కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కగా, ఏడాదిలోనే అవమానకర రీతిలో ఆయనను పదవి నుంచి తొలగించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment