అమ్మ వస్తుంది... ఏడవకు
ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి ఓ మహిళా ఓటరు తన కుమార్తెతో కలిసి వచ్చింది. ఆ చిన్నారిని ఓ మహిళా కానిస్టేబుల్ ఎత్తుకోగా బిగ్గరగా ఏడవడంతో.. ఆమెను బుజ్జగించేందుకు ఇద్దరు మహిళా పోలీసులు ప్రయత్నించారు. అయినా ఏడుపు ఆపకపోవడంతో ఆ చిన్నారిని తల్లితో పాటు పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. దీంతో ఆమె తన కూతురిని ఎత్తుకుని ఓటు వేసింది.
ఒకరికి బదులు మరొకరు
ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి టీఎన్‌జీఓ భవన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీటీసీ కె.సునీతకు బదులు అదే పేరు ఉన్న మరో జెడ్పీటీసీ ఓటేయడం గందరగోళానికి దారితీసింది. ఆమె అధికారులతో వాగ్వాదాని కి దిగగా..వారు పొరపాటును గ్రహించి తప్పును సరిదిద్దడంతో వివాదం సద్దుమణిగింది.
లండన్ నుంచి రాక
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి ఎంపీటీసీగా టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన చిలుకూరి శ్యామల ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లారు. అయితే, పార్టీ తరఫున గెలిచిన వారంతా తప్పక ఓటు వేయాలని అధిష్టానం సూచించడంతో ఆమె కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం అక్కడి నుంచి కల్లూరు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఓటు వేశారు.
పుట్టెడు శోకంలోనూ..
నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం బాలాజీనగర్‌కు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీటీసీ సభ్యుడు మెఘావత్ బన్సీలాల్ కుమారుడు రమేష్ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అంత్యక్రియలు ముగిసిన వెంటనే పుట్టెడు శోకాన్నీ దిగమింగుకుంటూ బన్సీలాల్ బంధువుల సాయంతో వచ్చి దేవరకొండలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. పోలింగ్ కేంద్రం వద్ద తోటి ఎంపీటీసీ సభ్యులను చూసి బోరున విలపించాడు.
ఓటేసి వెళ్లి కన్యాదానం
కూతురి పెళ్లి ఉన్నా బాధ్యత మరవకుండా ఓటేశాడు ఉమ్మ డి మెదక్ జిల్లా అందోలు మండల పరిధిలోని రాంసానిపల్లి ఎంపీటీసీ సభ్యుడు గజేందర్‌రెడ్డి. ఉదయం 8.30 గంటలకు ఓటేసిన ఆయన, జోగిపేటకు 30 కి.మీ దూరంలో ఉన్న సంగారెడ్డిలోని ఫంక్షన్ హాలుకు వెళ్లి కన్యాదానం చేశాడు.
దుఃఖాన్ని దిగమింగుకుంటూ..
ఉమ్మడి మెదక్ జిల్లా కొల్చారం జెడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల సోదరుడు మధుసూదన్ సంగారె డ్డిలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. తమ్ముడి మరణ వార్తతో కుప్పకూలిన మేఘమాల, దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ఓటేసిన అనంతరం స్వగ్రామానికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment