కాంగ్రెస్‌కు పునర్‌‘జీవన్‌’ | Congress Party T.Jeevan Reddy MLC Elections 2019 | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పునర్‌‘జీవన్‌’

Published Thu, Mar 28 2019 1:13 PM | Last Updated on Thu, Mar 28 2019 1:13 PM

Congress Party T.Jeevan Reddy MLC Elections 2019 - Sakshi

సాక్షి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిని అల్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి శాసనమండలి ఎన్నికలు ఊపిరిలూదాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్‌కు ఊరట లభించింది. లోకసభ ఎన్నికలకు పదిహేను రోజుల ముందు జీవన్‌రెడ్డి గెలుపు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి ఘన విజయం పార్టీకి ఊరటనిచ్చింది. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా గల్లంతవడం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిదింటిలో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి అసెంబ్లీలో కనీస ప్రాధాన్యత లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు కూడా పార్టీని వీడుతుండడం, ఉద్ధండ నేతలు కూడా అందులో ఉండడం క్యాడర్‌ను కలవరపరుస్తోంది. కొంతమంది టీఆర్‌ఎస్‌లోకి, మరికొందరు బీజేపీలోకి చేరుతుండడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. రోజుకో ఎమ్మెల్యే, పూటకో నాయకుడు పార్టీని వీడుతుండడంతో, ఇక తెలంగాణలో టీడీపీ తరహా పరిస్థితి కాంగ్రెస్‌కు కూడా ఎదురవబోతుందనే ప్రచారం చోటుచేసుకొంది. ఈ సమయంలో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అనూహ్యంగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి పోటీ చేయడం అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూసిన జీవన్‌రెడ్డి, ఏ ధైర్యంతో ఎమ్మెల్సీకి పోటీచేస్తున్నారనే మాటలు మొదట్లో వినిపించాయి. కాని పట్టువదలని విక్రమార్కుడిలా జీవన్‌రెడ్డి పోటీ చేయడమే కాకుండా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలుమార్లు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయన దూకుడును చూసిన పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగస్వామ్యులయ్యారు. ఎమ్మెల్సీ పోలింగ్‌ రోజు కేంద్రాల వద్ద ఉండి కాంగ్రెస్‌ శ్రేణులు జీవన్‌రెడ్డికి ఓటు అభ్యర్థించారు. జీవన్‌రెడ్డితోపాటు బీజేపీ అభ్యర్థి పి.సుగుణాకర్‌రావు, యువతెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ పోటీ చేశారు.

కాగా టీఆర్‌ఎస్‌ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకుండా, పోటీకి దూరంగా ఉంటున్నట్లు ముందుగా ప్రకటించింది. కానీ స్థానిక పరిస్థితుల కారణంగా మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో చంద్రశేఖర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కాకుండా ఆ పార్టీ మద్దతుతో పోటీకి దిగారు. ఆయన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులతో సమన్వయం చేసుకోవడంలో విఫలమైనట్లు ఆ పార్టీ నేతలే అంటున్నారు. చివరకు చంద్రశేఖర్‌గౌడ్‌పై జీవన్‌రెడ్డి భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యతలోనే విజయం సాధించడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను, అన్ని రౌండ్లలోనూ జీవన్‌రెడ్డి సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించడం విశేషం. కాగా జీవన్‌రెడ్డి వ్యక్తిగత చరిష్మాకు కాంగ్రెస్‌ పార్టీ తోడు కావడంతో ఘన విజయం సాధ్యపడినట్లు పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఏదేమైనా లోకసభ ఎన్నికలు మరో పదిహేను రోజుల్లో జరగనున్న నేపథ్యంలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించడం ఆ పార్టీకి జవసత్వాలు నింపినట్లయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement